Wednesday, May 22, 2024

కొనుగోలుదారులకు నరకం..

తప్పక చదవండి
  • రక్తం పీలుస్తున్న సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్..
  • మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్న ఎండీ మల్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..
  • రేపు మాపు అంటూ దాటవేస్తున్న దౌర్భాగ్యం..
  • హెచ్.ఎం.డీ.ఏ. అనుమతులు అంటూ ప్రక్కదోవ పట్టిస్తున్న వైనం..
  • బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకుంటున్న దుర్మార్గం..
  • మార్టిగేట్ చేసిన స్థలాలను సైతం అమ్మేస్తున్న ఎండీ..

హెచ్.ఎం.డీ.ఏ. అనుమతున్నాయంటూ విస్తృత ప్రచారం.. మంచితరుణం మించిన దొరకదంటూ కళ్లబొల్లి కబుర్లు.. ఒక ష్ఠిర ఆస్థి ఉంటుంది కదానుకుని, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆసరాగా వుంటుందనే ఆశతో ఎంతోమంది అమాయకులు ప్లాటు ధరలో 25 నుంచి 100 శాతం చెల్లించి.. ఇప్పుడు అరిగోస పడుతున్నారు.. ప్లాటు స్వాధీనం చేయమని అడిగితే రేపు మాపు అంటూ తిప్పుతున్న సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ఎండీ మల్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో నరకయాతన పడుతున్న అమాయకుల వేదన వివరించడానికి అలవికావడం లేదు..

గత ఆరు సంవత్సరాలుగా హెచ్.ఎం.డి.ఏ. అనుమతితో సంగారెడ్డి జిల్లా, అమీనాపూర్ మండలం, సుల్తాన్ పూర్ లో ప్లాట్లు కొనడానికి 25 శాతం నుండి 100 శాతం చెల్లించి సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేతిలో అష్ట కష్టాలు పడుతున్నారు కొనుగోలుదారులు. ప్లాట్ల గురించి అడిగితే ఇదిగో మూడునెలలు, అదిగో ఆరు నెలలు అంటూ.. మాయ మాటలు చెబుతూ దాటేస్తున్నాడు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కాగా కంపెనీ పేర వసూలు చేసిన పైకాన్ని హవాల దారిలో తన వ్యక్తిగత ఆస్థులు సమకూర్చడానికి పక్క ద్రోవ పట్టిస్తూ.. బినామి పేర్లపై ఎన్నో ఆస్థులు కూడబెట్టుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. గత 8 నెలలుగా కంపెనీ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో కంపెనీ ఉందంటే జరుగుతున్నదేంటో ఇట్టే అర్ధం అవుతుంది.. దీంతో విసిగి వేసారిన కొనుగోలుదారులు తాము చెల్లించిన డబ్బులకు వడ్డీ ఇవ్వకున్నా పరవాలేదు.. కనీసం అసలైనా ఇవ్వమని అడిగితే.. కొందరి విషయంలో అసలుకే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన బడా నాయకుల అండ ఉన్నట్టు సదరు ఎం.డి. కల్లబొల్లి కబుర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.. ఇతర కంపెనీ ప్లాటుల మార్కెటింగ్ విషయమై బయానా తీసుకొని, కొనుగోలుదారులను ఒక సంవత్సర కాలంగా చెప్పులు అరిగేలాగా తిప్పిస్తున్న సదరు ఎం.డి. గత సంవత్సరం నుండి కంపెనీకి సంబంధించిన రిజిస్టర్డ్ ఆఫీసుకు తాళం వేసి, అసలు కంపెనీ సైన్ బోర్డు కూడా పెట్టకుండా తప్పించుకుంటున్నాడు.. అమీర్ పేట్ కార్యాలయం నుంచి కొన్ని ముఖ్యమైన పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.. సుల్తాన్ పూర్ లోని స్ప్రింగ్ సిటీ వెంచర్-2 విషయమై హెచ్.ఎం.డి.ఏ. అనుమతి ఎప్పుడు వస్తుందో..? సంవత్సరకాలంగా తెలియని దుస్థితి నెలకొంది.. ఇక సుల్తాన్ పూర్ లోని స్ప్రింగ్ సిటీ వెంచర్-2 కొంత భూమి ధరణి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో వున్నా కొనుగోలుదారులను నమ్మించి వంచించే ప్రయత్నం చేస్తున్నాడు.. హెచ్.ఎం.డి.ఏ. వారు అడిగిన సమాచారానికి బదులు ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉండటం శోచనీయం..

- Advertisement -

రాళ్లు, ఇసుక రూపములో రూపాంతరము చెందడానికి అవకాశమున్నది.. కానీ ఎక్కడైనా ఇసుక రాయిలాగా రూపాంతరము చెందగలదా? అది సాధ్యం కానీ పని.. సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరులో గల మాయ, ఎం.డి. మసిబూసిన మాటల గారడితో నిజమవుతున్నది. ప్లాట్ల కొనుగోలుదారులు గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. సదరు కంపెనీ స్ప్రింగ్ సిటీ వెంచర్-2 వెంచర్ పూర్తి చేసే విషయములోని నిర్లిప్తత వలన కొన్ని కొనుగోలుదారు కుంటుంబాలు, అంతర్గత కలహాలకు కూడా గురవుతున్నాయి.

స్ప్రింగ్ సిటీ వెంచర్-1 లో ప్లాట్లు లేకున్నా.. 2017 సంవత్సరంలో అడ్వాంసులు తీసుకొని.. వారిని సర్దుబాటు చేసే క్రమములో స్ప్రింగ్ సిటీ వెంచర్-2 కొరకు అసలు భూమి కంపెనీ పేరుపై లేకున్నా.. సదరు కొనుగోలుదారులను మభ్య పెట్టి, వారిని సర్దుబాటు చేసే క్రమములో కొత్త అగ్రిమెంట్ కాగితాలు ఇవ్వడం జరిగింది. మరి ఇదే అదనుగా సదరు ఎం.డి. తన మాయ మాటలతో కొనుగోలు దారులు ఇవ్వాల్సిన మిగతా పైకానికి సుమారు రూ.2500 నుండి 3000 వరకు ప్రతిగజానికి ధర అదనంగా పెంచడము జరిగింది. దానికి కూడా కొనుగోలుదారులు ఒప్పుకున్నారు.. కానీ ఇప్పటి వరకు కంపెనీ నిర్లక్ష్యం వలన వారు తమ ప్లాటులు దక్కించుకోలేక పోయారు. 2017 సంవత్సరంలో సుల్తాన్ పూర్ గ్రామంలో ఒక ఎకరా భూమి సుమారు ఎనభై లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు మార్కెట్లో లభ్యమయ్యేది.. మరి అదే ప్రాంతములో ఇప్పుడు ఒక ఎకరా భూమి సుమారు 8 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల వరకు పలుకుతుంది. ఇదే అదునుగా భావించి సదరు కంపెనీ ఎటువంటి వెంచర్ డెవలప్మెంట్ చర్యలకు పూనుకోకుండా.. బయానా రూపములో తీసుకున్న మొత్తాన్ని తన ల్యాండ్ బ్యాంకులో జమచేసుకునే క్రమములో ఖర్చుపెట్టింది. 2016లో రేరా చట్టం ఏర్పడినప్పటి నుండి, సదరు కంపెనీ ఇప్పటివరకు కేవలము ఒకే ఒక్క హెచ్.ఎం.డి.ఏ. ప్రాజెక్ట్.. ముత్తంగి గ్రామములో పూర్తి చెయ్యగలిగింది. మరి స్ప్రింగ్ సిటీ వెంచర్-1 విషయమై కూడా హెచ్.ఎం.డి.ఏ. టెంటేటివ్ అప్రూవల్ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వెంచర్ డెవలప్మెంట్ పూర్తి పనులు ముగించి, ఫైనల్ లేఔట్ అప్రూవల్ తీసుకురావడములో విపరీత జాప్యం జరుగుతున్నది.

కాగా గతంలో కూడా ఇతని మీద ఒక ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యి, జైలుకు కూడా పోవడం జరిగింది.. కంపెనీ స్థాపించింది 2013లో అయితే దశాబ్దాల కాలంగా కంపెనీ నడుస్తోందని చెప్పడం కొసమెరుపు.. ఇక రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలో కన్ స్ట్రక్షన్ కంపెనీగా నమోదు అయ్యింది.. కానీ వారు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అంతేకాకుండా మార్టిగేట్ చేసిన భూములను సైతం అమ్ముకున్నాడు..ఎంతో మందిని అడ్డంగా మోసం చేస్తున్నాడు..రక్తం పీలుస్తున్న సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.. వెనుక దాగిఉన్న అసలు వాస్తవాలను.. అమాయకుల నుండి అతగాడు కొల్లగొట్టిన డబ్బుల వివరాలు.. మాయమాటలు చెబుతూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు అమాయక ప్రజలను మోసం చేస్తున్న వైనాన్ని మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది.. ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు