Friday, May 17, 2024

కార్పొరేట్‌ కార్యాలయాలకు ధీటుగా తెలంగాణా పోలీస్‌ భవనాల నిర్మాణం

తప్పక చదవండి
  • రాష్ట్ర పోలీస్‌ హోసింగ్‌ కార్పొరేషన్‌
    చైర్మన్‌ కోలేటి దామోదర్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో తెలంగాణా పోలీస్‌ హోసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలో రూ.704.50 కోట్ల వ్యయంతో జిల్లా పోలీస్‌ కార్యాలయాలు, పోలీస్‌ కమీషనరేట్లు,పోలీస్‌ స్టేషన్ల భవనాలు, ఇతర నిర్మాణాలను చేపట్టినట్లు రాష్ట్ర పోలీస్‌ హోసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ వెల్లడిరచారు. కార్పొరేషన్‌ ఎం.డి రాజీవ్‌ రతన్‌ తో కలసి తనను కలసిన విలేకరులతో దామోదర్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారి సంకల్పం, ఆలోచనలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో భవనాలను కార్పొరేట్‌ కార్యాలయాలకు తీసిపోని విధంగా నిర్మిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో 23 జిల్లా పోలీస్‌ కార్యాలయాల భవనాలు, సిద్ధిపేట, కామారెడ్డి, రామగుండము, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ల కార్యాలయాల భవనాలను చేపట్టినట్టు తెలియచేసారు. రాష్ట్రంలోని 90 పోలీస్‌ స్టేషన్లలో ఫ్రంట్‌ ఆఫీస్‌ నిర్మాణం పనులు చేపట్టగా, ఇందులో 78 పనులు పూర్తికాగా, మిగిలిన పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయని అన్నారు. జిల్లా పోలీస్‌ అధికారుల (డి.పి.ఓ.) భవనాలను ఒక్కొక్కటి రూ.38.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నామని అన్నారు.ప్రతి మండలానికి ఒక పోలీస్‌ స్టేషన్‌ వుండాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్పొరేషన్‌ 137 పోలీస్‌ స్టేషన్లకు భవనాల నిర్మాణం చేపట్టిందని, వాటిలో 109 భవనాలు పూర్తికాగా, 28 భవనాల నిర్మాణం పూర్తికావస్తున్నదని వెల్లడిరచారు. పట్టణ ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ భవనాల నిర్మాణానికి ఒక్కొక్కదానికి రూ.4.25 కోట్లు, గ్రామీణ ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ భవనాల నిర్మాణానికి ఒక్కొక్కదానికి రూ.2.70 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడిరచారు. తెలంగాణా లో నిర్మిస్తున్న పోలీస్‌ శాఖ భవనాల మాదిరిగా దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేవని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో వుంచుకుని ఈ భవనాలను సువిశాలంగా నిర్మించడం జరిగింది. భవనాలలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు, సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్‌ హాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భవనాలు భూకంపాలను తట్టుకునే విధంగా రూపొందించడం జరిగింది. ఒక్కొక్క డి.పి.ఓ. భవన వైశాల్యం 51,411 చదరపు అడుగులు వుండే విధంగా నిర్మించడం జరిగిందన్నారు. పోలీస్‌ భవనాలన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘‘స్మార్ట్‌ బిల్డింగ్స్‌’’ గా రూపొందించడం జరిగిందన్నారు. హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంటనగరాలలో నిజాం కాలం నాటి పాత పోలీస్‌ స్టేషన్‌/ఏ.సి.పి./డి.సి.పి. భవనాల స్థానంలో 67 కొత్త భవనాల నిర్మాణాలను రూ.175.68 కోట్ల ఖర్చుతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో గల 87 పోలీస్‌ స్టేషన్ల భవనాలకు ప్రారంభోత్సవం చేశామని తెలిపారు. అటవీ ప్రాంతాలైన ఉత్తర తెలంగాణాలోని ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు, భద్రాచలం అటవీ ప్రాంతాలు, దక్షిణ తెలంగాణాలో నల్లమల అడవులు బాగా సెన్సిటివ్‌ ఏరియాలని, ఇవి రాష్ట్రం మొత్తం మీద నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా వున్న ప్రాంతాలు. ఈ విషయాలను దృష్టిలో వుంచుకుని, ఇక్కడి పోలీస్‌ స్టేషన్లను ప్రత్యేక డిసైన్లతో నిర్మించామని చెప్పారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కేవలం ఒక్క పోలీస్‌ శాఖ భవనాలను మాత్రమే కాక, ఇతర ప్రభుత్వ శాఖలైన అబ్కారీ శాఖ, పి.వి. నరసింహారావు పశు విశ్వవిద్యాలయం, అటవీ శాఖ, మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థ లలో నిర్మాణ పనులను చేపట్టి, పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ కు జే.పి. దర్గాకు సంబంధించిన రూ.50.00 కోట్ల విలువైన పనులు, క్రిస్టియన్‌ భవనం నిర్మాణానికి సంబంధించి రూ.10.00 కోట్ల విలువైన పనులను కూడా చేపడుతున్నామన్నారు. నాణ్యతలో ఏవిధమైన రాజీ లేదని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు