Tuesday, June 25, 2024

సర్వే చాటున మర్మం ఏమిటి..?

తప్పక చదవండి
  • సర్వేతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కబ్జా గుట్టు రట్టు అయ్యేనా?
  • పూటకో మాట రోజుకో కథతో దాటవేసే ధోరణిని అవలంబిస్తున్న అధికారులు
  • అధికార పార్టీకి దాసోహం అంటున్న అమీన్ పూర్ రెవెన్యూ అధికారులు….
  • రోజుకో మలుపు తిరుగుతున్న శంభుని కుంట ఎఫ్ టి ఎల్ కబ్జా వ్యవహారం..
  • సర్వేను రెండు సార్లు వాయిదా వేసిన తహశీల్దార్..
  • తహశీల్దార్ దశరథ్ సర్వే లేదని చెప్పడంపై వెనుదిరిగిన కాంగ్రెస్
    కౌన్సిలర్ కాట సుధారాణి..

సర్వేలు అనేవి పారదర్శకంగా ఉండాలి.. కానీ సర్వేల పేరుతో అవినీతిపరులైన అధికార పార్టీ నాయకులను రక్షిస్తున్నారు కొందరు అధికారులు.. అమీన్ పూర్ మున్సిపాలిటీ అధికార బీఆర్ఎస్ పార్టీ స్థానిక చైర్మన్ పాండు రంగారెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో నిర్మిస్తున్న భవనం ఎఫ్.టీ.ఎల్. పరిధిలోకి వస్తుందని గతంలోనే అధికారులు ఇచ్చిన సర్వే రిపోర్ట్ తేల్చి చెబుతుంది. రిపోర్టు ఆధారంగా ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని తొలగించి శంభునికుంటను కాపాడాలని రెవెన్యూ అధికారులని కోరింది. కానీ రెవెన్యూ అధికారులు గందరగోళాన్ని సృష్టిస్తూ సర్వే చేపించాలంటూ తిరిగి ఇరిగేషన్ అధికారులకు లెటర్ పంపించడంతోనే అసలు కథ మొదలయింది. రెవెన్యూ అధికారుల సర్వే రిపోర్ట్ ఆధారంగానే ఎఫ్.టి.ఎల్. బఫర్ జోన్ ప్రాంతం నిర్ణయించబడుతుంది. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు గందరగోళం సృష్టిస్తూ కబ్జా వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకొని చైర్మన్ కుటుంబ సభ్యులకు పరోక్ష సహకారం అందించడం అమీన్ పూర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనాప్పటికీ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులే కబ్జాదారులకు పరోక్ష సహకారం అందించడం చూస్తుంటే అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన విధంగా ఉంది అమీన్ పూర్ రెవెన్యూ అధికారుల వ్యవహార తీరు.

హైదరాబాద్, 31 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండల తహశీల్దార్ కార్యాలయ సమీపంలో ఉన్న శంభుని కుంట 765 సర్వే నెంబర్ లో ఉంది.. ఈ యొక్క చెరువును చెరబట్టిన కబ్జా దారులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం సుమారు 140 మందికి గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు ఎన్.జీ.టి.కి సమర్పించిన రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.. ఒక వైపు ప్రభుత్వానికి ఎఫ్టీల్ బఫర్ జోన్లను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది.. రాష్ట్ర ప్రభుత్వం అమీన్ పూర్ మండల పరిధిలో ఉన్న చెరువులను అన్యాక్రాంతం కాకుండా పరి రక్షించుటకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.. చెరువులను పరిరక్షించాల్సిన అమీన్ పూర్ మండల తహశీల్దార్ దశరథ్ తనకేమీ తెలియదన్న చందాన వ్యవహరిస్తూ.. సర్వేల పేరుతో కాలయాపన చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది.. స్థానిక ఛైర్మన్ పాండు రంగారెడ్డి భార్య పేరుతో శంభుని కుంట చెరువు ఎఫ్.టి.ఎల్. ను కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేస్తున్న విషయంపై గౌరవ హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ కౌన్సిలర్ కాట సుధారాణి.. కోర్టు ఆదేశాలతో నాలుగు వారాల్లో సర్వే చేసి చర్యలు తీసుకోవాలని తెలుపడంతో ఇప్పటికీ అమీన్ పూర్ మండల తహశీల్దార్ రెండు సార్లు పిర్యాదుదారులకు సర్వే ఉంది రావాలంటూ సమాచారం అందించారు.. సర్వే చేయుటకు అధికారులు వస్తారేమోనని అధికారులు చెప్పిన సమయానికి ఇప్పటికీ రెండు సార్లు హాజరు అయ్యారని పిర్యాదుదారు కౌన్సిలర్ సుధారాణి పేర్కొన్నారు.. సర్వే ఉందని చెప్పి తీరా సమయానికి తహశీల్దార్ తనకు జ్వరం వచ్చిందని, మరో రోజు రావాలని సూచించడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇది ఇలా ఉంటే అమీన్ పూర్ లో ఛైర్మన్ అధికార పార్టీ నాయకుడు కాబట్టే వారి కుటంబసభ్యుల పేరుతో శంభుని కుంట ఎఫ్.టి.ఎల్. లో కడుతున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చకుండా యదేచ్ఛగా నిర్మాణం కొనసాగించడం వెనుక తహశీల్దార్ హస్తం ఉందనే ఆరోపణలు ఈ ప్రాంతంలో జోరుగా వినిపిస్తున్నాయి… అమీన్ పూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఆర్.ఐ. కి సర్వే సమాచారం లేదు అనడంతో వారి ఆరోపణకు బలం చేకూరుతోంది.. అమీన్ పూర్ లో పనిచేసే సర్వేయర్ ను అసలు సర్వే ఉందా..? లేదా..? ఏమైనా సర్వే సమాచారం తెలుసా అని అడుగగా.. తాను ఇటీవలే వారం క్రితం బదిలీపై వెళ్లారని తెలిపారు.. చైర్మన్ కుటుంబ సభ్యుల పేరుతో శంభుని కుంట వద్ద నిర్మిస్తున్న బిల్డింగ్ సర్వే గురించి ఏమైనా తెలుసా..? అని సర్వేయర్ అడుగగా ముమ్మాటికీ ఎఫ్.టి.ఎల్. లోనే నిర్మిస్తున్నారని.. అట్టి నిర్మాణం 765 సర్వే నెంబర్ లోనే ఉందని చెప్పారు.. ప్రస్తుత సర్వేయర్ కొత్త వారు వచ్చారని అట్టి సర్వే విషయం వారే చూస్తారని అన్నారు.. కార్యాలయ అధికారులకు సర్వే సమాచారం లేకుండా పిటిషనర్ ను సర్వే పేరుతో సర్వే చేయకుండా ఉద్దేశ్య పూర్వకంగా కాలయాపన చేయడం ఏంటని పిటిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఒక వైపు కబ్జా విషయం కోర్టులో నడుస్తున్నా మరోవైపు యథేచ్ఛగా నిర్మాణ పనులు ఆపకుండా చేయడం అధికారుల అవినీతికి అద్దం పడుతోంది… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు చీఫ్ సెక్రెటరీ సమర్పించిన రిపోర్టు లో 140 మంది కబ్జాకు పాల్పడ్డట్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాల్సిన తహశీల్దార్ ఆక్రమణదారులకు వత్తాసు పలుకడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. ఇలాంటి తహశీల్దార్ ల వల్లే ప్రభుత్వ భూములు అనేవి లేకుండా కనుమరుగవుతున్నాయని పలువురు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.. ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కు తెలిపితే కబ్జాచేసి అక్రమంగా నిర్మిస్తున్న వ్యక్తికి నోటీసు ఇచ్చిన తహశీల్దార్ కాలయాపన చేస్తూ.. పరోక్షంగా దురాక్రమణ దారులకు సహకరిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. సర్వే చేస్తే అధికార పార్టీ నాయకుడి కబ్జా బాగోతం గుట్టు రట్టు అవుతుందని అందుకే సర్వే చేయుటకు వెనుకడుగు వేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.. తప్పు చేసిన వారిని తప్పిచేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని, పూటకో మాట రోజుకో కథ.. దాటవేసే ధోరణిలా అధికారుల తీరు ఉందంటూ స్థానికులు మండి పడుతున్నారు.. కబ్జా చేసిన చైర్మన్ కుటుంబ సభ్యులపై, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను దిక్కరిస్తున్న అధికారులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోని పారదర్శకమైన పాలన అందేలా చూడాలని, అన్యాక్రాంతం అవుతున్న చెరువు భూమిని రక్షించాలని, అక్రమ నిర్మాణాన్ని తక్షణమే సర్వే చేసి కూల్చివేయాలని పలువురు స్థానిక ప్రజలు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు కోరుతున్నారు.. ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అక్రమాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘ మా అక్షరం అవినీతిపై అస్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు