Wednesday, April 17, 2024

డమ్మీలతో దందా..

తప్పక చదవండి
  • జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ 17లో యథేచ్ఛగా అక్రమ వ్యవహారం..
  • ఏ.ఎం.ఓ.హెచ్. భార్గవ నారాయణ కనుసన్నలలోనే నడుస్తున్న కథ..
  • ఒక్కో ఎస్.ఎఫ్.ఏ. నుండి నెలకు రూ. 6000 వసూలు..
  • రిజిస్టర్ లో పేరుంటుంది.. కానీ అ వ్యక్తులు ద్యూటీలో ఉండరు..
  • తమ వారిని పారిశుద్ద కార్మికులుగా చూపిస్తూ
    జీతం దొబ్బేస్తున్న ఎస్.ఎఫ్.ఏ. లు
  • లక్షల్లో చేతులు మారుతున్న అక్రమ సంపాదన..

నగరాన్ని ప్రతిరోజూ శుభ్రంచేస్తూ.. నగర వాతావరణాన్ని పరిరక్షిస్తూ.. రేయింబవళ్లు కష్టపడుతుంటారు జీ.హెచ్.ఎం.సి. లో విధులు నిర్వహిస్తుంటారు పారిశుద్ధ్య కార్మికులు.. నిజానికి వీరిది పర్మినెంట్ ఉద్యోగం కాదు.. కాంట్రాక్టు బేసిస్ మీద పనిచేస్తూ ఉంటారు.. వీరితో ఎలా అడ్డుకున్నా పర్మినెంట్ ఉద్యోగులు కాదు కాబట్టి ఏమీ చెయ్యలేరన్న ధీమా.. ఆ ఏరియా ఎస్.ఎఫ్.ఏ. లకు ఉంటుంది.. కనుక తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు.. వారికి వచ్చే కాస్తంత జీతాల్లోనూ నెల నెలా లంచాలు గుంజుతూ ఉంటారు.. కష్టపడి పనిచేసేది కార్మికులైతే.. జీతం కంటే ఎక్కువ సంపాదిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు ఎస్.ఎఫ్.ఏ. లు వారిని నియంత్రించే పై అధికారులు.. ఇది ఒక తంతు మాత్రమే.. నిజానికి ఒకరికి ఉపాధి కల్పించాల్సిన కార్మికుల స్థానంలో తమ వారి పేర్లు నమోదు చేస్తూ.. వారు విధులకు రాకుండానే వారిపేరుమీద జీతాలు తీసుకుంటున్న దౌర్భాగ్యం ఇప్పుడు నెలకొని వుంది.. తద్వారా నిజంగా అవసరమున్న వారికి పని లేకుండా పోతోంది.. ఈ విధంగా కొందరు ఉన్నతాధికారుల కనుసన్నలలోనే కొందరు ఎస్.ఎఫ్.ఏ. లు డమ్మీ కార్మికుల పేరుతో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ – 17 లో వెలుగు చూసింది.. వివరాలు ఒక సారి చూద్దాం..

జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ – 17లో ఏ.ఎం.ఓ.హెచ్. గా భార్గవ నారాయణ విధులు నిర్వహిస్తున్నారు.. కాగా ఈ సర్కిల్ లో సుమారు 41 మంది ఎస్.ఎఫ్.ఏ. లు పనిచేస్తున్నారు.. ఒక్కో ఎస్.ఎఫ్.ఏ. కింద దాదాపు మూడు గ్రూపులు ఉంటాయి.. ఇక ఒక్కో గ్రూపులో 7 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తూ ఉంటారు.. మొత్తానికి 846 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.. అయితే కొంతమంది ఎస్.ఎఫ్.ఏ. లు తమ కుటుంబ సభ్యుల పేర్లు పారిశుధ్య కార్మికుల లిస్ట్ లో చేర్చి, వారు విధులకు హాజరు కాకుండానే వారి పేరుమీద నెల నెలా జీతాలు డ్రా చేస్తున్నట్లు తెలియవచ్చింది..

- Advertisement -

ఆ ఎస్.ఎఫ్.ఏ. ల వివరాలు ఇలా ఉన్నాయి :
ఎం. కృష్ణ ( మిద్దె కృష్ణ ) ఎస్.ఎఫ్.ఏ. – రాజ్ భవన్ రోడ్.. కుటుంబ సభ్యులైన అతని కుమారుడు ఎం. వినయ్ కుమార్. భార్య అయిన ఎం. కల్పనల పేర్లు డమ్మీగా ఎంటర్ చేసి వారి పేరుమీద జీతాలు తీసుకుంటున్నాడు.. అలాగే జె. కిరణ్ కుమార్ ఎస్.ఎఫ్.ఏ. ఈయనది మధ్యాహ్నం ద్యూటీ.. ఇతను సంగీత అనే మహిళను డమ్మీగా చూపెడుతున్నాడు.. ఇక కొత్తపల్లి మురళి ఎస్.ఎఫ్.ఏ. స్విమ్మింగ్ ఫుల్, డీకే రోడ్ అమీర్పేట్.. ఈయన లావణ్య అనే మహిళను డమ్మీగా చూపెడుతున్నాడు.. గురుమూర్తి, ( కామాటి ).. లకడీకాపూల్, ఇక్కడ ఎస్.ఎఫ్.ఏ. శేఖర్ చేయాల్సిన విధులను సదరు గురుమూర్తి కామాటీగా ఉంటూ ఆయనే నిర్వహిస్తున్నాడు.. ఎన్. లక్ష్మి అనే మహిళను డమ్మీ కార్మికురాలిగా ఎంటర్ చేసి జీతం తీసుకుంటున్నాడు.. జీ. శంకర్ అనే మరో ఎస్.ఎఫ్.ఏ. సోమయాజి గూడాకు సంబంధించి సయ్యద్ రహీం అనే వ్యక్తిని డమ్మీగా చూపిస్తూ జీతం డ్రా చేస్తున్నాడు.. గుర్రం రమేష్, ఎస్.ఎఫ్.ఏ., సోమాజీ గూడ.. తన సోదరి పీ. మంజుల పేరును డమ్మీగా చూపెడుతూ జీతం డబ్బులు కాజేస్తున్నాడు..

ఈ వ్యవహారమంతా సర్కిల్ – 17, ఖైరతాబాద్ జోన్ లో ఏ.ఎం.ఓ.హెచ్. గా విధులు నిర్వహిస్తున్న భార్గవ నారాయణ కనుసన్నలలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది.. నిజానికి ఈయన పేరెంట్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్.. అక్కడినుండి డిప్యుటేషన్ మీద జీ.హెచ్.ఎం.సి. కి వచ్చాడు.. గత 6 సంవత్సరాల నుండి ఇక్కడే తిష్ట వేసి అవినీతి వ్యవహారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు.. డిప్యుటేషన్ మీద వచ్చినా తిరిగి పేరెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్ళడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆమ్దాని తన సొంత డిపార్ట్మెంట్ లో దొరకదన్నది అతని వాదన.. కాగా ఇతగాడు ఒక్కో ఎస్.ఎఫ్.ఏ. నుండి సుమారు నెలకు రూ. 6000 వసూలు చేస్తాడని తెలుస్తోంది.. కనుక ఇతని సమక్షంలోనే.. ఇతని కనుసన్నలలోనే ఎస్.ఎఫ్.ఏ.లు బరితెగించి డమ్మీ కార్మికుల పేరుతో జీతాలు తీసుకుంటూ కాలరెగరేసుకుని తిరుగుతున్నారన్నది పచ్చి నిజం.. ఉన్నతాధికారులు కలుగజేసుకుని ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని.. డమ్మీల స్థానంలో అర్హులైన వారిని నియమించి వారికి ఉపాధి కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.. తక్షణమే ఏ.ఎం.హెచ్.ఓ. భర్గవ నారాయణ మీద చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.. కాగా గతంలో లో కూడా సదరు భార్గవ నారాయణ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ – 17, ఖైరతాబాద్ డివిజన్ లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను వాస్తవాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు