Sunday, May 19, 2024

ప్రమాదకర వ్యాధికి ఇ.ఎన్.టి.లో చికిత్స

తప్పక చదవండి

హైదరాబాద్ : ఆదిలాబాద్ లోని లక్సెట్టిపేట మండలంలోని, వెంకట్రావు పేటకు చెందిన విద్యాసాగర్ అనే 52 సంవత్సరాల వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా చెవి సమస్యతో బాధ పడుతున్నాడు. చెవి నుండి ఎప్పటికీ చీము కారడం జరుగుతుంటే చాలా మంది ఇ.ఎన్.టి. వైద్యుల దగ్గర చికిత్స పొందాడు. ఇంతకు ముందు కరీంనగర్ లో రెండుసార్లు చెవికి ఆపరేషన్ కూడా జరిగింది. కాని పరిస్థితిలో మార్పు రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు మూతి వంకర పోయింది. అన్నం తినడం కష్టంగా మారింది. ఒక కనురెప్ప కూడా మూసుకోవడం లేదు. హైదరాబాద్ కు వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపిస్తే ఆపరేషన్ చేయాలి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. అంత ఖర్చు భరించలేని విద్యాసాగర్ చివరికి కోటి లోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు ఆసుపత్రికి రాగా అక్కడి వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అతనికి ఉన్న సమస్యను ఎడమ చెవికి సంబందించిన ” టింపానో జుగులార్ పారా గాంగ్లియోమా, గ్రేడ్ 4 ఫేషియల్ పరాలిసిస్” గా గుర్తించారు.సులభంగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే దీనిని “గ్లోమస్ ట్యూమర్” అని కూడా అంటారు. అంటే ఇది చెవిలో ఉండే రక్త నాళాల నుండి పుట్టిన ఒక గడ్డ లాంటిది. విపరీతమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నటువంటి గడ్డ ఇది. ఇది చెవిలోపలిదాకా బాగా వ్యాపించి చెవిలో ఉన్న ముఖ్యమైన బాగాలన్నిటినీ తినేసింది. వినికిడి పూర్తిగా పోయింది, మూతి వంకర పోయింది. కన్ను మూసుకోవడం లేదు. ఇంకొన్ని రోజులు అలాగే ఉంటే అది ఇంకా పెరిగి మెదడుకు వ్యాపించి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఉండేది. ఈ పరిస్థితుల్లో ఇ.ఎన్.టి. ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి ” గ్లోమస్ ట్యూమర్” ను పూర్తిగా తొలగించడమైనది. ఆపరేషన్ అనంతరం పేషెంటు స్థిమితంగా ఉన్నాడు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్నవారు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సత్య కిరణ్, డాక్టర్ ఆశీష్, డాక్టర్ మీనా, డాక్టర్ శ్వేత మత్తు వైద్యులు డాక్టర్ ఉమా, డాక్టర్ ఉమా ప్రదీప, డాక్టర్ సదానందం, డాక్టర్ నిఖిల నర్సులు, సహాయక సిబ్బంది. వరుసగా ఇలాంటి అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని హాస్పిటల్ సూపెరింటెంట్ డాక్టర్ శంకర్ ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. ఇలాగే అందరూ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు