- ప్రభుత్వ ప్లే గ్రౌండ్ ను సొంతానికి వాడుకుంటున్న కోచ్..
- లంచాలిచ్చి గేమ్ ఇన్స్ పెక్టర్, చౌకీదారులతో కుమ్మక్కు..
- జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ డివిజన్, జూబిలీహిల్స్ లో
చోటుచేసుకున్న ఘటన.. - ప్రైవేట్ గా క్రికెట్ కోచింగ్ ఇస్తూ రూ. 5000 ఒక్కొక్కరి దగ్గర వసూలు..
- గవర్నమెంట్ ప్లే గ్రౌండ్ వాడుకోవడానికి లక్షల్లో
ముడుపులు చెల్లించినట్లు సమాచారం..
( చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆటస్థలంలో ఇంత
జరుగుతున్నా స్పోర్ట్స్ డైరెక్టర్ మహబూబ్ భాషా, అడిషనల్
కమిషనర్ స్పోర్ట్స్ ఏ. విజయలక్ష్మి ల దృష్టికి రాలేదా..? ఒకవేళ వారికి తెలిసే ఈ తతంగం జరుగుతోందా..? )
లంచాల రుచి మరిగిన కొందరు ప్రభుత్వ అధికారులు స్వప్రయోజనాలకు అడ్డదారులు తొక్కుతుండటంతో.. చీమలు పెట్టిన పుట్టలు పాముల కరువైన యట్లు.. చిన్న చిన్న అక్రమాలే పెను ప్రమాదంలా మారి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నాయి.. చిన్న తప్పేకదా అని కొందరు అధికారులు అక్రమార్కులను వదిలేస్తుండటంతో.. అలాంటి తప్పులే వందల్లో వేలల్లో వేళ్లూనుకపోయి సమాజానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి.. ఇలాంటి తప్పిదమే జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్స్ లో నెలకొన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన గల జీ.హెచ్.ఎం.సి. ప్లే గ్రౌండ్ లో చోటుచేసుకుంది.. ఇదే విషయమై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో 22 మే 2023 నాడు ” ప్రభుత్వ ప్లే గ్రౌండ్ లో ప్రైవేట్ కోచింగ్.. ” ఆమె శీర్షికతో ప్రచురించడం జరిగింది.. ఆతరువాత జరిగిన పరిణామాలు ఒక సారి అవలోకనం చేసుకుందాం..
హైదరాబాద్, జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ జోన్, జుబ్లిలీహిల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన గల జీ.హెచ్.ఎం.సి. ప్లే గ్రౌండ్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి క్రికెట్ కోచింగ్ ఇస్తున్నాడు.. నిజానికి ప్రభుత్వానికి సంబంధించిన ప్లే గ్రౌండ్ లో ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి కోచింగ్ లు ఇవ్వడం గానీ, వాడుకోవడానికి గానీ వీలులేదు.. ప్రభుత్వ ప్లే గ్రౌండ్స్ అన్నవి.. చదువుకునే పిల్లలకు ఆటల్లో నిష్ణాతులను చేయడానికి ఉపయోగిస్తారు.. కానీ జూబిలీహిల్స్ లో ఉన్న ఈ ప్రభుత్వ ఆట స్థలంలో ఒక ప్రైవేట్ కోచ్ పాగా వేసి ఏకంగా క్రికెట్ కోచింగ్ ఇస్తున్నాడు.. ప్రతి వ్యక్తి నుంచి సుమారు రూ. 5 వేలు వసూలు చేస్తుండటం గమనార్హం.. కాగా ఈ ప్లే గ్రౌండ్ తాను వాడుకోవడానికి, గేమ్ ఇన్స్ పెక్టర్, చౌకీదారులకు లక్షల్లో లంచం చెల్లించినట్లు తెలుస్తోంది.. పైగా ఇక్కడ కోచింగ్ తీసుకునే వారు మూడు నెలల ఫీజు అంటే రూ. 15,000 లు ముందుగానే చెల్లించాలని ఆ ప్రైవేట్ కోచ్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.. ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర లక్షల్లో లంచం పుచ్చుకుని ప్రభుత్వ ఆట స్థలాన్ని అతగాడికి అప్పగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
కాగా ఆదాబ్ లో కథనం ప్రచురితం అయిన తరువాత అక్కడ జరుగుతున్న నిర్వాకం గురించి ఆదాబ్ ప్రతినిధులు సంబంధిత అధికారులైన స్పోర్ట్స్ డైరెక్టర్ మహబూబ్ భాషా, అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ ఏ. విజయలక్ష్మి.. ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.. దీనిపై స్పందించిన ఆ అధికారులు స్పందిస్తూ ఇదే విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరాం.. వారి దగ్గరనుంచి రిప్లై వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.. అయితే ఇప్పటికి నెలరోజులు గడిచిపోతున్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. అసలు వారు వివరణ కోరారా..? ఒకవేళ వివరణ కోరితే సంబంధిత అధికారుల నుంచి జవాబు వచ్చిందా..? ఒకవేళ జవాబు వస్తే ఎందుకు చర్యలు చేపట్టలేదు అన్నది తేలాల్సి ఉంది.. ఒకవేళ వీరిరువుకూడా సదరు ప్రైవేట్ కోచ్ తో ఏదైనా లోపాయికారి ఒప్పొందం చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. ఇప్పటికైనా స్పోర్ట్స్ డైరెక్టర్ మహబూబ్ భాషా, అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ ఏ. విజయ లక్ష్మి లు స్పందించి తగిన చర్యలు గైకొని, జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుతారా..? అన్నది వేచి చూడాలి..