Monday, April 29, 2024

చంద్రుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ..

తప్పక చదవండి
  • చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు..
  • జులై 14న నింగిలోకి చంద్రయాన్ – 3..
  • మధ్యాహ్నం 2.35 గంటలకు పంపనున్న ఇస్రో..
  • రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లలో శ్రీహరికోట..
  • చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇస్రో
  • ఇంతకు ముందు చివరి మెట్టుపై బోల్తాపడిన చంద్రయాన్-2

ఇప్పటికే రెండు దఫాలు చంద్రయాన్ చేపట్టి మిశ్రమ ఫలితాలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మూడోసారి చంద్రయాన్ చేపడుతోంది. చంద్రయాన్-3 ప్రయోగానికి మూహూర్తం ఖరారు చేసింది. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3లో భాగంగా జీఎస్ఎల్వీ-ఎంకే3 లేక ఎల్వీమ్3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండగా… చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ ను పొందుపరిచారు. చంద్రయాన్-2లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో విఫలమైన నేపథ్యంలో, అనేక మార్పులు చేర్పులతో చంద్రయాన్-3 ల్యాండర్ ను అభివృద్ధి చేశారు. విక్రమ్ ల్యాండర్ కు బలమైన కాళ్లు అమర్చారు. అత్యధిక వేగంగా దిగినప్పటికీ దెబ్బతినని రీతిలో ల్యాండర్ కు రూపకల్పన చేశారు. ఇంజిన్, సెన్సర్, థ్రస్ట్ వైఫల్యాలను గుర్తించి చక్కదిద్దేందుకు అధునాతన సాఫ్ట్ వేర్ ఉపయోగించనున్నారు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో, చంద్రయాన్-3లో సెంటర్ ఇంజిన్ లేదా ఐదో ఇంజిన్ ను తొలగించనున్నారు. ఇక, విక్రమ్ లాండర్ చంద్రుడిపై సూర్యరశ్మి సోకని ప్రాంతంలో ల్యాండైనప్పటికీ ఇంధన శక్తిని పొందేందుకు వీలుగా మరిన్ని సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.

ఇక, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ ఎంత కీలకమో, అది దిగే ప్రదేశం కూడా అంతే ముఖ్యం. పెద్దపెద్ద క్రేటర్లు (లోయలు), కఠినంగా ఉండే ఉపరితలం అతిపెద్ద సవాలుగా మారుతాయి. చంద్రయాన్‌-3లో రెండు ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌, అవాయిడెన్స్‌ కెమెరాలను అమర్చారు. అవి పంపే ఫొటోలను బట్టి దానిని ఎక్కడ ల్యాండ్‌ చేయాలనేది శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. భూకేంద్రం నుంచి ల్యాండింగ్ సంకేతాలు పంపినా.. అవి చేరడం ఆలస్యమైతే మాత్రం.. ల్యాండర్ తనంతట తానుగానే నిర్ణయం తీసుకుంటుంది. చంద్రుడిపై అధ్యయనానికి ఇస్రో చేపట్టిన మూడో మిషన్ ఇది. చంద్రయాన్-2 ప్రయోగం చివరి మొట్టుపై విఫలం కావడంతో ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, గ్రహాంతర మిషన్‌లకు అవసరమైన కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం, ప్రదర్శించడం అనే లక్ష్యంతో రోవర్ రూపొందించారు. ఇస్రో ప్రకారం.. చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ ప్రదేశంలో అనువైన ప్రాంతాన్ని గుర్తించే సామర్థ్యాన్ని ల్యాండర్ కలిగి ఉంటుంది. కచ్చితమైన ప్రాంతంలో రోవర్‌ను మోహరించి, కదలిక సమయంలో చంద్రుని ఉపరితలంపై రసాయన విశ్లేషణను నిర్వహిస్తుంది. ల్యాండర్, రోవర్ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేసేందుకు సైంటిఫిక్ పేలోడ్‌లను కలిగి ఉన్నాయి. ప్రయోగ వాహనం నుంచి చంద్రుడి చివరి 100 కి.మీ వృత్తాకార ధ్రువ కక్ష్య వరకు ల్యాండర్ మాడ్యూల్‌ను తీసుకువెళ్లడం.. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి దానిని వేరు చేయడం ప్రధాన విధి. ఇది కాకుండా ఒక సైంటిఫిక్ పేలోడ్‌ను కూడా కలిగి ఉందని, ఇది ల్యాండర్ మాడ్యూల్ నుంచి వేరుపడిన తర్వాత నిర్వహిస్తుందని ఇస్రో పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు