తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే అధ్యక్ష పదవికి పోటీపడి తీరుతానని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు పెద్ద ఎత్తున అధికారిక పత్రాలను తన ఇంటికి తీసుకెళ్లారన్న అభియోగాలపై ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మంగళవారం ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేసు విచారణపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తర కరోలినా, జార్జియాలో నిర్వహించిన రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు.
తమ ఉద్యమాన్ని అణచివేసేందుకే ఒకదాని తర్వాత మరో విచారణ చేపడుతున్నారని అన్నారు. తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా విడిచిపెట్టబోనన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. తాను రిపబ్లికన్‌ను కావడం వల్లే వేధిస్తున్నారని, తనపై విచారణ తంతు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని ట్రంప్ అన్నారు.