Friday, March 29, 2024

కిడ్నీలు చోరీ.. 8 నెలలుగా ఐసీయూలోనే బీహార్‌ మహిళ..

తప్పక చదవండి

కడుపునొప్పితో నకిలీ వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ దుర్మార్గుల చేతికి చిక్కి రెండు కిడ్నీలనూ కోల్పోయింది. ఎనిమిది నెలలుగా ఐసీయూలో ప్రాణం కాపాడుకునేందుకు పోరాడుతున్నది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గల మథురాపూర్‌ గ్రామానికి చెందిన పేద దళిత మహిళ సునితా దేవి కడుపునొప్పితో 2022 సెప్టెంబరు 3న స్థానికంగా ఉన్న శుభ్‌కాంత్‌ క్లినిక్‌కు వెళ్లింది. ఈ క్లినిక్‌ను వైద్యుడిగా చలామణి అవుతున్న పవన్‌ కుమార్‌ అనే కాంపౌండర్‌ నడిపిస్తున్నాడు. అతడితోపాటు జితేంద్ర కుమార్‌ పాశ్వాన్‌, ఆర్కే సింగ్‌ అనే వైద్యులు, పవన్‌ కుమార్‌ భార్య కలిసి రెండున్నర గంటలు ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌కు రూ.20 వేలు వసూలు చేశారు. తర్వాత పవన్‌ కుమార్‌ పట్నాలోని మరో దవాఖానకు సునీతను తరలించి పరారయ్యాడు. అక్కడ రూ.40 వేలు ఖర్చైన తర్వాత ఆమెను పట్నా మెడికల్‌ కాలేజీ, దవాఖానకు తీసుకెళ్లగా ఆల్ట్రాసౌండ్‌ చేస్తే సునీత రెండు కిడ్నీలు కనిపించలేదు. దీంతో షాక్‌ తిన్న వైద్యులు, కుటుంబసభ్యులు ఆమె రెండు కిడ్నీలు చోరీ అయ్యాయని గుర్తించారు. సునీత ప్రభుత్వ సాయంతో డయాలసిస్‌ చేయించుకుంటూ చికిత్స పొందుతున్నది. ఆమెకు అండగా ఉండాల్సిన భర్త మొఖం చాటేశాడు. కిడ్నీలు చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నీలను వారు అమ్మలేదని, అవి కుళ్లిపోయాయని పోలీసులు చెబుతున్నారు. పవన్‌ కుమార్‌ కిడ్నీని తనకిచ్చి ప్రాణాలు కాపాడాలని సునీత కోరుతున్నది. గతంలోనూ 2011-2012 మధ్య కాలంలో బీహార్‌లోని 700 మంది మహిళల గర్భాశయాలు అక్రమంగా తొలగించారని వార్తలు వచ్చాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు