- శోకసంద్రంలో విప్లవ లోకం..
- ప్రముఖుల ప్రగాఢ సంతాపం..
- అపోలోలో చికిత్స పొందుతూ తుది శ్వాస..
ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్(74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో దళిత కుటుంబంలోని లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినిమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయితే అవార్డును ఆయన తిరస్కరించారు. అయినప్పటికి ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు.
కాగా, గద్దర్ నిజామాబాదు జిల్లా మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో విద్యభ్యాసం పూర్తి చేశారు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో ఎంతో చైతన్యం కలిగించేవి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు క్యాసెట్‌లుగా, సిడీలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి. కెనరా బ్యాంక్‌లో క్లర్క్ ఉద్యోగం వదులుకొని నాటి నక్సల్స్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరురా తిరిగి ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు.
ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. గద్దర్‌కు భార్య విమల, కొడుకు, కూతురు ఉన్నారు.