- అమెరికాలో చోటుచేసుకున్న దుర్ఘటన..
- ఫిలడెల్ఫియాలో గుర్తుతెలియని వ్యక్తుల అరాచకం..
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖలీజ్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల జూడ్ చాకో ఓ వైపు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జూడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తల్లిదండ్రులు కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన వారు. 30 ఏళ్ల క్రితమే వారు యూఎస్‌కు వలస వెళ్లారు.
యూఎస్‌లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం ఈ ఏడాది ఇది రెండో ఘటన. దీంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్ 21వ తేదీన అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓహోయోలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సాయూశ్ వీరపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు.