హైదరాబాద్ నగర పరిధిలోని అబిడ్స్ ట్రూప్ బజార్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎల్‌ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా పొగరావడంతో భవనంలోకి వెళ్లలేకపోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే భవనంలో సెక్యూరిటీ పని చేస్తున్న వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. అధికారులు వారిని రక్షించారు. అలాగే ఇంట్లోని సిలిండర్‌ను సైతం బయటకు తీసుకువచ్చారు. ప్రమాదంలో దుకాణంలోని సామగ్రి మొత్తం దగ్ధమైంది. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.