- కరెన్సీ లేక ఆగిన రూ.2000 నోట్ల మార్పిడి
- తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..
బ్యాంకులకు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో వాటిని మార్చి ఇచ్చేందుకు ఆయా బ్యాంకు శాఖల్లో నోట్ల కొరత ఏర్పడుతున్నది. పెద్ద ఎత్తున జనాలు బ్యాంకులకు వస్తుండటంతో నగదు లేక నోట్ల మార్పిడి ప్రక్రియను బుధవారం తాత్కాలికంగా ఆపేశారు బ్యాంకర్లు. మంగళవారం నుంచే రూ.2000 నోట్ల మార్పిడి మొదలవగా, రెండో రోజే బ్యాంకులకు కరెన్సీ కష్టాలు రావడం ఇప్పుడు ఒకింత ఆందోళనకరంగా మారింది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు సరిపడా బ్యాంకు శాఖల్లో ఉండటం లేదని చెప్తున్నారు. దీంతో చేసేదేమీ లేక బ్యాంకర్లు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
ఫలితంగా నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నోట్ల మార్పిడి ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్తున్నా.. పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. నోట్ల మార్పిడి మొదలైన రెండో రోజే బ్యాంకుల్లో కరెన్సీ కొరత ఏమిటని ప్రశ్నిస్తున్నారు అంతా ఇప్పుడు. ఈ ఏడాది సెప్టెంబర్ 30దాకా రూ.2000 నోట్ల మార్పిడికి వీలుండగా, ఒకసారి రూ.20,000లకు మించి నోట్ల మార్పిడికి ఆర్బీఐ అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. కాగా, చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్లు 10.8 శాతమని, వీటి విలువ రూ.3.6 లక్షల కోట్లని ఆర్బీఐ చెప్తున్నది