Thursday, April 18, 2024

తుంగతూర్తి ఎం.ఆర్.సి. కార్యాలయంలో ఆలికి బదులు ఆయన..

తప్పక చదవండి
  • సంవత్సరం కాలంగా జీతం ఇస్తున్న ఎంఈఓ లింగయ్య..
  • విధులకు రాకున్నా పర్లేదు,పర్సంటేజ్ ఇవ్వాల్సిందే..
  • 12 నెలలుగా అడప తడప పనులు చక్కబెడుతున్న కొనతం మధు..
  • ఒకరి బదులు మరొకరు ఉద్యోగం చేస్తున్నా చర్యలు చేపట్టని
    జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్.

సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన విద్యా వ్యవస్థ అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న రేసు మమత 2022 జూన్ 12 నుండి నేటి వరకు విధులు నిర్వర్తించట్లేదు. దీనినే అదునుగా భావించిన మండల విద్యాశాఖ అధికారి లింగయ్య కార్యాలయంలోని పనులను రేసు (కోనతం) మమత భర్త అయిన కొనతం మధు, ఎంఈఓ కార్యాలయంలో పనులు చక్కబెడుతూన్నారు. ఉద్యోగి మార్పిడి కారణంగా అధికారి లింగయ్య వారితో ఒప్పందం (కమిషన్) కుదుర్చుకొని, ప్రతి నెల పూర్తి వేతనం చెల్లిస్తున్నారు. వారికి ప్రతి నెల రూ .19,500 జీతం ఇస్తూ సదరు అధికారి ఇప్పటివరకు 2 లక్షల రూ. 36 వేల రూపాయలు అధికార దుర్వినియోగం చేశారు. పాఠశాలల గ్రాంట్ కు సంబంధించి, సమగ్ర శిక్ష, ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని కేవలం ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల వద్ద మాత్రమే ఉండాలి. కానీ ఈ మండల విద్యాశాఖ అధికారి లింగయ్య చేతివాటంతో కార్యాలయానికి సంబంధించిన అన్ని రహస్య వివరాలు బయట వ్యక్తి చేతిలోనే ఉంచడం గమనార్హం. ఏదైనా పొరపాటు జరిగి నిధుల దుర్వినియోగం జరిగితే తాము బాధ్యత వహించాల్సి వస్తుందని, బయటి వారితో పని చేయించడం ఎంతవరకు సమంజసం కాదని, బయట వ్యక్తులు అక్రమాలకు పాల్పడితే తామే బాధ్యత వహించాల్సి వస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిత్యం ఆందోళన చెందుతున్నారు.

హాజరు పట్టికలో సంతకాలన్నీ ఆయనవే :
వాస్తవంగా కార్యాలయాల్లో ప్రతి ఒక్క ఉద్యోగి వివరాలతో కూడిన హాజరు రిజిస్టరు ఉంటుంది. ఈ రిజిస్టర్ లో ప్రతిరోజు విధిగా కార్యాలయ అధికారి, ఉద్యోగుల సంతకాలను పరిశీలించి ఎవరైనా సెలవు పెట్టినట్లయితే కొంత టైమ్ వరకు చూసి సి.ఎల్. వేయాల్సి ఉంటుంది. నెలలో ఒకటి కంటే ఎక్కువ సెలవు పెట్టినట్లయితే ఆ ఉద్యోగ వేతనంలో కోత విధించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా నెల రోజుల వరకు సదరు ఉద్యోగి పేరు ఎదురుగా ఖాళీ గడులను వదిలి ఉంచారు. ఒక్కో సారి వారం రోజుల వరకు మమత భర్త అయిన మధు మమత పేరుతో సంతకం చేస్తుండగా.. గతంలో పెట్టిన సంతకాలకు, మధు పెట్టిన సంతకాలకు తేడా ఉండటంతో, డ్యూటీ చేయకుండా ఉన్న మమతతో నెల మొత్తం ఖాళీగా ఉన్న రిజిష్టర్ లలో సంతకాలు చేయించారు.

- Advertisement -

ప్రారంభంలో జూలై 11 తర్వాత సంతకం చేయకుండా.. ఆగస్టు నెల 16 వరకు ఖాళీగా ఉంచి ఉన్న రిజిస్టర్ ఉండేది. ఇటీవల ఆ రిజిష్టర్ లో ఉద్యోగి పేరు ఎదురుగా పూర్తిగా సంతకాలు చేసి ఉండడంతో, అధికారి చేతివాటం ఉన్నట్లు బహిర్గతం అవుతుంది. ఇదే విషయంపై విద్యార్థి సంఘ నాయకులు ఇటివల కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం, నేరుగా కొణతం మధుకి ఫోన్ చేసి మండల సమాచారాన్ని తీసుకుంటున్నారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మండల అధికారుల దగ్గర నుండి.. జిల్లా విద్యాశాధికారి వరకు అందరూ కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా పూర్తి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కంప్యూటర్ ఆపరేటర్ తో కలిసి కుమ్మక్కైన ఎంఈఓ లింగయ్యను సస్పెండ్ చేయాలని, కంప్యూటర్ ఆపరేటర్ మమత, ఆమె భర్త మధులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి సభిత ఇంద్రారెడ్డిని కలిసి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ని వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు