Thursday, October 10, 2024
spot_img

బీసీలను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తప్పక చదవండి

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలు.. అధికారం నిలబెట్టుకోడానికి బీసీలను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను బీసీల కోసం తీసుకుని వచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని తీసుకుని రాబోతున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే హింట్ ఇచ్చేసింది. ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనుండడంతో ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అత్యధిక ఓటర్లున్న బీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సగానికి పైగా ఓటర్లు బీసీలే కావడంతో అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి.

బీఆర్ఎస్ బీసీల కోసం భారీగా నిధులు కేటాయిస్తూ ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో తీర్మానం చేసింది. బీసీ కులాలకు చెందిన 11 ఫెడరేషన్లతో పాటు ఎంబీసీలోని 30 కులాలకు చెందిన ఒక్కొక్కరికి సబ్సిడీపై లక్ష రూపాయల రుణం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. దీని కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి దాకా ప్రభుత్వం తరఫున ఎలాంటి లబ్ధి పొందని బీసీలకు ఈ రుణాలు పొందే అవకాశం ఉంది. పైగా లక్ష రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

ఇతర పార్టీల దారెటు:

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.99 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.61 కోట్ల ఓటర్లు బీసీలే ఉన్నారు. బీసీ జనాభా 54 శాతం ఉంది. ప్రతీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవాలన్న బీసీల ఓట్లే కీలకం కానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటున్న బీజేపీ కూడా పలు విషయాలపై దృష్టి పెట్టింది. బీజేపీ ఏకంగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని, బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని ప్రకటించింది. విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్ అందరికీ పరిమితి లేకుండా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని, ఎన్నికల్లో పోటీ పడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని డిక్లరేషన్ లో బీజేపీ పేర్కొనడం విశేషం. గత ఎన్నికల్లో బీసీ ఓటర్లే బీఆర్ఎస్ కు అండగా నిలిచారు. వారిని ఆకర్షించడానికి, తమ వైపు తిప్పుకోడానికి బీజేపీ చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

తెలంగాణను తెచ్చిందే తామని చెప్పుకునే కాంగ్రెస్ బీసీ ఓట్లను సంపాదించాలనే పనిలో పడింది. నల్లగొండలో బీసీల సదస్సు ఏర్పాటు చేస్తామని, పార్టీ సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే చెప్పారు. బీసీ డిక్లరేషన్తో రాష్ట్రంలోని బీసీలను తమవైపు తిప్పుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్టీలన్నీ సామాజిక వర్గాల వారీగా ఓట్లను సొంతం చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది:

వెనుక‌బ‌డిన వ‌ర్గాల మద్దతు తమదేనని వైసీపీ గర్వంగా చెబుతూ ఉంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ 151 స్థానాల‌ను సాధించ‌డానికి ఆ వర్గమే కారణం. ఇప్పటికే వైసీపీ చీఫ్, సీఎం జగన్ మోహన్ రెడ్డి `జ‌య‌హో బీసీ` ఆత్మీయ స‌మ్మేళ‌నం చేపట్టారు. ఏపీ ప్ర‌భుత్వం బీసీల‌కు ఇచ్చిన ప్రాధాన్యంపై ఫోక‌స్ పెట్టారు. 56 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే బీసీలు కీల‌క‌మ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బీసీల ఓటు బ్యాంకును కోల్పోడానికి సిద్ధంగా అయితే లేదు. గత ఎన్నికల్లో వారి ఓటు బ్యాంకు కోల్పోయిన టీడీపీ ఈ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని అనుకుంటూ ఉంది.

ఇవి మాత్రమే సరిపోవు:

బీసీలకు కేవలం హామీలు ఇచ్చి మోసం చేయాలని అనుకుంటే సరిపోదు. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేయాలి. బీసీలకు సీట్లు ఇస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ సాధించగలదు. ఆ విధంగా ముందుకు వస్తేనే ఏ పార్టీకి అయినా బీసీలు భవిష్యత్తును ఇవ్వగలరు. కేవలం ఎన్నికల ముందు గొప్ప గొప్ప హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత మరచిపోవడం ప్రతి ఒక్క పార్టీ చేసేదే..! స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను అదే విధంగా మోసం చేస్తూనే ఉన్నారు. బీసీలు మోసపోతూ ఉన్నారు. పల్లకీ మోయడానికే వారు పరిమితమయ్యారని అర్థం అవుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో అయినా బీసీలకు అందుకు తగ్గట్టుగా సీట్లు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఆయా స్థానాలలో ప్రజాప్రతినిధులుగా బీసీలే ఉంటారని ఆశిస్తూ ఉన్నాం.

  • దుండ్ర కుమారస్వామి (B-pharm,M.S,(Clinicals),LLB
    జాతీయ అధ్యక్షుడు బీసీ దళ్
    మొబైల్ నె:9959912341
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు