Sunday, October 13, 2024
spot_img

సూర్యాపేట పీఠం ఎవరిది..?

తప్పక చదవండి
  • మూడోసారి జగదీష్ రెడ్డిని అదృష్టం వరించనుందా ..?
  • కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు దామన్నకా.? పటేల్ కా.?
  • ఈసారి సంకినేని… జగదీష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారా ..!
  • ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగాలని అధికార పార్టీలో
    ఓ బిసి నాయకుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా ?.
  • ఈసారి స్వతంత్రుల హవా ఎలా కొనసాగనుంది..?
  • పేట ప్రజలు ఎవరికి పట్టాభిషేకం చేయనున్నారు ..?

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడి కొన్నెండ్లు పూర్తయ్యింది.. ఎంతో మంది మహానుభావులు, మేధావులు పరిపాలించిన చరిత్ర కలిగిన జిల్లా ఇది. ప్రస్తుతం ఇప్పుడున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తరువాత జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మా హయాంలోనే ఇవన్నీ మంజూరు అయ్యాయని వీటన్నింటికి ప్రతిపాదనలు అప్పట్లోనే చేశామని, ఈరోజు జిల్లా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా, నియోజక వర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు కూడా అదే రీతిలో వ్యూహాలు రచిస్తూ జగదీష్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బిజెపి పార్టీ మాత్రం చాపకింద నీరులా పనులు చక్కబెట్టుకున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్న మాట.

పేటను జిల్లాగా మార్చిన జగదీష్ రెడ్డి :
ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ కెసిఆర్ కి నమ్మన బంటుగా ఉన్న జగదీష్ రెడ్డికి సీఎం కెసిఆర్ అప్పట్లో సూర్యాపేట భాద్యతలు అప్పగించారు. 2014 వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం అనంతరం రాష్ట్రం ఏర్పడిన తరుణంలో కేసీఆర్ సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జగదీష్ రెడ్డిని ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో సూర్యాపేటలో పోటీ చేసి, 2219 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి అయిన సంకినేని వెంకటేశ్వరరావు మీద జగదీష్ రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిన్న పట్టణంగా ఉన్న సూర్యాపేటను జగదీశ్ రెడ్డి మంత్రి అయిన తర్వాత జిల్లాగా మార్చి, తొమ్మిదిన్నర ఏండ్లకాలంలో సూర్యాపేట పట్టణానికి ఇప్పటివరకు సుమారు రూ.5 వేల కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జగదీష్ రెడ్డి చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి మార్క్ గా చెప్పుకోవడానికి మెడికల్ కాలేజ్ మొదలు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మహాప్రస్థానం, ఇంటిగ్రేటెడ్, మార్కెట్ సముదాయాలతో పాటు కంపచెట్లతో ఉన్న సద్దలచెరువును, 40 కోట్ల నిధులతో మినీ ట్యాంక్ బండ్ మార్చి, పుల్ల రెడ్డి చెరువుని కూడా మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్ది పట్టణ ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని నింపారు.

- Advertisement -

ముందస్తు ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి గొలిపొందిన అనంతరం :
2018 సంవత్సరంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి గొలిపొందిన అనంతరం, 2014 ముందు నుంచి వెంట ఉన్న ఉద్యమకారులను, జేఏసీ నేతలను, ఆయనను నమ్ముకున్న సన్నిహితులు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని సైతం పక్కన పెట్టారనే ఆరోపణలు జగదీష్ రెడ్డిఫై ఉన్నాయి. 2018లో గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను, కొత్త వ్యక్తులకు పార్టీలో చేర్చుకొని పదవులు అంటగట్టారన్న నింద లేకపోలేదు. దీంతో మొదటి నుండి వెంట నడిచిన ఉద్యమకారులు, జెఏసి నేతలు, సన్నిహితులు మంత్రిపై గుర్రుగా ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ రెడ్డి గెలుపు 50/50 అని నియోజకవర్గ ప్రజల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి లు టికెట్ కోసం బహిరంగంగా కొట్టుకోవడం జగదీష్ రెడ్డికి కలిసొస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోసారి బరిలో ఆర్.డి.ఆర్..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన రాం రెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1985 జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నుండి పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1989 పార్టీ టికెట్ మీద గెలిచిన ఆర్.డి.ఆర్. 1994లలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత వరుసగా మూడు సార్లు ఒకే నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రజల మన్ననలు పొందారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై పోటీ చేసి ఆర్.డి.ఆర్. ఓటమి కాగా, 2004లో మరోసారి పోటీ చేసి 13.184 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. 2009 ఎన్నికల సమయానికి నియోజకవర్గాలలో రిజర్వేషన్ల స్థానికత ఆధారంగా ఎస్సి కి కేటాయించడంతో అక్కడి నుండి సూర్యాపేట నియోజక వర్గానికి తన మకాం మార్చారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో పోటీ చేసి ఎమ్మేల్యే గా గొలుపొందారు. ఆర్.డి.ఆర్ ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. దామోదర్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తిగతంగా మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ, తన వెంట ఉండే సహచరులు చేసే ఆకృత్యాల వల్ల నియోజకవర్గ ప్రజల్లో ఆయన పేరు మసకబారింది. దీని కారణంగానే ఆయన రెండు సార్లు ఓటమి చవిచూసారానే మాట వినిపిస్తోంది..

సూర్యాపేట బిజెపి అభ్యర్థిగా సంకీనేని నిలిచేనా..!
సంకినేని వెంకటేశ్వరరావు 1999లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి టిడిపి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. అనంతరం ఆయన వై ఎస్.ఆర్ పార్టీలో చేరి అనతికాలంలోనే అందులో నుండి బయటకు వచ్చి, 2014 లో స్వాతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి, 2219 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. భారతీయ జనతా పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా 2018 లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సంకినేని వెంకటేశ్వరరావు తుంగతుర్తిలో చేసిన అభివృద్ధి మాదిరిగానే సూర్యాపేటలో కూడా అభివృద్ధి పదంలో నడిపేందుకు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ సూర్యాపేట ప్రజలు ఎమ్మెల్యేగా గుంటకండ్ల జగదీష్ రెడ్డికే పట్టం కట్టారు. సంకినేని తన గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని తాజా, మాజీ ప్రజా ప్రతినిధులను తన వైపుకు తిప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంకినేని వెంకటేశ్వరావు బిజెపి పార్టీ నుండి పోటీ చేస్తారా.? లేక మరో నేత పోటీ చేస్తారా అనే ప్రశ్నలు నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న మరో ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు మాజీ పార్లమెంటు సభ్యుడు కాగా, మరొకరు అధికార పార్టీ కి చెందిన పేరున్న నాయకుడుగా తెలుస్తోంది.. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, పలు కార్యక్రమాల పేరుతో ప్రజల్లో మమేకమై ప్రచారానికి తెరలేపగా, స్థానిక బిజెపి నాయకులు మాత్రం అంగు ఆర్భాటం లేకుండా మౌనంగా ఉండటం చర్చకు దారితీస్తోంది.. సంకినేని వెంకటేశ్వరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా.? లేక అధిష్టానం సూచించిన అభ్యర్థులకు మద్దతిస్తారా అనేది వేచి చూడాలి.

స్థానికేతర నినాదం ఎత్తుకున్న పటేల్ రమేష్ రెడ్డి :
పటేల్ రమేష్ రెడ్డి 1995 సూర్యాపేట రూరల్ మండలం బలెంల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. సూర్యాపేట జెడ్పీటీసీగా పటేల్ రమేష్ రెడ్డి సతీమణి లావణ్య గెలిచి మండలాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. గతంలో పటేల్ టిడిపిలో మండల, జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ, రాజకీయంగా ఎదుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2014లో టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి పాలయ్యారు. తెలంగాణ తెలుగదేశం దేశం నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో కలిసి పటేల్ రమేష్ కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 2018 కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా చివరి క్షణం వరకు పటేల్ రమేష్ రెడ్డి అని పలు మీడియాల్లో కథనాలు వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో అధిష్టానం రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి బి.ఫామ్ ఇచ్చింది. ఇక్కడ ఎప్పటినుండో ఉన్న సీనియర్ నాయకుడు, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడే స్థిరంగా ఉండటంతో పటేల్ కు టికెట్ వచ్చే అవకాశం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 2023 చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ తనకే వస్తుందన్న ఆశతో పటేల్ రమేష్ రెడ్డి :
టికెట్ తనకే వస్తుందన్న ఆశతో పటేల్ రమేష్ రెడ్డి, రచ్చబండ, హత్ సే హత్ జోడో యాత్రతో పాటు, ప్రస్తుతం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ (యూత్ డిక్లరేషన్) 100 రోజుల కార్యక్రమంతో పట్టణంలోని వార్డులు, మండలాలలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇదే కాకుండా పటేల్ రమేష్ రెడ్డి పలు సందర్భాలలో, సూర్యాపేటలోని వివిధ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులఫై విమర్శలు గుప్పిస్తున్నారు. వీరిలో ఎవరిది లోకల్.. ఎవరిదీ నాన్ లోకల్ అంటూ స్థానికేతర నినాదం ఎత్తుకున్నారు. నేను స్థానికున్ని అంటూ గట్టి ప్రచారం చేస్తుండడంతో ప్రజలలో ఇది కూడా ఒక ఆలోచింపజేసే అంశంగా మారింది.

దామోదర్ రెడ్డిని కాదని పటేల్ కి టికెట్ ఇస్తారా.?
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రెండు వర్గాలుగ విడిపోయారు. నిజానికి సీనియర్ నాయకుడైన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని కాదని అధిష్టానం, పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ కట్టబెడుతుందా అని రాజకీయ విశ్లేషకులు, నియోజకవర్గ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఈసారి టికెట్ దామోదర్ రెడ్డికే ఇస్తే, పటేల్ రమేష్ రెడ్డి దామన్నకు సహకరిస్తారా.? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే…

ఎన్నికల బరిలో బీసీ నాయకుడు :
అనతికాలంలోనే రాజకీయంగా ఎదిగి, అధికార పార్టీలో చేరి తనదైన శైలిలో పేరు సంపాదించున్న ఓ నాయకుడు, ప్రస్తుతం ఉమ్మడి జిల్లా హోదాలో పని చేస్తున్న ఓ కీలక నేత, బీసీ సామాజిక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడనున్నట్లు తెలుస్తోంది.. బిసి వర్గానికి చెందిన ఆ నేత ఇప్పటికే పలు పార్టీల అధ్యక్షులను కలిసి సంప్రదింపులు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారని కొందరు అభిప్రాయ పడుతుండగా, బిజెపి లేదా బీ.ఎస్.పి. నుండి పోటీ చేస్తారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేత ఏ పార్టీ నుండి పోటీ చేసినా, ఇటు అధికార బి.ఆర్.ఎస్. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలపై ఆ నేత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలి ప్రధాన అభ్యర్థులపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.. ఆ నేత ఇంతకూ ఏ పార్టీలో చేరుతారో, ఏ ముఖ్య నాయకునికి గట్టి పోటీ ఇస్తారో తెలుసుకోవాలంటే, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోరు :
అధికార పార్టీ చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి టికెట్ తమకే వస్తుంది అన్న ధీమాలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, బీసీల నినాదం తెరమీదకి రావడంతో బీసీ సంఘం నుండి మరొక పేరున్న నాయకుడు.. ఇలా ఎవరి ధీమాతో వారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో అని, ఈ ఎన్నిక ఎంతో రసవత్తరంగా ఉండబోతుందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు