- ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో స్థానం కోల్పోయిన భారతీయ నగరాలు..
- ఆరు రకాల విభాగాల ఆధారంగా 53 నగరాల్లో సర్వే..
- నిజంగా ఇది ఎంతో బ్యాడ్ న్యూస్ అంటున్న నగర వాసులు..
ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఓ బ్యాడ్ న్యూస్ వెల్లడైంది. ఎందుకంటే ఈ నగరాల్లో కొత్తగా నివసించే వారి విషయంలో ఈ రెండు నగరాలు అన్‌ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో చేరాయి. కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: వరల్డ్స్ ఫ్రెండ్లీయెస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ అనే సంస్థ.. అంతర్జాతీయంగా ఉన్న 53 నగరాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వేరే నగరాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారి పట్ల ఆయా నగరాల్లోని ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్న దానిపై ఈ సర్వే నివేదికను తయారు చేసింది.
ఏ ప్రాతిపదికన సర్వే జరిగింది..?
ఈ నివేదికను ఆరు కీలక అంశాల ఆధారంగా రూపొందించారు. అందులో భాగంగా అన్ని నగరాలకు కొన్ని పాయింట్లను కేటాయించారు. ముఖ్యంగా పర్యాటకులు మళ్లీ మళ్లీ రావాలనుకోవడం, భద్రతా ప్రమాణాలు, ఎల్.జీ.బీ.టి.క్యూ. ప్లస్ కమ్యూనిటీల సమానత్వం, ఓవరాల్ హ్యాపీనెస్, సాధారణ భాషలో సులభంగా సంభాషించుకోవడం, స్నేహపూర్వకంగా ఉండే సిబ్బంది అనే ఆరు అంశాల ఆధారంగా మొత్తం 53 నగరాలకు రేటింగ్ పాయింట్లను అందించారు. ఇందులో భాగంగా ముంబై, ఢిల్లీ నగరాలు అన్ ఫ్రెండ్లీ సిటీల జాబితాలో చేరాయి. ఈ అన్‌ఫ్రెండ్లీయెస్ట్ సిటీ జాబితాలో ఆఫ్రికా దేశంలోని ఘనా రాజధాని అక్రా.. తొలిస్థానంలో నిలిచింది. అక్రా నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకుల పట్ల వారు స్నేహపూర్వకంగా వ్యవహరించలేరని వెల్లడైంది. మొత్తం 10 పాయింట్లకు సర్వే నిర్వహించగా.. అక్రా నగరానికి కేవలం 3.12 పాయింట్లు మాత్రమే లభించాయి. మొరాకో దేశంలోని మర్రకేజ్ నగరం.. 3.62 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ అన్‌ఫ్రెండ్లీయెస్ట్ సిటీ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో ముంబయి, కౌలాలంపూర్, రియో డి జెనీరో, ఢిల్లీలు ఉన్నాయి.
ఒక్క నగరం కూడా లేకపోవడం విచారకరం :
ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో ఒక్క భారతీయ నగరం కూడా చోటు సంపాదించుకోలేదు. ప్రపంచంలోనే పర్యాటకులు, సందర్శకుల పట్ల స్నేహపూర్వకంగా ఉండే నగరాల జాబితాలో రెండు నగరాలు నిలిచాయి. ఈ ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో కెనడాలోని టొరంటో నగరం, ఆస్ట్రేలియాలోని సిడ్నీనగరం అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నగరాల్లోని ప్రజలు పర్యాటకులతో చాలా స్నేహపూర్వకంగా మెదిలినట్లు సర్వేలో వెల్లడైంది. ఈ రెండు నగరాలు 10 పాయింట్లకు గానూ 7.97 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక రెండు, మూడో స్థానాల్లో ఎడిన్ బర్గ్, మాంచెస్టర్ నగరాలు నిలిచాయి. ఎడిన్ బర్గ్ నగరం.. సేఫ్టీ ఇండెక్స్ విభాగంలో 100 కి 68.92 పాయింట్లు దక్కించుకుంది. ఇక ఓవరాల్ ఫ్రెండ్లీనెస్ నగరాల్లో 10కి 7.78 స్కోర్‌ను సాధించింది. ఇక మాంచెస్టర్ నగరం.. 10 కి 7.72 స్కోర్ చేసింది. కొత్తగా స్నేహితులను ఎలా చేసుకోవాలని సెర్చ్ చేసిన నగరాల జాబితాలో బ్రెజిల్ లోని సావోపాలో తొలి స్థానంలో ఉండగా.. న్యూయార్క్, పారిస్ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇక మన దేశంలోని నగరాలు స్నేహపూర్వక జాబితాలో వెనకబడి ఉన్నాయి. కేవలం 12 శాతం మాత్రమే ముంబై నగరం స్నేహపూర్వకంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఢిల్లీ 17 శాతం ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. ఫ్రెండ్లీ సిబ్బంది విభాగంలో ముంబై 3.91శాతం రేటింగ్‌ను సాధించగా.. ఢిల్లీ 3.27 శాతం రేటింగ్ మాత్రమే దక్కించుకుంది. హ్యాపీనెస్ స్కోర్‌లో ముంబై 3.78 , ఢిల్లీ 4.01 స్కోర్ సాధించాయి.