Sunday, October 13, 2024
spot_img

నాగ్‌పూర్‌లో బీ.ఆర్.ఎస్. కార్యాలయం..

తప్పక చదవండి
  • పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌..
  • రైతులు ఎప్పటికీ బలహీనులు కారు..
  • వారిని అవమానించేవారికి గుణపాఠం తప్పదు..
  • దేశానికి అన్నం పెట్టే రైతు పార్లమెంట్ లో చట్టాలు చేయలేడా..?
  • దేశంలో సరిపడా సాగు నీరు, విద్యుత్ అందించడమే ధ్యేయం : కేసీఆర్..

నాగ్‌పూర్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాలయంలో లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం నాగ్‌పూర్‌ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్‌ వాకోడ్కర్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..

రైతులు ఎన్నటికీ బలహీనులు కాదని.. దేశాన్ని నడుపుతున్న బలమైన శక్తులు అని కేసీఆర్‌ కొనియాడారు. రైతులను అవమానించే వారికి గుణపాఠం తప్పదని కేసీఆర్‌ హెచ్చరించారు. అంతేకాదు.. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత.. పార్లమెంట్‌లో చట్టాలు చేయలేడా.. అని కేసీఆర్‌ అడిగారు. దేశం మొత్తంలో 48 శాతం మంది రైతులే ఉన్నారన్న కేసీఆర్‌.. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే 60 శాతం మందికి ఉపాధి వస్తుందని వివరించారు. దేశంలో సరిపడా సాగునీరు, విద్యుత్‌ ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ అయ్యేంతవరకు బీఆర్‌ఎస్‌ పోరాడుతూనే ఉంటుందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు తెలంగాణ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. రాష్ట్ర అభివృద్ధి అవగతమవుతుందని కేసీఆర్‌ వివరించారు. 2014కు ముందు.. కరెంట్‌ కష్టాలు, నీటి కటకటలు, రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం కన్నీళ్లు పెట్టుకునేదని.. ఇప్పుడు మాత్రం వ్యవసాయాన్ని పండుగ చేసామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. రైతులకు అవసరమైన సాగు నీటిని అందిస్తున్నామని.. 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నామని.. రైతుబంధు కూడా ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవ్వటంతో ధాన్యం దిగుబడిలో.. ఇప్పుడు దేశానికే ధాన్యబంఢాగారంగా ఉండే పంజాబ్‌ను సైతం తెలంగాణ దాటేసిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అంతేకాదు.. తెలంగాణలో పండిన పంటనంతా ప్రభుత్వమే కొంటోందని.. పంట సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతులు పండిస్తున్న పంటతో ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పుకొచ్చారు కేసీఆర్‌. బియ్యం కావాలని కర్ణాటక సీఎం.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు కేసీఆర్‌ తెలిపారు. దీన్ని బట్టి తెలంగాణ సర్కార్‌.. వ్యవసాయాన్ని పండుగలా చేసిందో అర్థకావటానికి. ఇదిలా ఉంటే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100కు 100 శాతం కాకపోయినా.. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్నారు కేసీఆర్‌. అయితే.. రైతు ఎలా చనిపోయినా ఆ కుటుంబానికి రైతు బీమా అందిస్తున్నట్టు తెలిపారు కేసీఆర్‌. రైతులు తలచుకుంటే ఏదైనా చేయగలరని.. ఎలాంటి మార్పునైనా సాధించగలరని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతులు పండిరచటం ఆపేస్తే.. అంబానీ, అదానీలు వేటితో వ్యాపారం చేస్తారని ప్రశ్నిస్తూ.. విపక్షాలు కూల్‌గా కౌంటర్‌ ఇచ్చారు కేసీఆర్‌. దేశంలో పండే పంటను కేవలం భారత్‌కే కాదు.. మొత్తం ప్రపంచమంతటికీ ఎగుమతి చేయొచ్చని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువ శాతం వ్యవసాయం యోగ్యమైన భూమి ఉంది. మనం తలుచుకుంటే దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు. దేశంలో జల విధానం సమూలంగా మారితేనే మార్పు సాధ్యం అవుతుంది. విద్యుత్‌ విషయంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశంలో బొగ్గుకు కొరత లేదు, అయినా విద్యుత్‌ సమస్య ఉంది. దేశంలోని బొగ్గుతో 150 ఏళ్లు విద్యుత్‌ ఇవ్వొచ్చని కోల్‌ ఇండియానే చెబుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మేం సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పను గానీ, గణనీయంగా తగ్గించగలిగాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

- Advertisement -

ఈ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, సంతోష్‌ కుమార్‌, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దానం నాగేందర్‌, ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల, మహారాష్టకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. నాగ్‌పూర్‌ పట్టణమంతా బీఆర్‌ఎస్‌ ప్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన సీఎం కేసీఆర్‌ ముఖచిత్రంతో కూడిన ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. కాగా, పట్టణంలోని గాంధీబాగ్‌లో విశాలమైన స్థలంలో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌భవన్‌ను పార్టీ నాయకులు సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు