Saturday, June 15, 2024

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో కవులకు, రచయితలకు, ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు వచ్చిందా ?

తప్పక చదవండి

(తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుండి జూన్ 22 వరకు జరిగే దానిలో భాగంగా జూన్ 11 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా…..)

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో, పోరాటం లో కవులు, రచయితలు, ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉన్నారు.తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు చులకనగా చూడటం భరించలేక తమ కలాలను, గళాలను కవితలుగా, పాటలుగా, వ్యాసాలుగా వివిధ సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియల కింద మార్చి ప్రజలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, అవసరంను చెప్పడంలో సఫలీకృతం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో తెలంగాణ కవుల రచయితల రచనలకు అవకాశం లేకుండా ఆంధ్ర,రాయల సీమ కవుల రచనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది.కవులు, కళాకారులు తెలంగాణ భాష,యాసలలో ధూం ధాం లు నిర్వహిస్తే ప్రజలందరు పెద్ద యెత్తున పాల్గొనేవారు.కొన్ని పాటలు ” పల్లె కన్నీరు పెడుతొందొ ” , ” రాతి బొమ్మల లోన కొలువైన శివుడా “, చూడు తెలంగాణ ఒక చుక్క లేని దాన నా గోడు తెలంగాణ, నిలువెల్లా గాయాల వీణా “.. ” నా పేరు తెలంగాణ,నా ఊరు తెలంగాణ,నా మాట తెలంగాణ,నా బాట తెలంగాణ, నా తనువు లోని అణువణువు తెలంగాణ ” జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ” వీరుల్లార, వీర వనితల్లార అమ్మ ఋణంకై రణం లొరిగినారా”, ” ఊరు వాడ ఒక్కటై ఉద్యమించిందో, జై కొట్టి తెలంగాణ” నందిని సిధారెడ్డి రాసిన” నాగేటి చాలల నా తెలంగాణ నా తెలంగాణ ” ” జన జాతరలో మన గీతం జన కేతనమై ఎగరాలి “, గూడ అంజయ్య రాసిన” అమ్మోడివా! నీవు అయ్యోడివా తెలంగాణ పాలు అడిగే పాలొడివా”, గద్దర్ రాసిన ” పొడుస్తున్న పొద్దుమీద
నడుస్తున్న కాలమా ! నా పోరు తెలంగాణామా” ” ఆశన్న,ఊసన్న ల్లారా! లాంటి అనేక పాటలు పాడినప్పుడు ధూం ధాం లకు వచ్చిన ప్రజలు, మీటింగ్ లకు వచ్చిన ప్రజలు, రాస్తారోకో, రైలు రోకో, వంటావార్పు,సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమాలకు, పోరాటాలకు, నిరసన లకు వచ్చిన ప్రజలు ఎక్కి‌ ఎక్కి ఏడ్చిన సందర్భాలు అనేకం. అనేక మంది కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు,ఉద్యోగులు, డాక్టర్ లు, న్యాయ వాదులు, కుల వృత్తుల వారు, వ్యాపారస్తులు, జర్నలిస్టులు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సకలజనుల సమైక్య కృషి ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కవులు గద్దర్, అందెశ్రీ, గోరేటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, జయరాజ్, నందిని సిధారెడ్డి,మిత్ర, దరువు ఎల్లన్న, శ్రీనివాస్, నిస్సార్, తిరుపతి,సోమన్న,గూడ అంజయ్య, లాంటి వారు అనేక పాటలు, గేయాలు రాస్తే విమలక్క, దేశపతి శ్రీనివాస్, వందేమాతరం శ్రీనివాస్, రసమయి బాలకృష్ణ ఇంకా అనేక మంది గాయకులు స్వరాలను కూర్చి ప్రజల దగ్గరకు పాటలను, గేయాలను చేరేలా చేసి అందులో తమను తాము ఆవిష్కరించుకున్నారు.నవ రసాలను జోడించి తెలంగాణ పాటను తెలంగాణ సైరన్ లా ఉపయోగించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది. ఉపాధ్యాయులలో అనేక సంఘాలు ముఖ్యంగా ఎస్టీయు,పి.ఆర్.టి.యు.,పి.ఆర్.టి.యు తెలంగాణ,డి.టీ.ఎఫ్.టి.ఆర్.టి.ఎఫ్,ఆర్.యు. పి.పి.తపస్, జి.టి.ఏ మొదలైనవి ఉన్నాయి.ఈ వ్యాస రచయిత డాక్టర్.ఎస్. విజయ భాస్కర్ ఉపాధ్యాయ సంఘాలు కతీతంగా తాము పనిచేస్తున్న ప్రభుత్వ సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాల లో దానికి సమీపంలో ఉన్న మోడల్ ఆలియా పాఠశాలలో అనేక సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయ సంఘాల కతీతంగా తెలంగాణ టీచర్స్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది.టిపిటిఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవీందర్, మల్లిఖార్జున రెడ్డి, ఎల్లయ్య, నర్సింగ్ రావు,గిరివర్ధన్, సంజీవ్ రావు, రాములు ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు తెలంగాణ టీచర్స్ ఫోరం లో ప్రధాన పాత్ర పోషించి ఉపాధ్యాయ సంఘాల కతీతంగా తెలంగాణ రాష్ట్రం సాధించడమే ఏకైక లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేశారు. అనేక మంది ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా నీరు, నియామకాలు, నిధులు ప్రధాన ఎజెండాగా జూన్ 2, 2014 నాడు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచి పదో సంవత్సరంలో వెళ్తున్న సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి జూన్ 22 వరకు నిర్వహిస్తుంది.ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, సాధించవలసిన విషయాలను పరిశీలిద్దాం.

- Advertisement -

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సాధించిన విజయాలు:- విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో జాతీయ గీతం తరువాత ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన గేయం నల్లగొండ జిల్లా కు చెందిన రచయిత ” పైడిమర్రి సుబ్బారావు ” గారిది. తెలంగాణ వాస్తవ్యులు కావడం వలన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ త్రి భాష లలో ప్రచురితమైన రచయిత పేరు లేకుండా 60 సంవత్సరాలు గడిచాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పుస్తకాలను ప్రచురించారు.దానిలో ప్రార్థన కింద రచయిత పేరుతో ముద్రించడం జరుగుతుంది.సమైఖ్యాంధ్ర లో ఆంధ్ర, రాయల సీమ కవులైన గురజాడ అప్పారావు,శ్రీ.శ్రీ., వేమన్న, నన్నయ్య,ఎర్రన, చాగంటి సోమయాజులు ( చా.సో) రచనలు ఉండేవి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఎస్సీఆర్టీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులలో ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి తెలంగాణా కవులకు, రచయితలకు ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్ర,రాయల సీమ కవులు రాసిన పాఠాలు బాగుంటే దానిని కూడా తీసుకోవడం జరిగింది.పాఠ్య ప్రణాళిక రూప కల్పన లో ఈ వ్యాస రచయిత డాక్టర్.ఎస్.విజయ భాస్కర్ కు ..కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన పాఠ్య పుస్తకాలలో తిక్కన, డాక్టర్ సి.నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, యశోద దేవి,అలిసెట్టి ప్రభాకర్,సాముల సదాశివ,గంగుల సాయిరెడ్డి, ఆచార్య రుక్నుద్ధీన్, డాక్టర్.ముకురాల రాంరెడ్డి, సంగెం లక్ష్మీ బాయి, డాక్టర్ ఇరివెంటి కృష్ణ మూర్తి,ఇల్లిందుల సరస్వతి దేవి, కృష్ణ స్వామి ముదిరాజ్, ఆదిరాజు వీరభద్రరావు,గూడూరి సీతారాం తదితరుల రచనలు ఉన్నాయి.సినిమాలలో హీరో, హీరోయిన్ లకు ఆంధ్ర భాష, విలన్ పాత్రలకు,అటెండర్, పనిమనిషి పాత్రలకు తెలంగాణ భాష, యాస వాడేవారు.తెలంగాణ వచ్చిన తర్వాత హీరో, హీరోయిన్ సినిమాలు మొత్తం తెలంగాణ భాష, యాస లలో వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రసమయ బాలకృష్ణ సారధ్యంలో తెలంగాణ కవులు, కళాకారులకు 516 మందికి ఉద్యోగాలు కల్పించి ఉద్యోగాలు కల్పించారు.24 గంటలు కరెంట్ అందుబాటులో ఉంటుంది.మిషిన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణా లో నీటి ఎద్దడి తగ్గింది.చెరువులు నిండి పంట పొలాలు నిగ నిగ లాడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించాల్సిన విషయాలు :
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలలో, పోరాటాలలో డాక్టర్.అందెశ్రీ రాసిన ” జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం” అనే గేయం మారు మోగింది. ప్రతి సమావేశంలో ” జయ జయయే తెలంగాణ, జననీ జయకేతనం” అనే గేయం మారు మోగింది. తెలంగాణ రాష్ట్రం లోని పాత 10 జిల్లాల లోనూ, నూతనంగా ఏర్పడిన 33 జిల్లాలలోని ప్రయివేటు, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యాసంస్థలలో తెలంగాణ రాష్ట్ర గీతం కింద ” “జయ జయయే తెలంగాణ, జననీ జయకేతనం” అనే గేయం నే పాడుతున్నారు.దేశ, విదేశాల్లో తెలంగాణ ప్రజల ఏ సమావేశం జరిగిన తెలంగాణ రాష్ట్ర గీతం, జాతీయ గీతం కింద “జయ జయయే తెలంగాణ, జననీ జయకేతనం ” అనే గీతాన్ని ఆలపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర గీతం ను ప్రకటించలేదు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచి దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర గీతం లేకపోవడం విచిత్రం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ను ప్రకటించాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వచ్చిన పాటలలో సుద్దాల హనుమంతు, బండి యాదగిరిని మొదట చెప్పుకోవచ్చు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ భాష పండితులు డప్పు, డోలు, గజ్జెలు, గొంగళి వేసుకొని మాటల కన్నా పాటల ద్వారా ఉద్యమ సమాచారం తెలిపారు. భాష పండితులకు మూడు దశాబ్దాలు కావొస్తున్న పదోన్నతులు లేవు.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు, హిందీ, ఉర్దూ మిగతా దేశీయ భాషలను బోధించే ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక మూడు దశాబ్దాలు కావొస్తున్న పదోన్నతులు లేక పోవడం ఆందోళన కరమైన విషయం.ఉన్నత పాఠశాలలలో బోధిస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటు వెట్టి చాకిరీ కి, శ్రమదోపిడికి గురౌతున్నారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగల ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి చేరేలా చేసిన వారు భాష పండితులు. సమైక్యాంధ్ర లో అన్యాయం జరిగిందని అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లో అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని భాష పండితులు సమస్య సమస్యనే కాదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే భాష పండితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిది సంవత్సరాలు గడిచినా భాష పండితులకు పదోన్నతులు పొందడం లేదు. 2017 డిసెంబర్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో మన దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మరియు ప్రపంచ తెలుగు ప్రతినిధుల ముందు ప్రారంభ, ముగింపు సమావేశాలలో తెలంగాణ భాష పండితుల పదోన్నతుల విషయంలో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయని ఆ అడ్డంకులు తొలగించి భాష పండితులకు పదోన్నతులు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోలేదని భాష పండితులు ఆందోళన చెందుతున్నారు.భాష పండితుల పదోన్నతులు అనగానే ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కు వెళ్ళి స్టే తేవడం ఆపివేయడం చేస్తున్నారు.ఎస్జీటి ఉపాధ్యాయ మిత్రుల కోసం తెలంగాణ రాష్ట్ర కేబినెట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 వేల ఎల్.ఎఫ్.ఎల్ పోస్టులను మంజూరు చేసింది.భాష పండితుల పదోన్నతుల విషయంలో ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రుల అడ్డు తొలిగింది కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కౌంటర్ దాఖలు చేసి స్టే ను వెకెట్ చేపించి భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి. జూన్ 11 న తెలంగాణ సాహిత్య దినోత్సవం లో భాష పండితుల పాత్రనే ఎక్కువగా ఉంటుంది.సభ నిర్వహణ లోను సభను జయప్రదం చేయడంలో భాష పండితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు పూర్తి సహకారం అందిస్తారు

పోరాటాలే శరణ్యం లేకుంటే అరణ్యం :
జూన్ 11 న జరుగనున్న తెలంగాణ సాహిత్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని భాష పండితులకు పదోన్నతుల విషయం లో జరిగిన అన్యాయాలను కవితల ద్వారా, పాటల ద్వారా తెలియజేయడానికి భాష పండితులు సిద్ధమవుతున్నారు. పోరాటాలే శరణ్యం లేకుంటే అరణ్యం అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని భాష పండితుల పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.తెలుగు భాషాభిమాని, తెలుగు సాహిత్యం లో పట్టు ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ భాష పండితులకు పదోన్నతులు కల్పిస్తారని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్., రాష్ట్ర కార్యదర్శి.,
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ( ఆర్.యు.పి.పి.) తెలంగాణ.. 9290826988

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు