బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై బీజేపీ నేతలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. ఆ అంశంపై ప్రశ్నలు వేస్తే సైలెంట్‌గా మారిపోతున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే మాత్రం స్పందించారు. ఎవరైనా మహిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆ తర్వాత ఫిర్యాదు సరైందా కాదా అన్న కోణంలో విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. బీడ్ జిల్లాలో రిపోర్టర్లతో మాట్లాడిన ఆమె.. రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ ప్రీతమ్ ముండే అభిప్రాయపడ్డారు.
ఒక పార్లమెంట్ సభ్యురాలిగా కాకుండా, ఓ మహిళగా ఈ అభ్యర్థన చేస్తున్నానని, ఎవరైనా మహిళా అలాంటి ఫిర్యాదు చేస్తే, అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఆ తర్వాత ఆ ఫిర్యాదుపై సత్యాన్వేషణ చేపట్టాలని ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు. ద్రువీకరణ తర్వాత ఆ ఫిర్యాదు సరైందా కాదా అని నిర్ధారించుకోవాలన్నారు. ఒకవేళ ఫిర్యాదును పట్టించుకోకుంటే, దాన్ని ప్రజాస్వామ్యంలో స్వాగతించలేమని ఆమె అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో తాను భాగస్వామ్యురాలునే అయినప్పటికీ.. రెజ్లర్లతో ప్రభుత్వం సరైన రీతిలో సంప్రదింపులు జరపలేదని అంగీకరించాల్సి వస్తుందని ముండే తెలిపారు. భారీ ఎత్తున నిరసన జరుగుతున్నప్పుడు, దానిపై ఏ ప్రభుత్వమైనా దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు.