Thursday, September 12, 2024
spot_img

అక్ష కథ సుఖాంతం..

తప్పక చదవండి
  • తల్లి దండ్రులను చేరిన చిన్నారి..
  • సి.డబ్ల్యు.సి. అధికారుల చొరవతో ఏడేండ్ల తరువాత..

అమరావతి, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కటి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన పీతల రవికుమార్‌, పీతల ద్వారక అలియాస్‌ డోక్రా దంపతులు. వీరికి పాప అక్ష ఉన్నది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్ష రెండేండ్ల వయసున్నప్పుడు (ఏడేండ్ల కిందట) విడిపోయారు. ఈ క్రమంలో రవికుమార్‌ పాపను తన వెంట తీసుకెళ్లిపోయాడు. అప్పుడు ద్వారక తన భర్త పాప ను తీసుకొని ఎటో వెళ్లిపోయాడని సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అక్ష కేసు మిస్టరీగానే ఉండిపోయింది.

ఇటీవల కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్కెపల్లికి చెందిన భాగ్యలక్ష్మి వద్ద అక్ష(9) ప్రత్యక్షమవడంతో.. ఇరుగు పొరుగువారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వాట్సాప్‌ గ్రూపుల్లో పాప ఫొటోలను పోస్టు చేశారు. వాటిని చూసిన సొంత తల్లి పీతల ద్వారక సీడబ్ల్యూసీ అధికారులను ఆశ్రయించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవిచంద్రన్‌ కూడా తమ పాప అంటూ సీడబ్ల్యూసీకి వచ్చాడు. తగిన ఆధారాలు చూపాలంటూ అధికారులు కోరగా.. తన వద్ద ఏ ఆధారమూ లేదని వెళ్లిపోయాడు.

- Advertisement -

పోలీసులు భాగ్యలక్ష్మిని విచారించగా.. తాను ఉద్యోగం కోసం పుణెకు వెళ్లిన సందర్భంలో పాప తండ్రి పీతల రవికుమార్‌ అక్షను తనకు అప్పగించాడని వెల్లడించింది. పోలీసులు ఆమె దగ్గర రవికుమార్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకొని ఆరా తీయగా వాస్తవాన్ని అంగీకరించినట్టు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. అక్ష ఆధార్‌కార్డు, పుట్టినరోజు ధ్రువీకరణపత్రం, పుట్టిన స్థలం తదితర వివరాలు పరిశీలించి ధ్రువీకరించి.. తూర్పుగోదావరి జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారుల ద్వారా అక్షను తల్లిదండ్రులకు అప్పగించినట్టు సీడబ్ల్యూ సీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి చెప్పారు. ఏడేండ్లు దూరంగా ఉన్న తాము పాప అక్ష మూలం గా తిరిగి ఒక్కటయ్యామని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అక్ష తో కలిసి తల్లిదండ్రులు కరీంనగర్‌ కలెక్టర్‌ను కలిశా రు. కలెక్టర్‌ పాపను ఆశీర్వదించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు