ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. పేరు చెబుతూ బుకాయిస్తున్న హెర్బా లైఫ్ యాజమాన్యం
- సరైన పత్రాలు చూపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు..?
- న్యూట్రీషన్ ప్రోడక్ట్ పేరుతో మత్తు పదార్థం సరఫరా
- ప్రతి వ్యక్తి దగ్గర వేలరూపాయలు వసూలు చేస్తున్న హెర్బా లైఫ్
- అనుమతులు లేకుండా రిఫెరల్ బిజినెస్ పద్దతిలో మల్టీ లెవల్ మార్కెటింగ్
- నిషేధిత వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలు
- డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
- ప్రతి ప్రోడక్ట్ ఆయుష్‌కి చేరుతుంది.. మరెందుకు నిజాలను దాస్తున్నారు..?
- నెలలు గడుస్తున్నా చర్యలకు వెనుకాడుతున్న ఆయుష్ డిపార్ట్మెంట్
- మామూళ్లు అందుతుండటంతోనే మిన్నకుండి పోతున్నారని అనుమానం
- ఆయువుపట్టు లాంటి ఆయుష్.. ప్రజల ఆయుస్సు కాలరాస్తున్న దౌర్భాగ్యం
హైదరాబాద్ : వీరు సరఫరా చేసున్న హెల్త్ ప్రోడక్ట్స్ కి ఎలాంటి అనుమతులు లేవు.. హెల్త్ ప్రోడక్ట్స్ పేరుమీద నిషేధిత మల్టి లెవల్ మార్కెటింగ్ చేస్తూ అమాయకులను నిలువునా ముంచుతున్నారు.. వీరిపై ఆయుష్ లాంటి ముఖ్యమైన డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడం శోచనీయం.. గతంలో కూడా వీరి వ్యవహారాలపై సిటీ పోలీస్ కమిషనర్ దృష్టిపెట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చినా.. తిరిగి వీరు నిరంతరంగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.. వీరికి చట్టాలన్నా, పోలీసులన్నా లెక్కలేదు.. ప్రజల ఆరోగ్యాలన్నా పట్టింపులేదు.. నియంత్రించాల్సిన ఆయుష్ లాంటి శాఖలను సైతం లంచాలతో కొనేస్తూ తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నారు.. వాస్తవాలను కళ్ళముందు ఉంచినా తాము ఎలాంటి మోసం చేయడం లేదని, తమ హెల్త్ ప్రోడక్ట్స్ కి అన్ని అనుమతులు ఉన్నాయని బుకాయించడం చూస్తుంటే వీరు ఇంతకు తెగించారన్నది యిట్టే అర్ధం అవుతోంది.. హెర్బా లైఫ్ కంపెనీ వారి బరితెగింపు మరోమారు మీ ముందుకు.. డాక్టర్లు కూడా హెర్బా లైఫ్ ప్రొడక్ట్స్ ఎందుకూ పనికిరావని చెబుతున్నారు.. కానీ అమాయకుల అవసరాలను, వారి బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ హెర్బా లైఫ్ కంపెనీ ప్రభుత్వం నిషేధించిన మల్టి లెవల్ మార్కెటింగ్ ని యథేచ్ఛగా అమలు చేస్తూ.. లక్షల్లో అక్రమంగా సొమ్మును కొల్లగొడుతున్నారు.. కొన్ని సంవత్సరాలుగా హెర్బల్ లైఫ్ అనే కంపెనీ ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాలో హెల్త్ న్యూట్రిషియన్ అని, కొన్ని వేల న్యూటిషియన్ ప్రోడక్ట్ పేరుతో హెల్త్ న్యూట్రిషియన్ క్లబ్ అని కొన్ని రసాయనాలు కలిపి కొన్ని లక్షల మంది రోగులకు అందిస్తున్నారు.. కాగా నెలకు ప్రతి వ్యక్తి దగ్గర నుండి రూ.. 6900/`లు (అక్షరాల ఆరు వేల తొమ్మిదివందల రూపాయలు) వసూలు చేస్తూ.. హెర్బల్ ప్రోడక్ట్స్ ని అందులో రుచి వచ్చేటట్లు గుర్తు తెలియని కొన్ని ద్రవరూప రసాయనాలు కలిపి సామాన్య జనాలకు సరఫరా చేస్తున్నారు.. పైగా న్యూట్రిషియన్ క్లబ్ లో జాయిన్ కండి.. మీరు ఇంకొకరిని జాయిన్ చేయండి… అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రిఫరల్ బిజినెస్ పద్ధతిలో.. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు..
ఒక్కొక్క క్లబ్ లో 100 మంది నుండి 140 మంది వరకు జాయిన్ చేసుకొని.. బిపి, షుగర్, వెయిట్ లాస్ అని ప్రజలను మోసం చేస్తున్నారు.. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో హెర్బల్ ఫుడ్ ప్రోడక్ట్ కు ఏ విధంగా అనుమతినిచ్చారో తెలియాల్సి ఉంది.. హెర్బల్ లైఫ్ కంపెనీ ద్రవపదార్ధాలు అని ఒక్కొక్క ప్రోడక్ట్ రూ. 20,000 మొదలుకొని రూ 20,000 వరకు ఉన్నాయి. ఈ విధంగా కాళ్ళ నొప్పులు, శరీర నొప్పులు, వాంతులు, విరేచనాలు కూడా ఈ హెర్బల్ లైఫ్ ద్వారా తయారు చేయబడిన మందులు వాడితే రోగాలన్నీ నయమవుతాయని న్యూట్రిషియన్ క్లబ్ ద్వారా ఉపన్యాసాలిస్తూ.. సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు.. హెర్బల్ లైఫ్ న్యూట్రిషియన్ క్లబ్ లకు అసలు అనుమతి ఉందా..? తమకు ఫిర్యాదు అందినా స్పందించకుండా ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు వ్యవహరిస్తున్నారు..? అనే విషయాలపై విచారణ జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నివేలమందికి న్యూట్రిషియన్ క్లబ్ పేరిట అంబాసిడర్ అని, కోచర్లు అని, వివిధ పదవులు ఇచ్చి, ప్రమోషన్లు ఇస్తున్నామని, మీరు కొంతమందిని ఈ క్లబ్ లో జాయిన్ చేస్తే 25 శాతం నుండి 50 శాతం వరకు సీనియర్లకు డిస్కౌంట్ అని మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు.. తెలంగాణలో ఈ హెర్బల్ లైఫ్ వ్యాపారం చేయడా నికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి అనుమతులు ఉన్నాయో..? తెలుపగలరని సమాచార హక్కు చట్టం ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కమిషనర్ కు కోరడం జరిగింది. కమిషనర్ అందించిన సమాచారం ప్రకారం హెర్బల్ లైఫ్ కంపె నీకి రికార్డుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ కాలేదు.. ఎలాంటి అనుమతులు లేవు అని స్పష్టంగా తెలపడం జరిగింది.
ఇది హెర్బల్ఫ్ ప్రోడక్ట్ ఒక మత్తు పదార్ధమని (డ్రగ్స్) దీనిలో సామాన్యమైన ప్రజలకు తెలియని రసాయన పదార్ధాలు కలపడం వలన.. కొంత ద్రవపదార్ధమును రుచికరంగా తయారు చేయుచున్నారు. ఈ రుచికరమైన హెర్బల్ లైఫ్ ద్రవపదార్థాల వలన సామాన్యమైన ప్రజలు ఈ మత్తుకు అలవాటు పడి ఉదయం, రాత్రి పూట కొన్ని లక్షల మంది భోజనం తినడం కూడా మానివేశారని కూడా తెలుస్తోంది.. కావున వీటి పైన సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆయుష్ డైరెక్టర్ ని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు..
అసలు హెర్బల్ లైఫ్ అనే కంపెనీ ఏవిధంగా తన కార్యకలాపాలను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తోంది..? ఎవరి అనుమతులతో ప్రాణాంతక మందును సామాన్యులకు సరఫరా చేస్తోంది..? ఏ ప్రామాణికాలు పాటిస్తూ మందును మార్కెట్ లోకి తీసుకువెళ్తున్నారు..? మందు ధరను ఎవరు నిర్ణయించారు..? ఇంత జరుగుతున్నా అనుమతులు ఇవ్వాల్సిన ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఏమి చేస్తున్నారు..? ప్రజల ఆరోగ్యాలపై విపరీత దుష్ప్రభావం చూపే మందులను అరికట్టాల్సిన ఆయుష్ అధికారులు కూడా లంచాలకు మరిగి మిన్నకుండిపోతున్నారా..? ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న హెర్బల్ లైఫ్ కంపెనీ వెనుక దాగివున్న అసలు వాస్తవాలు ఏమిటి..? ఆయన విషయాలను వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..
ఇదే విషయమై హెర్బా లైఫ్ కంపెనీ హెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డ సి.ఎస్.ఆర్. డైరెక్టర్ శరణ్యను ఆదాబ్ వివరణ కోరగా.. తమ ప్రొడక్ట్స్ కి ఆయుష్ నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. తమ ప్రొడక్ట్స్ ఆయుష్ డిపార్ట్మెంట్ కిందకి రావు.. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. ( ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ) పరిధిలోకి వస్తాయి.. వారి నుండి తమకు అనుమతులు ఉన్నాయి.. అని చెప్పడం జరిగింది.. ఒక వేళ ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. అనుమతులు ఉన్నట్లు పత్రాలు చూపించమని అడిగితే.. దానిని దాటవేస్తూ కేవలం మెయిల్ ద్వారా అనుమతులు ఉన్నాయని వ్రాతపూర్వకంగా తెలపడం గమనార్హం..