Wednesday, July 24, 2024

ఆలేరు నియోజకవర్గంలో ప్రభావం చూపనున్న రెడ్డి సామాజిక వర్గం..( కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పదా..? )

తప్పక చదవండి

  • ఆలేరుపై బీర్ల అయిలయ్య పెత్తనం ఏంటి..?
  • అలకబూనిన కాంగ్రేస్ లోని రెడ్డి నాయకులు..
  • 1978 నుంచి నేటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు
  • తమను రాజకీయంగా అణచివేస్తున్నారని మనస్తాపం..
  • ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న బీర్లపై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సీరియస్..?
  • 8 మండలాల్లోనూ బీర్ల అయిలయ్య అనుచరులదే హవా..
  • మూడు వర్గాలుగా చీలిపోయిన ఆలేరు కాంగ్రేస్ నేతలు..

ఆలేరు గడ్డ చైతన్యానికి మారుపేరు.. ఆలేరులో గెలిచిన పలువురు నాయకులు ఉన్నత స్థానానికి చేరుకున్న చరిత్ర ఉంది.. అయితే ముందునుంచీ ఆలేరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ముందుండి కాంగ్రెస్ పార్టీని నడిపించడం చూస్తూ ఉన్నాం.. కాల క్రమేణా.. ఆలేరు కాంగ్రెస్ లో వర్గ విభేదాలు పొడ చూపాయి.. ఆ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.. ఇక్కడ ప్రధానంగా నాయకత్వం వహిస్తున్న రెడ్డి సామాజిక వర్గం రవ్వంత నిరాశలోకి చేరిపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.. దానివెనుక వున్న అసలు కారణాలు ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

హైదరాబాద్ ఆవు గట్టున మేస్తే దూడ చేనులో మేస్తుందా.. అట్లుంది ఆలేరు కాంగ్రెస్ నాయకుల తీరు.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు శత్రువులు అనేటోళ్లు ఎవ్వరూలేరు .. స్వంత పార్టీ నేతలే ఒకరిని ఒకరు బహిరంగంగా తిట్టుకుంటారు. నిజానికి ఆలేరు నియోజకవర్గానికి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఇన్‌చార్జి లేరు. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పిలువబడుతున్న బీర్ల అయిలయ్య ఆలేరు వ్యవహారాలను తానొక్కడే చక్కబెడుతుంటారు. ఇప్పుడు ఈయన గారి తీరు పార్టీ స్థానిక నేతలకు, రాష్ట్ర నేతలకు తలనొప్పిగా మారింది. ఆలేరు నియోజక వర్గంలో మొత్తం 8 మండలాలున్నాయి.. అందులో ఏడింటిని ఆ నియోజకవర్గం ఇంచార్జీగా చెప్పుకుంటున్న బీర్ల ఐలయ్య చెప్పిన వాళ్లకే కేటాయించడం జరిగింది. కానీ ఒక్క మండలంలో మాత్రం స్థానిక నేతల అభ్యర్థన మేరకు ఓ మహిళకు కేటాయించడం జరిగింది. మిగిలిన ఆ ఒక్క మండలం కూడా తాను చెప్పిన వారికే కేటాయించాలని బీర్ల ఐలయ్య వర్గీయులు గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. దీంతో రేవంత్ రెడ్డికి చిర్రెత్తికొచ్చినంత పనయ్యింది. గాంధీ భవన్ లో ఆందోళనలు విరమించకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని పార్టీ నేతలకు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు.

అసలు ఆలేరుపై బీర్ల అయిలయ్య పెత్తనం ఏంటి..?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందన్న స్థానాలలో ఆలేరు నియోజకవర్గం ఒక్కటి. ఇక్కడి నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీచేస్తారని
ప్రచారం జరుగుతుంది. అయన కాకపోతే బీర్ల అయిలయ్యకు అవకాశం ఇస్తారంటూ కాంగ్రేస్ నాయకులే అనుకుంటున్నారు. దీంతో బీర్ల అయిలయ్య ఇష్టానుసారంగా నియోజకవర్గ ఇంచార్జీగా చెప్పుకుంటూ స్థానిక నేతలపై పెత్తనం చేస్తున్నారు. ఇది నచ్చని పలువురు సీనియర్లు పార్టీ అధిష్టానం దృష్టికి బీర్ల అయిలయ్య విషయం తీసుకెళ్లడం జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో సీనియర్లు మౌనంగా ఉండిపోయారు.

అలకబూనిన కాంగ్రెస్ లోని రెడ్డి నాయకులు :
నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆలేరు నియోజకవర్గం ఒకటి. 1957 లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. ఇంతవరకు ఇక్కడి నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రాతినిత్యం వహించారు. హోం మినిస్టర్ పదవి కూడా ఇక్కడి వారినే వరించింది. ఆలేరు నియోజకవర్గం నుంచి 7 సార్లు (జనరల్) అభ్యర్థులు, 8 సార్లు (ఎస్సీ) అభ్యర్థులు ప్రాతినిత్యం వహించారు. ప్రస్తుతం గొంగిడి సునీత తెరాస నుంచి గెలిచి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. ఈమెపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసివచ్చే అంశంగా మారింది. గెలిచే సీటు కావడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్దపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు నియోజకవర్గ సీనియర్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ మరో నేత కల్లూరి రామచంద్రారెడ్డి, ఎల్లంల సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బండ్రు శోభారాణితో పాటు మరికొంత మంది నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటి వరకు తమకు లేదా తమలోని వారిలో ఒక్కరికి సీటు వస్తుందన్న ఆశతో ఉన్న నేతలకు, బీర్ల ఐలయ్య వ్యవహారం తలనొప్పిగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆశపడకుండా ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన పార్ట్టీ మారకుండా కాంగ్రెస్ ను నమ్ముకుని పనిచేస్తున్న తమకు అవకాశం కల్పించాలని పలువురు సీనియర్లు అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట. ఒక వేళ టికెట్ ఇవ్వకపోతే తప్పక రెబల్ అభ్యర్థులుగా పోటీలో దిగుతామని ఖరాఖండిగా చెబుతున్నారట. దీంతో ఆలేరులో కాంగ్రేస్ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాలపై దృష్టి సారించి, ఆలేరులో చోటుచేసుకున్న వర్గ విభేదాలను సరిదిద్ది, తగిన నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు