- నాలాను మింగి కాలనీలను నీటిలో ముంచిన దుర్మార్గం..
- అవినీతిమయంగా కేసీఆర్ ఆధీనంలో ఉన్న ఇరిగేషన్ శాఖ..
- బడా నిర్మాణదారుల బరితెగింపుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సంపూర్ణ సహకారం..
- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం అమలు చేయని అమీన్ పూర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ..
- చెరువుల పరిరక్షణకు చర్యలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం…
- అమీన్ పూర్ మున్సిపాలిటీ వాణీ నగర్ లో నరకయాతన పడుతున్న స్థానికులు..
సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధీనంలో ఉన్న నీటిపారుదల శాఖ అవినీతిలో కూరుకుపోయి కుంటలు, చెరువులు, కాలువలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి.. ఇంతటి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న బడా బిల్డర్లకు అధికారులు తమ వంతు సహకారం అందించడం శోచనీయం… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు సైతం అమీన్ పూర్ లో నోచుకోకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది.. స్థానిక ప్రజా ప్రతినిధులే, బడాబాబులతో చేతులు కలిపి.. ప్రజల ఆస్థులను ధారాదత్తం చేయడం సిగ్గుచేటు.. ఉన్నత న్యాయస్థానం సైతం చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేయడం ఈ ప్రభుత్వానికి చెరువుల పరిరక్షణపై ఉన్న శ్రద్ధను తెలియజేస్తుంది… ముఖ్యమంత్రి గారూ ఇప్పటికైనా కళ్లుతెరవండి అంటూ వర్షాల వరదలకు నరకం చూసిన బాధితులు కోరుతున్నారు..
సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండలంలో అర్బన్ రైస్ నిర్మాణ సంస్థ అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది… తమ అక్రమ నిర్మాణానికి అడ్డువస్తే చెరువులు, కుంటలతో పాటు కాలువలు సైతం తమ స్వరూపాన్ని మార్చుకోవాల్సిందే… అందుకు అన్ని శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధుల సంపూర్ణ సహకారం ఉంటుంది… కాలువల స్వరూపాన్ని మార్చడంతో వర్షాలు పడితే కాలనీలు నీట మునిగినా డోంట్ కేర్ అంటూ నిర్మాణాలను కొనసాగిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అర్బన్ రైస్ నిర్మాణ సంస్థకు.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాన్ని తెలియజేస్తుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధీనంలో ఉన్న నీటి పారుదల శాఖ అధికారులు ఇంతటి అవినీతికి పాల్పడుతున్నా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు అవినీతి అధికారులపై దృష్టి సారించకపోవడంతో అంతా వారికి తెలిసే జరుగుతుందనడానికి నిదర్శనం. గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమీన్ పూర్ మండలంలో కుంటలు, నదీ పరివాహిక ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలిగించి, ఆప్రాంతంలో ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసి, వాటి పరిరక్షణకు లేక్ ప్రొటక్షన్ కమిటీని నిర్మించించి.. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ పరిధిలో ఉంటుంది.. ఇదే విషయాన్ని సీఎస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలియజేయడం జరిగింది.. అయినప్పటికీ ఎన్.జీ.టి. ఆదేశాలు నేటికీ నోచుకోకపోవడమే కాక.. కొత్తగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటం ఇరిగేషన్, రెవెన్యూ, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులు సైతం కబ్జాదారులకు ఏవిధంగా కొమ్ముకాస్తున్నారనేది తేట తెల్లమవుతోంది.. ఇటీవలే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.. అయినా అధికారుల తీరు మారకపోవడం అత్యంత శోచనీయం.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నాటి సీఎస్ సోమేశ్ కుమార్ ఎన్.జీ.టి. కి సమర్పించిన నివేదిక ఆధారంగా తక్షణ చర్యలు చేపట్టి.. అవినీతి, అక్రమాలకు తావులేకుండా… ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్న అవినీతి అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుని.. అన్యాక్రాంతమవుతున్న నాలాలను పరిరక్షించి, భవిష్యత్తులో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.. వాల్టా చట్టం 2002 ఏమిచెబుతోంది..? అమీన్ పూర్, వాణి నగర్ లో అర్బన్ రైజ్ నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలు, ప్రభుత్వ అధికారులు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..