- ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్..
- బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్..
- ధరణితో అద్భుతాలు జరుగుతున్నాయి..
- 9 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాం.. దేశంలో అగ్రగామిగా ఉన్నాం..
- హైదరాబాద్ ఐటీ హబ్ గా మారింది : సీఎం కేసీఆర్..
నాగర్‌కర్నూల్, నాగర్‌కర్నూల్ పర్యటనలో పలు ప్రారంభోత్సవాలకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. కొత్తగా ఏర్పట్ట జిల్లాల కేంద్రంలో నిర్మించిన సవిూకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలిసిందే. ఆయా జిల్లాలకు అన్నిహంగులతో సవిూకృత కలెక్టరేట్లను నిర్మించేందుకు నిర్ణయించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్ చౌరస్తాలో 12ఎకరాల సువిశాల స్థలంలో 1.25లక్షల చదరపు అడుగుల స్థలంలో గ్రౌండ్ ప్లోర్‌తో పాటు రెండు అంతస్తుల్లో నిర్మాణమైంది. సవిూకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. రూ.52కోట్లతో కలెక్టరేట్ నూతన భవనం నిర్మాణమైంది. ఇక్కడే 32శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీకుమార్, ఎస్పీ మనోహర్‌తో పాటు పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసు సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయ శిలాఫకలాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో ఎస్పీ మనోహర్‌ను కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్‌తో పాటు జిల్లా అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఆ తరవాత నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ఆవరణలో బీఆర్‌ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి దండం పెట్టారు. పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్‌పీ, కలెక్టరేట్‌ను పూర్తి చేసి తన చేత ప్రారంభించుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. 19వ కలెక్టరేట్‌ను ఇవాళ ప్రారంభించుకున్నాం. గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్‌ను కూడా త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. ఓ ప్రబుద్ధుడు ధరణి పోర్టల్‌ను తీసేస్తామన్నాడని, గంగలో కలిపేస్తామన్నాడని కేసీఆర్ గుర్తు చేశారు. గతంలో భూ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే నాలుగైదు రోజులు పట్టేది. ఎంతో డబ్బు ఖర్చయ్యేది. ఇంతకుముందు భూముల రిజిస్ట్రేషన్లు మార్చాలంటే, అధికారుల చేతుల్లోనే అంతా ఉండేది. ధరణి వచ్చాక భూ రిజిస్ట్రేషన్ మరొకరి పేరుపైకి రాసే హక్కు వీఆర్వో నుంచి సీఎం వరకూ ఎవరికీ లేదని చెప్పారు. భూమి ఉన్న రైతు వేలి ముద్ర పెడితేనే అతని అంగీకారంతోనే మరొకరి పేరు మీదకి భూమి మార్చే అవకాశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లో పూర్తి అయిపోతోందని అన్నారు. ధరణి లేకపోతే రైతు బంధు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అన్ని వివరాలు కంప్యూటర్ లో ఉన్నాయి కాబట్టి, ధాన్యం అమ్మకం తర్వాత ఆటోమేటిగ్గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని అన్నారు.
ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో అగ్రభాగాన ఉంది. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ఇక్కడ ఉన్నారు. ఉద్వేగంతో చాలా గొప్పగా పాటలు రాస్తారు. సహజమైన కవి. వాగు ఎండిపాయేరా, పెద్ద వాగు ఎండిపాయేరా అని వెంకన్న పాటలు రాసారు. దుందుభి నది ఎలా కొట్టుకుపోయిందో వారు చెప్పారు. హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు ఆ వాగు మీద కట్టిన చెక్ డ్యామ్‌లు, నీటిని చూసి ఆనందించిపోయాం. నేను, జయశంకర్ సార్ కలిసి తిరుగుతుంటే.. పాలమూరు కరువు గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. సూర్యాపేట నుంచి కల్వకుర్తి ప్రాంతమంతా ఎడారిలా ఉండేది. అలాంటి కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మంచినీటి పథకంలో విజయం సాధించాం. అనేక అవార్డులు, రివార్డులు సాధించాం అని కేసీఆర్ తెలిపారు.
భారతదేశంలో ఐటీ ఉద్యోగాలకు హైదరాబాద్ నెలవుగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విధంగా ఈ 9 ఏండ్లలో అనేక విజయాలు సాధించాం. కరోనా, నోట్ల రద్దు బాగా దెబ్బతీసింది. మొత్తంగా ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించినందుకు ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తున్నాను. అన్ని రంగాలు సమన్వయంతో కలిసి పని చేయడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది. వలసలకు, కరువుకు నెలవైన జిల్లాలో అద్భుతమైన, బ్రహ్మాండమైన అద్భుతాలు జరుగుతున్నాయి. కన్నుల పండువగా పంటలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ పిలుపునిచ్చినా యజ్ఞంలా, ఒక ధర్మకార్యంలా మీ స్థాయిల్లో పని చేశారు. దేశంలోని ఏ పల్లెలు కూడా మన పల్లెలకు సాటిరావు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి. ధర్మం తప్పకుండా జయిస్తది అని కేసీఆర్ పేర్కొన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో తొమ్మిదేండ్లు గడిచిపోయాయి. ఈ తొమ్మిదేండ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుని, భారతదేశంలోనే అగ్రభాగానా ఉన్నాం. అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్. కరెంట్ వస్తదో రాదో తెలియని పరిస్థితి. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా మనమే నంబర్ వన్. సంక్షేమ రంగంలో కూడా రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడుతూ ముందున్నాం అని కేసీఆర్ తెలిపారు. అణగారిని దళిత జాతిని ఉద్దరించాలనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి దళితబంధు ద్వారా ఆదుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక నాడు ముంబై బస్సులకు ఆలవాలం పాలమూరు. గంజి కేంద్రాలు వెలిసేవి. పాలమూరులో ఈ గంజి కేంద్రాలు ఏంటని ఏడ్చేవాళ్లం. గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలో అవి మాయమయ్యాయి. పంట కొనుగోలు కేంద్రాలు వచ్చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం ఇది. కేసీఆర్ రాకముందు ఇక్కడ్నుంచి మంత్రులు ఉన్నారు. కానీ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పాలమూరును దత్తతను తీసుకున్నారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీళ్లు దుంకుతున్నాయి. ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్, వనపర్తికి మంజూరు చేయగానే మీ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చి మెడికల్ కాలేజీ కోరిండు. అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి.. మెడికల్ కాలేజీ మంజూరు చేయించాం. ఐదు మెడికల్ కాలేజీలు పాలమూరు జిల్లాలోవ స్తాయనికలగన్నమా..? అని కేసీఆర్ ప్రశ్నించారు