Saturday, April 20, 2024

వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ సంకేతాలు..

తప్పక చదవండి

గత ఏడాది మే నుంచి కేవలం 9 నెలల్లో 250 బేసిస్‌ పాయింట్లు (2.50 శాతం) వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌బ్యాంక్‌ ఒక చిన్న బ్రేక్‌ తర్వాత మరింతగా పెంచవచ్చన్న భయాలు తిరిగి మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాట పడుతుందంటూ ఎంతో విశ్వాసం కనపర్చిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ తాజాగా రేట్ల పెంపు ఆందోళనల్ని పెంచుతూ సంకేతాలిచ్చారు. తమ చేతుల్లో ఏమీ ఉండదని, విదేశీ, దేశీయ పరిణామాలు రేట్ల పెంపును నిర్దేశిస్తాయని కుండబద్దలు కొట్టారు. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ కేంద్ర బ్యాంక్‌ రెపో రేటును 2.50 శాతం పెంచడంతో ఈఎంఐల భారం పెరిగి వినియోగదారులు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ రెపో రేటు 4 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. ఫలితంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.5-7 శాతం నుంచి 8.75-9.25 శాతానికి ఎగిసాయి. జూన్‌ 6-8 తేదీల మధ్య తదుపరి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్నది. వచ్చే పది రోజుల్లో కీలకమైన అంతర్జాతీయ సవాలు ఉన్నది. అమెరికా ప్రభుత్వపు రుణ సమీకరణ పరిమితి పెంపునకు అక్కడి సెనేట్‌ ఆమోదం లభిస్తుందా లేదా అన్నది కీలక అంశం. కొద్ది రోజులపాటు బిల్లులు చెల్లించడానికి మాత్రమే తమ వద్ద నిధులు ఉన్నాయని, డెట్‌ సీలింగ్‌ పెంపునకు అనుమతి లభించకపోతే ప్రభుత్వం డిఫాల్ట్‌ అవుతుందని అమెరికా ఆర్థిక మంత్రి జన్నెత్‌ ఎలెన్‌ ఇప్పటికే హెచ్చరించారు. యూఎస్‌ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయితే ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లు అతాలాకుతలం అవుతాయి. ఈ పరిణామాన్ని సైతం ఆర్బీఐ గవర్నర్‌ పరిగణనలోకి తీసుకునే తాజా సంకేతాలిచ్చి ఉంటారని విశ్లేషకులు చెపుతున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైన తర్వాత రేట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించిన యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఇటీవలకాలంలో ద్రవ్యోల్బణం దిగివచ్చినా గత మే నెలలోనూ పావుశాతం రేట్లను పెంచింది. కానీ ఏప్రిల్‌లోనే రిజర్వ్‌బ్యాంక్‌ రేట్ల పెంపు ప్రక్రియకు విరామం ఇచ్చింది. దీంతో ఈ ఏడాదంతా రేట్లు పెరగబోవని, 2024 ప్రారంభంలోనే రెపోను తగ్గిస్తుందన్న అంచనాలు పలు వర్గాల నుంచి విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆర్బీఐ గవర్నర్‌ ద్రవ్యోల్బణం, రేట్ల పెంపుపై ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్‌ 8 తర్వాత తర్వాత ఆగస్టు, అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఎంపీసీ రేట్ల సమీక్షా సమావేశాలు ఉన్నాయి. జూన్‌ 13-14 తేదీల్లో యూఎస్‌ ఫెడ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పటికే అమెరికా కంటే భారత్‌ రెపో రేటు పావుశాతం వెనుకపడి ఉన్నందున బాండ్ల మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులు తరలివెళ్లే ప్రమాదం ఉన్నది. యూఎస్‌ ఫెడ్‌ జూన్‌ మీట్‌లో సైతం మరో పెంపు ప్రకటిస్తే, రిజర్వ్‌బ్యాంక్‌ ఉపేక్షించలేని పరిస్థితి తలెత్తుందన్న ఆలోచన సైతం శక్తికాంత్‌దాస్‌ మాటల్లో కన్పిస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు