Wednesday, April 17, 2024

దైవం పేరుతో దెయ్యాల కబ్జా..

తప్పక చదవండి
  • సర్వేను ఎందుకు అడ్డుకుంటున్నారు.?
  • సామాన్యులతో ఖమ్మం ఎండోమెంట్‌ ఎట‘కారం’
  • కమీషన్‌లకు కక్కుర్తి పడుతున్న అసిస్టెంట్‌ కమిషనర్‌.!
  • సులోచనమ్మా… కొంచెం బుర్ర పెట్టమ్మా.!
  • ప్రైవేట్‌ భూములపై పెత్తనం ఎందుకు.?
  • సమాచార హక్కు చట్టానికి సమాధి..
  • ఆకు రౌడీ మూకతో దాడులు చేయిస్తున్న కేడీగాళ్లు ఎవరు ?
  • కళ్యాణ్‌ రావు కళ్లెంతో కళ్లు మూసుకున్న కంత్రీగాళ్లు

హైదరాబాద్ : భారతదేశంలో ప్రభుత్వం చేస్తున్న సర్వేను అదే ప్రభుత్వంలో మరో శాఖ అడ్డుకున్న దాఖలాలు లేవు. ఖమ్మం జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇలా ఒక సర్వేను అడ్డుకోవడం వెనుక ఉన్న మతలబుపై ‘ఆదాబ్ హైదరాబాద్’ దృష్టి సారించి ఆధారాలను వెతికి పట్టుకుంది. ఈ శాఖలో జరుగుతున్న అవినీతి లీలలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. చట్టానికి తూట్లు పొడిచి తన పబ్బం గడుపుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కమీషన్‌లకు కక్కుర్తి పడ్డారా..? లేక రౌడీ మూకల బెదిరింపులకు భయపడ్డారా..? అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన వైఖరి అనుమానాస్పదంగా మారింది. ఖమ్మం నగరానికి నడిబొడ్డున ఉన్న ఓ భూ వివాదం విషయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎండోమెంట్‌ సులోచన వైఖరి వివాదాస్పదంగా మారింది. సమస్య పరిష్కారించాల్సిన ఆవిడే స్వయంగా సర్వే వద్దని లిఖితపూర్వకంగా చెప్పటం.. స.హ దరఖాస్తులకు సమాధానం ఇవ్వకపోవడం.. ఇది రౌడీ మూకలకు అంది వచ్చిన వరంలా మారింది. ఇది ఇలా ఉండగా దేవుడి పేరుతో భజన సంఘాల ముసుగులో జరుగుతున్న వెరైటీ భూకబ్జా కథనం ఇది.

అసలేం జరిగింది..?
ఖమ్మం నగర శివారులో శ్రీ శ్రీ సర్కిల్‌ వద్ద గల సర్వే నంబర్‌ 504లో మూడు ఎకరాల భూమి కన్సాలాల్‌ సింగ్‌ వారసులకు, ఎండోమెంట్‌కు మధ్య వివాదం నడుస్తుంది. ఈ భూమికి తూర్పున గల ప్రైవేట్‌ భూమి కలదు. అయితే ఎండోమెంట్‌ నీడన దాగిన ‘ఓ రౌడీ ముఠా’ ఈ భూమని కాజేయాలను కుతంత్రాలు పన్నారు. వీళ్లకు నిత్య ‘కళ్యాణ’ం పచ్చ తోరణంలా ఓ రింగు మాస్టర్‌ తోడయ్యాడు. వాస్తవానికి ఎండోమెంట్‌ ‘తమ ఆధీనంలో ఉంది’ అని చెబుతున్న భూమికి, ఈ చెక్క భజన సంఘాలకు ఉన్న ‘లింకు’ ఏంటో ఖమ్మం ప్రజలకు అర్ధం కాని చిక్కు ప్రశ్న. ఈ వివాదంలో అదే సర్వే నంబర్‌లో ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులు ఇబ్బంది పడుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు సదరు ఎండోమెంట్‌ అధికారులకు. ఎందుకంటే దీన్ని రౌడీ మూకలకు అప్పజెప్పి తమ షేర్‌ తాము దక్కించుకునే ఎత్తుగడలో ఉంది అసిస్టెంట్‌ కమిషనర్‌. జరిగిన తంతు చూస్తే ఈ విషయం ‘వాస్తవం’ అని తెలుస్తోంది.

- Advertisement -

సమాచార హక్కు చట్టాన్ని గౌరవించు అసిస్టెంట్‌ కమిషనరమ్మా..!
పై వివాదంలో ఉన్న భూమి ఎండోమెంట్‌కు ఎలా సంక్రమించిందో సమాచారం ఇవ్వమని జర్నలిస్టులు, ప్రజాసంఘాల వారు ఎన్ని దరఖాస్తులు పెట్టినా బుట్టదాఖలు చేయడం ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచనకు అలవాటుగా.. ఓ ఆనవాయితీగా మారింది. సాక్ష్యాత్తూ పట్టాదారు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి రెండు నెలలు దాటి, రెండు చెప్పుల జోళ్లు అరిగేలా తిరిగినా సమాచారం నేటికీ ఇవ్వలేదు. ఒక్క పట్టాదారుకే కాదు, ఈ కార్యాలయంలో సమాచారం పొందటం అంటే ఎండమావుల్లో ఎండ్రకాయలు పట్టడమే.

డార్క్ రూంలో ‘ఆక్షన్‌’… ఆకు రౌడీలు చెప్పినట్టు యాక్షన్‌ :
ఎండొమెంట్‌ తమదిగా చెప్పుకుంటున్న భూమికి ఈ మధ్య వేలంపాట నిర్వహించినట్టు, ఫలానా చౌక భేరానికి దాన్ని కేటాయించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఎండొమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ను విలేకరులు సంప్రదించగా, వేలం వేసిన మాట వాస్తవమే అన్నారు. అయితే వేలం పాటకు సంబంధించిన ‘పబ్లిక్‌ నోటీస్‌ ఎక్కడ ప్రచురించారు.? ఎక్కడ అంటించారు..?’ అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అప్పటికే ఆ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన ‘చెక్క భజన బృందానికి చెందిన ఓ వ్యక్తికి వేలంలో ఈ భూమి కేటాయించినట్టు పత్రికా ప్రకటన ఇవ్వడం వెనుక భారీగానే ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం’ జరుగుతోంది. ఈ వేలానికి సంబంధించిన సమాచారం ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన దరఖాస్తును యధావిధిగా బుట్టదాఖలు చేయడంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆరితేరారు. వింటున్నావా అమ్మా… నీ మీద కోర్టు ధిక్కారణ కేసు దాఖలు కానున్నట్లు తెలుస్తోంది. జర జాగ్రత్త.

రౌడీ మూకల హల్చల్ :
ఎండోమెంట్‌ వివాదంలో ఉన్నదని ప్రచారంలో ఉన్న భూమి పక్కన భూమిని తేల్చి ఇచ్చేందుకు పట్టాదారు సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ భూమి పక్కన ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులకు ఏడీ సర్వేయర్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ భూమి వద్దకు చేరుకున్నారు. ఎండోమెంట్‌ బోర్డు నీడన జోగుతున్న ప్రైవేట్‌ ముఠా రంగంలోకి దిగి పక్కన ఉన్న భూమి యజమాని వెంకట రమణ భర్త సీనియర్‌ జర్నలిస్టుపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఫోన్‌ లాక్కొని కిడ్నాప్‌ చేసి, బలవంతంగా సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న వ్యక్తులు 100 కి డయల్‌ చేయగా పోలీసులు వచ్చి వెంకటరమణ కుటుంబ సభ్యులను కాపాడారు.

అసిస్టెంట్‌ కమిషనరమ్మా అబద్దాలు ఆపు తల్లీ :
నెత్తుటి ఏరులు పారేలా నటనలు..
అడ్డంగా దొరికి పోయిన అసిస్టెంట్‌ కమిషనర్‌..
గతంలో ఇదే స్థల వివాదం పత్రికల్లో రావడంతో తనను కలిసిన పాత్రికేయులతో ఈ అసిస్టెంట్‌ కమిషనర్‌ తాము ఎండోమెంట్‌ బోర్డు సర్వేయర్‌కు ల్యాండ్‌ సర్వే కోసం దరఖాస్తు పెట్టామని, సిబ్బంది కొరత వల్ల సర్వేకు సమయం పడుతుందని, త్వరలోనే రెక్వెస్ట్‌ చేసి సర్వే చేయించి అద్దులు నిర్ణయించి వేలం పాట పాడిన వ్యక్తికి స్థలం కేటాయిస్తామని మీడియాతో స్పష్టంగా వివరించింది. భజన సంఘాలకు, బద్మాష్‌ సంఘాలకు ఆ భూమితో సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాగా పట్టాదారు సర్వేకోసం దరఖాస్తు చేయగా సర్వే జరిపే రోజు యుద్ద ప్రాతిపదికన ఆ సర్వేని తాము వ్యతిరేకిస్తున్నామని, సర్వేని నిలిపివేయమని అధికారికంగా ఆర్‌సీ నం. డీ/2587/2023. ద్వారా డిప్యుటీ ఇన్‌స్టెక్టర్‌ కి లేఖ పంపారు. ఈ లేఖలోనే భజన సంఘాల చేతుల్లో బొమ్మగా మారిందన్న విషయం తేట తెల్లం అవుతోంది.

అసిస్టెంట్‌ కమిషనర్‌కు అవగాహన లేదా ? లేదా కళ్యాణం కళ్లెంతో కళ్లు మూసుకుందా ?
డిప్యుటీ ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ సర్వేకి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన లేఖలో ఎండోమెంట్‌ కు సంబందం లేని కేసులను ఉదహరించడంతో ప్రైవేట్‌ వ్యక్తులతో కుమ్మక్కైన విషయం తేటతెల్ల అయింది. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన లేఖలో ఓ.ఎస్‌ నం. 1688/2023 కేసు వెంకటరమణ వర్సెస్‌ సాయికి మధ్య భూ వివాదం. ఇందులో తమని పార్టీలుగా చేర్చమని భూమికి సంబంధం లేని భజన సంఘం వేసిన పిటీషన్‌ పై కోర్టు నిర్ణయం పెండింగ్‌లో ఉంది. తన లేఖలో పేర్కొన్న మరో కేసు ఓ.ఎస్‌ నం. 595/2023. బండి ధర్మాసింగ్‌కు భజన సంఘానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న వాకదాని రామనారాయణకు మధ్య వివాదం. ఈ వివాదానికి ఎండోమెంట్‌ బోర్డుకు ఏం సంబంధం అనేది అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన ఆలోచించి అవగాహనతో చెప్పాలి. అసలు ఈ లేఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాసారా లేక చెక్క భజన సంఘానికి భజన చేస్తూ కళ్లెం వేసిన వాళ్లు రాసిచ్చిన లెటర్‌ పై ఆర్‌.సీ నంబర్‌ వేసి సంతకం పెట్టారా అనే అనుమానం రాక మానదు. ఎందుకంటే ఈ ఓ.ఎస్‌ నంబర్లకు సంబంధించిన సమాచారం ఎండోమెంట్‌కు చేరే అవకాశమే లేదు. వారు పార్టీ కాని కేసుల వివరాలు, వారికి నోటీలు వెళ్లని వివరాలు వారికి తెలిసే అవకాశమే లేదు. అంటే దీన్ని బట్టి భజన సంఘం వేస్తున్న తాళానికి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆడుతుందనేది బహిరంగ రహస్యం.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ :
ఎండోమెంట్‌ గూటిలో కూర్చొని సామాన్య ప్రజల భూ సమస్యల పై నిమ్మకు నీళ్లు చల్లినట్టు వ్యవహరిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన ఈ భూమి విషయంలో అతిగా స్పందించడం వెనుక అంతరార్ధం ఏమిటనేది అక్షర జ్ఞానం లేని వాళ్లు కూడా అర్ధం చేసుకోగలరు. అటు ట్రిబ్యునల్‌ కేసుల్లో, సివిల్‌ కేసుల్లో నలుగుతుందనే విషయాన్ని తానే చట్ట బద్దంగా ఒప్పుకున్న కమిషనర్‌, తమకు అనుకూలంగా తీర్పు రాక ముందే ఎలా వేలం పాట నిర్వహిచారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కనీసం పట్టాదారులు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందనే కనీస విచక్షణ లేకుండా వ్యవహరించడం వివాదాలకు ఆజ్యం పోసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అవుతుంది.

సీట్లో ఎందుకు ఉండరు మామ్ :
ప్రజలకు అందుబాటులో ఉంది సమస్యలు పరిష్కరించాల్సిన అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసులో అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. నెలలో కనీసం రెండు సార్లు కూడా కార్యాలయంలో కుర్దుగా ఉన్న సందర్భాలు అరుదు. మేడం గారు ఎక్కడా అంటే టూర్‌లో ఉన్నారని టక్కున సమాధానం చెప్పడం సిబ్బందికి అలవాటుగా మారింది. ఏ టూర్‌ అంటే మాత్రం అలా చెప్పకూడదు సార్‌ అనడం కూడా ఆనవాయితీగా మారింది. ఇప్పటికైనా అసిస్టెంట్‌ కమిషనర్‌ తన వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. బాధితులంతా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు