రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కేలండర్ ఇయర్ నాలుగో క్వార్టర్ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేస్తోంది. ఎకానమీలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల పర్యవసానంగానే ఆర్బీఐకి తన పాలసీ ఫోకస్‌ను కొంత ముందుగానే మార్చుకునే వెసులుబాటు కలుగుతుందని వెల్లడించింది. ఇండియాలో రేట్ల తగ్గుదల స్పష్టంగా కనబడుతోందని, రేట్ల తగ్గుదల విషయంలో కన్జూమర్ల అంచనాలు కూడా మారుతున్నాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది. కాబట్టి, రేట్ల పెంపుదల సైకిల్ నుంచి రేట్ల కోత ఎప్పుడనే అంశం వైపు ఇప్పుడు అటెన్షన్ మారిందని వివరించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలోని ఆర్బీఐ 2023 క్యూ 4 లో మొదటిసారిగా రేట్ల కోత చేపట్టే ఛాన్స్ ఉందని తాము బేస్‌లైన్‌ను అప్డేట్ చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ వెల్లడించింది. రేట్లు ఇటీవలి కాలంలో దిగివచ్చినా, రేట్ల పెరుగుదల రిస్క్ మాత్రం ఈ ఏడాది చివరిదాకా ఉంటుందని కూడా అంచనా వేసింది. ఇన్ఫ్లేషన్ బాగా దిగివచ్చిందనే సంకేతాలు స్పష్టంగా కనబడేదాకా వేచి ఉండాలని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చూస్తోందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ తెలిపింది. తమ రివ్యూ ప్రకారం మొదటి కోత చివరి క్వార్టర్లో (అక్టోబర్–డిసెంబర్ 2023) ఉండొచ్చని పేర్కొంది. దేశంలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ 4 శాతానికి మించకూడదని ఆర్బీఐ టార్గెట్‌గా పెట్టుకుంది. ఏప్రిల్‌నెల ఎంపీసీ మీటింగ్‌లో పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా (పాజ్) ఆర్బీఐ మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. బెంచ్‌మార్క్ పాలసీ రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.