- డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రానున్న ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు వేడుకలు ఘనంగా జరిగేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు జరపాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. ఈ మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై బుధవారం సీతాఫల్ మండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం 176 దేవాలయాల నిర్వాహకులకు దాదాపు రూ.80 లక్షల మేరకు బోనాలు నిధుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా 2015 సంవత్సరంలో ప్రత్యేకంగా ఆలయాలకు నిధులు మంజూరు చేసే పద్దతిని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వం నిధులను సమకుర్చుతోందని అన్నారు. బోనాల వేడుకల్లో మహిళా భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని దేవాలయాల వద్ద విధిగా పోలీసు సిబ్బందిని నియమించి బందో బస్తును పర్యవేక్షించాలని, సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అన్ని విభాగాలు సమన్వయంగా వ్యవహరించాలని, సీతాఫల్ మండీ లోని తమ క్యాంపు కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి, బీఆర్‌ఎస్ యువ నాయకులు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-