- డివిజన్ -1జిఎం, మేనేజర్ ల నిర్వాకం..
- జలమండలి ఉన్నతాధికారుల విచారణలో బహిర్గతం..
- బిల్లులు చెల్లించాలని కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్..
- బిల్లులు చెల్లించాలని ఆదేశాలిచ్చిన కోర్టు..
- తలపట్టుకుంటున్న ఉన్నతాధికారులు..
- అవినీతి అధికారుల వాళ్ళ బోర్డుకు రూ.20 లక్షకు పైగా నష్టం..
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వివిధ శాఖల్లో చోటుచేసుకుంటున్న అవినీతి వ్యవహారాలతో ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పడుతున్నాయి.. నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు అన్న చందాన కొందరు అధికారులు అవినీతిలో మునిగి తేలుతుండటంతో.. కాంట్రాక్టర్లతో చేతులు కలుపుతూ.. చేయని పనులకు సైతం బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది.. ఇలాంటి సంఘటనే తెలంగాణ రాష్ట్ర జలమండలిలో చోటుచేసుకుంది.. ఇద్దరు అవినీతి అధికారుల నిర్వాకం వల్ల ఒక కాంట్రాక్టర్ కి పనులు చేయకుండానే బిల్లులు చెల్లించాల్సి వచ్చింది.. వీరు చేసిన భాగోతాన్ని తనకు అనువుగా మార్చుకున్న ఆ కాంట్రాక్టర్ ఏకంగా కోర్టుకు వెళ్లి మరీ తాను చేయని పనులకు పెండింగ్ బిల్లులు సమర్పించి, శాంక్షన్ అయ్యేలా కోర్టునుంచి ఆదేశాలు పొందడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
కొంతమంది అవినీతి ఆధికారుల కారణంగా జలమండలి ఆర్థికంగా నష్టాల పాలవుతోంది.. గతంలో ఓ కాంట్రాక్టర్ పనులు చేసినట్లు పెండింగ్ లో ఉన్న బిల్లులుగా చిత్రీకరించి, ప్రస్తుతం ఉన్న ఆధికారులు సదరు కాంట్రాక్టర్ తో కుమ్ముకై.. పనులు పూర్తి చేసినట్లు నిర్ధారించడంతో.. దాదాపు రూ.20 లక్షలకు పైగా ఉన్న పెండింగ్ బిల్లుకు ప్రాణం పోశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఏది ఏమైనప్పటికీ పనులు చేయని కాంట్రాక్టర్ కు జలమండలి బిల్లులు చెలించాల్సిన పరిస్థితి దాపురించడంతో.. జలమండలి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.. వివరాల్లోకి వెళ్తే..
జలమండలి డివిజన్ -1 పరిధిలోని న్యూ మిశ్రిగంజ్ సెక్షన్ లో గతంలో (2005 నుంచి 2014) దాదాపు రూ.20 లక్షలకు పైగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో పనులు చేసినట్లు ఓ కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లు ల రూపంలో బిల్లు పెట్టుకున్నాడు. అయితే పెండింగ్ లో ఉన్న ఈ బిల్లులను 2020లో డివిజన్-1 జనరల్ మేనేజర్ మహమ్మద్ ఖాదర్ మోహినుద్దీన్, న్యూ మిశ్రిగంజ్ సెక్షన్ మేనేజర్ ఎం. ఈశ్వరయ్య ఏలాంటి పనులు చేపట్టని పనులకు, పనులు పూర్తి చేసినట్లు నిర్ధారించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఇదే అదనుగా భావించి, తాను పూర్తి చేసిన పనులకు జలమండలిలో పెండింగ్ లో బిల్లులు చెల్లించాలని కోరుతూ బోర్డుకు నివేదించాడు.. బోర్డు సదరు కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించక పోవడంతో తిరిగి సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో జలమండలి ఉన్నతాధికారులు అసలు విషయాన్ని బయటికి తీసేందుకు కంకణం కట్టుకున్నారు. జలమండలికి సంబందించిన పలువురు అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, విచారణ చేపట్టింది. ఈ విచారణలో అసలు విషయాలు బయట పడటంతో ఆధికారులు విస్మయానికి గురయ్యారు . గతంలో జలమండలిలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం. ఈశ్వరయ్య వివిధ అక్రమాల కారణంగా మూడు సార్లు సస్పెండ్ అయినట్లు, అదే విధంగా వాటర్ పైపులకు సంబందించిన కేసులో జీ.ఏం. మహమ్మద్ ఖాదర్ మొహినుద్దీన్ నుండి బోర్డు రూ.6.5 లక్షలు జీతం నుండి రికవరి చేసినట్లు విచారణ ఆధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా బోర్డు పరిధిలో కాంట్రాక్టర్లు పనులు చేపట్టిన పెండింగ్ బిల్లులు సుమారు రూ.32 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దీంతో బోర్డు ఆదికరుల బృందం లోతుగా విచారణ చేపట్టింది. విచారణ పూర్తి చేసిన ఆధికారులు బృందం త్వరలో జలమండలి ఎండికి నివేదికను అందించనున్నారు. ఈ విషయంలో ఎండి ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..