ఒక వ్యక్తి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మతాంతర ప్రేమ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడ్ని కొట్టి చంపారు. ఆ వ్యక్తి దొంగ అని, తమ ఇంట్లోకి చొరబడటంతో కొట్టినట్లుగా పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బాలిక, యువకుడి కాల్ డేటా ద్వారా అసలు విషయం తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల పర్వేజ్, ముస్లిం బాలిక మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఖోడా ప్రాంతంలోని ఆ బాలిక ఇంటికి అతడు వెళ్లాడు. బాలికను కలిసిన పర్వేజ్‌ను చూసి ఆమె తండ్రి, బంధువులు దాడి చేశారు. అతడ్ని పట్టుకుని ఐరన్ రాడ్లతో కొట్టారు. కాగా, పర్వేజ్ దొంగ అని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ ఇంట్లోకి చొరబడిన అతడ్ని పట్టుకుని కొట్టినట్లు పోలీసులకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడ్ని జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు పర్వేజ్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి, ఆ బాలిక మొబైల్ ఫోన్స్ కాల్ డేటాను పరిశీలించారు. దీంతో వారిద్దరి మధ్య కొంత కాలంగా పరిచయం ఉందని గ్రహించారు. వారి ప్రేమ వ్యవహారం నచ్చని బాలిక తండ్రి, బంధువులు పర్వేజ్‌ను హత్య చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.