Sunday, May 5, 2024

ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలిచిన దొడ్డి కొమురయ్య..

తప్పక చదవండి
  • పాలడగు నాగార్జున(కెవిపిఎస్).. పందుల సైదులు(టివివి)

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ పీనులపై భూస్వామ్య పెత్తందారి విధానంపై దిక్కార స్వరమై నినదించిన తెలంగాణ ఉద్యమ దారి దీపం దొడ్డి కొమరయ్య అని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున,తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు.

మంగళవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక, కెవిపిఎస్, బి.సి విద్యార్థి సంఘం, ప్రజా సంఘాల అధ్వర్యంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలడగు నాగార్జున, పందుల సైదులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో దొరలు దొరల తాబేదారులు వసూలు చేస్తున్న అక్రమ లేవికి వ్యతిరేకంగా నినదించడంతో కడివెండిలో తుపాకీ తూటాలకు బలై తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఉద్యమ దివిటి దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణలో చైతన్యపు జ్వాలలను రగిలించిందన్నారు. వారి త్యాగంతో నిజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక సాయిధ దళాలు పురుడు పోసుకున్నాయన్నారు. కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ప్రజానీకం 4000 మంది సంఘం కార్యకర్తలను కోల్పోయి నిజాం నిరంకుశ పాలనకు అంతం పలికింది అన్నారు. 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంచారన్నారు. 3,500 గ్రామాలు నిజాం నుండి విముక్తి పొందాయన్నారు. కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణలో నక్సల్బరీ ఉద్యమం, ముల్కి ఉద్యమం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలు పురుడుబోసుకున్నాయి అన్నారు. అదే విధంగా అనేక భూసంస్కరణ చట్టాలు, భూ పరిమితి చట్టాలు రూపొందించబడ్డాయి అన్నారు. దొడ్డి కొమురయ్య లాంటి మహనీయుల త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజంతో పాటు పాలకులపై బాధ్యతగా ఉందన్నారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం కూడా ఆధిపత్యానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటమే అన్నారు. దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో మానవ హక్కులను కాపాడుకుంటూ ఆధిపత్యానికి అంతం పలకాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

ఈ వర్ధంతి కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళి, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగు నరేష్ గౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు