- బలవర్మరణానికి పాల్పడ్డ విద్యార్థులు..
- బాసర ట్రిపుల్ ఐటీ.. బాచుపల్లి నారాయణ
కాలేజీల్లో విషాదం.. - పసిమొగ్గల ప్రాణాలు తీస్తున్న పరిస్థితులు..
( మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు.. అంటూ ఒక కవి చెప్పిన మాటలు ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయో తెలియడం లేదు కానీ, చిన్న చిన్న మనో వేదనలకే నిండు జీవితాలను చాలిస్తున్నారు కొందరు.. ఈ కోవలోనే విద్యాకుసుమాలు అకారణంగా రాలిపోతున్నాయి.. ఉన్నత విద్యా పరిమళాలు వెదజల్లాల్సిన పసి మొగ్గలు మధ్యలోనే మట్టిలో కలిసిపోతున్నాయి.. తల్లి దండ్రులకు కడుపుకోతను మిగిలిస్తూ.. వంద సంవత్సరాల జీవితాన్ని బలవర్మణానికి అంకితం చేస్తున్నారు.. )
హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో విద్యాసంస్థలు ఓపెన్ చేసి రెండ్రోజులు కూడా కాలేదు. అప్పుడే రెండు విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడవగా.. మరోవైపు.. బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యా కుసమం నేలరాలింది. క్యాంపస్‌లో పీయూసీ రెండో ఏడాది చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ బాత్‌రూంలో ఆమె చున్నీ సాయంతో ఉరేసుకుంది.
కాగా ఈ ఉదయం బాత్‌రూంకి వెళ్లిన దీపిక ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో భద్రతా సిబ్బంది డోర్లు పగలగొట్టి చూడగా.. ఆమె కిటికీకి ఉరేసుకొని కన్పించింది. వెంటనే విద్యార్థినిని బైంసా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం బాడీని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని సంగారెడ్డి జిల్లాకు చెందినదిగా గుర్తించారు. అయితే ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. చదువుల వల్ల మానసిక ఒత్తిడా ? లేక మరదైనా కారణమా ? తెలియాల్సి ఉంది. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇక మంగళవారం రోజే మరో విషాద సంఘటన చోటు చేసుకుంది.. మేడ్చల్ జిల్లా, బాచుపల్లి నారాయణ కాలేజీలోనూ ఓ విద్యార్థి చనిపోయింది. కళాశాల భవనం పైనుంచి దూకి ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రాగుల వంశిత అనే స్టూడెండ్ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిది కామరెడ్డి కాగా.. వారం రోజుల క్రితమే ఆమె తల్లి దండ్రులు కాలేజీలో చేర్పించి వెళ్లారు. అప్పటి నుంచి కాలేజీ క్యాంపస్‌లోనే ఉంటున్న వంశిత.. ఉదయం కాలేజీ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. ఇది గమనించిన కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. కాలేజీ ప్రాంగణానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. వంశిత బిల్డింగ్ పైనుంచి దూకిందా ? లేక ఆమెను ఎవరైనా తోసేశారా ? అన్న కోణంలో విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతి ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.