Saturday, July 27, 2024

అసైన్డ్‌ భూములపై 66,111 మందికి పూర్తి హక్కులు..( పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన ఏపీ కేబినేట్.. )

తప్పక చదవండి
  • ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం..
  • అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణం..
  • 1966 గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటు..
  • వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ 65 ఏళ్లు..
  • అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణ..
  • కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరు..
  • గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ. 454 కోట్ల ప్యాకేజీ..
  • కలవృత్తులకు ఇచ్చిన ఇనాం భూములపై నిషేధం ఎత్తివేత..
  • ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితుల రుణాలు మాఫీ

అమరావతి : ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడున్నర గంటలపాటు 55 అంశాలపై కేబినెట్‌ భేటీ జరిగింది. సిఎం జగగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం పలు కీక నిర్ణయాలు తీసుకుంది. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు చేసింది. అలాగే.. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్‌ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదించింది. ఆర్‌`5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌ సున్నా వడ్డి పథకం అమలుకు.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే జనవనరుల శాఖలో పలు నిర్ణయాలకు కూడా ఆమోదం ఇచ్చేశారు. అసైన్డ్‌ భూములపై అనుభవదారులకి సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 సంవత్సరాలకు ముందు కేటాయించిన భూములకు సైతం హక్కులు కల్పించేలా నిర్ణయించారు. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌ మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఒరిజినల్‌ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్‌ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది. 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు నిర్ణయిం తీసుకుంది. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ చేశారు. తద్వారా పూర్తి హక్కులు కల్పిస్తారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ ఈ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో.. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్‌ ఓకే చెప్పింది. ఇకపోతే రాష్ట్రంలో అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. టోఫెల్‌ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదించింది. కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా భావన పాడు మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ. 3,880 కోట్లు రుణం. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకునేందుకు కేబినెట్‌ అనుమతించింది. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ, లంక భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్‌ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి 750 కోట్లు రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. గండికోట రిజర్వాయర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 454 కోట్ల పరిహార ప్యాకేజీ మంజూరుకు కేబినెట్‌ ఆమోదం దక్కింది. రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. ఈ నెల 18న జగనన్నతోడుకు క్యాబినెట్‌ ఆమోదం ఇవ్వగా, ఈ నెల 21న నేతన్న నేస్తం కింద లబ్దిదారులకు నిధులు జమ చేయాలని నిర్ణయించారు. 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు నిధులు జమ చేస్తారు. 28న జగనన్న విదేశీ విద్యాదీవెన కింద నిధులు జమ అవుతాయి. 1700 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మసాన వాటికలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 14,213 ఎకరాలకు రుణాలు మాఫీ కానున్నాయి. కుల వృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన ఇనామ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు ఆమోదం ఇచ్చారు. దీనిద్వారా 1.13 లక్షలమంది బీసీలకు ఉపయోగం కలుగనుంది. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. విశాఖ భూముల అక్రమాలకు సంబంధించిన సిట్‌ రిపోర్టుకు కేబినెట్‌ ఆమోదించింది. ఈ నెల 28న జగనన్న విదేశీ విద్య ద్వారా 400 మంది విద్యార్ధులకు సాయం అందనుంది. ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ది కళాశాలలకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లో 11 పోస్టులు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదించింది. 13 కొత్త జిల్లాల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌హెచ్‌ఆర్సీకి 9 పోస్టులు మంజూరు చేస్తూ ఆమోదం ఇచ్చారు. ఏపీ లోని కొత్త 5 మెడికల్‌ కళాశాల ల్లో 706 పోస్టులు, బోధనా కోసం 480 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం దక్కింది. పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగం ఏర్పాటు, పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులతో సిఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని సూచించారు. నిత్యం ప్రజల్లోనే ఉండాలంటూ దిశానిర్దేశర చేశారు.ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు. జగనన్న సురక్ష కార్యక్రమం బాగా జరుగుతోందన్న సీఎం.. మరింత బాగా కొనసాగించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మెరుగ్గా సాగేలా చూడాలని సూచించారు. అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు రాగా.. అద్భుతమైన ఫలితాలపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు