ఆస్పత్రికి వెళ్లగానే ప్రవేశం వద్ద వీల్ చైర్లు దర్శనమిస్తాయి. నడవలేని స్థితిలో ఉన్న రోగులను ఆ వీల్ చైర్ల మీద కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు. అయితే ఓ ఆస్పత్రిలో వీల్ చైర్లు అందుబాటులో లేక పోవడంతో.. రోగిని స్కూటర్‌పై ఆస్పత్రి పై అంతస్తుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోట జిల్లాలో గురువారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోట ప్రాంతానికి చెందిన న్యాయవాది మనోజ్ జైన్ కుమారుడికి ఇటీవలే కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో కట్టు మార్పించేందుకు గత గురువారం స్థానిక ఎంబీఎస్ ఆస్పత్రికి తన కుమారుడిని జైన్ తీసుకెళ్లాడు. అయితే ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో వీల్ చైర్లు కనిపించలేదు. ఆర్థోపెడిక్ వార్డు మూడో అంతస్తులో ఉంది. దీంతో.. స్కూటర్‌పైనే లిఫ్ట్ ద్వారా కుమారుడిని మూడో అంతస్తులోకి తీసుకెళ్లాడు జైన్. కట్టు మార్పించుకున్న అనంతరం కూడా అలాగే కిందకు వచ్చారు తండ్రీకొడుకులు. అయితే కిందకు తిరిగి వస్తున్న జైన్‌ను వార్డు ఇన్‌చార్జి అడ్డుకున్నాడు. స్కూటర్ తాళాలు తీసుకున్నాడు. దీంతో జైన్‌కు, ఆస్పత్రి వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వీల్ చైర్ లేదని చెప్పడంతోనే.. స్కూటర్‌పై లిఫ్ట్‌లో తీసుకెళ్లాల్సి వచ్చిందని జైన్ స్పష్టం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.