Tuesday, October 15, 2024
spot_img

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ లో తెలుగు టాలన్స్‌ హ్యాట్రిక్‌..

తప్పక చదవండి
  • ఐదో విజయంతో సెమీస్‌కు చేరువ

తెలుగు టాలన్స్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. శనివారం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో రాజస్థాన్‌ పాట్రియాట్స్‌తో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో తిరుగులేని విజయం నమోదు చేసిన తెలుగు టాలన్స్‌ వరుసగా మూడో విజయంతో పాటు సెమీఫైనల్స్‌ బెర్త్‌ లాంఛనం చేసుకుంది. ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించిన తెలుగు టాలన్స్‌ నాకౌట్‌ బెర్త్‌ దాదాపుగా ఖాయం చేసుకుంది. రాజస్థాన్‌ పాట్రియాట్స్‌పై 33-22తో ఏకంగా 11 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించిన తెలుగు టాలన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం పదిలం చేసుకుంది. ఆరంభం నుంచీ దూకుడు : వరుస విజయాల ఊపుమీదున్న తెలుగు టాలన్స్‌.. శనివారం రాజస్థాన్‌ పాట్రియాట్స్‌పై పంజా విసిరింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన తెలుగు టాలన్స్‌ ఏ దశలోనూ రాజస్థాన్‌కు ఊపిరీ పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. కీలక ఆటగాళ్లు దేవిందర్‌ సింగ్‌ భుల్లార్‌, నసీబ్‌ సింగ్‌, రఘు, అనిల్‌ సహా రాహుల్‌, మోహిత్‌ రాణించటంతో టాలన్స్‌ దూసుకెళ్లింది. 9-6తో ఆరంభంలోనే మంచి ఆధిక్యంలో నిలిచిన టాలన్స్‌… 14-10తో నాలుగు గోల్స్‌ ఆధిక్యంతో ప్రథమార్థం ఆటను ముగించింది. ఇక విరామం అనంతరం తెలుగు టాలన్స్‌ ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. గోల్‌ కీపర్‌ రాహుల్‌ కండ్లుచెదిరే సేవ్‌లతో రాజస్థాన్‌ గోల్‌ ప్రయత్నాలకు చెక్‌ పెట్టగా.. టాలన్స్‌ ఎటాకర్లు గోల్స్‌ వర్షం కురిపించారు. ఆటలో చివరి పది నిమిషాల పాటు కనీసం 10 గోల్స్‌ ఆధిక్యంలో నిలిచిన తెలుగు టాలన్స్‌.. 33-22తో 11 గోల్స్‌ తేడాతో సీజన్లోనే అత్యంత భారీ విజయం సాధించింది. ఇక నేడు జరిగే మరో గ్రూప్‌ దశ మ్యాచ్‌లో గోల్డెన్‌ ఈగల్స్‌ ఉత్తరప్రదేశ్‌తో తెలుగు టాలన్స్‌ తలపడనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు