- సిబ్బందికి జీతాలు చెల్లించని కాంట్రాక్టర్
- విధులకు హాజరుకాని సిబ్బంది
- పైపులు పగిలి నీటి సరఫరా బంద్
- పట్టించుకోని అధికారులు
బోనకల్ : మండలం లోని రామాపురం, గార్లపాడు, గోవిందపురం (ఎల్) లక్ష్మీపురం, రావినూతల,స్టేషన్ రావినూతల గ్రామాలకు గత వారం రోజులుగా భగీరద నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా బాధ్యతను ప్రభుత్వం ఎల్,టి కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వగా, సదరు కంపెనీ నీటి సరఫరా కోసం సిబ్బందిని నియమించుకొని జీతాలు చెల్లిస్తున్నది. గత కొన్ని రోజులుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది విధులను బహిష్కరించారు. ఇదే నేపథ్యంలో మండల పరిధిలోని గార్లపాడు వద్ద మిషన్ భగీరథ పైపు పగలటంతో, నీటి సరఫరా అంతరాయం కలిగింది. పగిలిన పైపులకు సరి చేయటానికి సిబ్బంది నిరాకరించటంతో నీటి సరఫరా జరగక 6 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. కనీసం త్రాగడానికి కూడా నీళ్లు లేవని వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ బావుల నుండి నీటిని సరఫరా చేస్తున్నారు. అలాంటి అవకాశం లేని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పంచాయతీ వారు టాంకర్ ద్వారా నీటి సరఫరా అందించాలని, మిషన్ భగీరథ ఉన్నతాధికారులు సమ్మె చేస్తున్న సిబ్బందికి త్వరితగతిన ఎల్,టి కంపెనీ నుండి జీతాలు వచ్చేలాగా చేసి నీటి సమస్యను తీర్చాలని పలువురు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
తప్పక చదవండి
-Advertisement-