Monday, April 29, 2024

సాగునీరు కల సాకారం అయ్యింది : స్పీకర్‌ పోచారం..

తప్పక చదవండి

దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది వేడుకల ప్రారంభం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సభలో స్పీకర్‌ మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికతో కేవలం మూడు సంవత్సరాలలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 22 ద్వారా కామారెడ్డి జిల్లాలో లక్షా ఎనబైవేల ఎకరాలకు సాగునీరు అందుతుందని,మంజీర నదిపై రూ.460 కోట్లతో నిర్మిస్తున్ననాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా జుక్కల్ నియోజకవర్గంలో 40వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు.

బాన్సువాడ నియోజకవర్గంలో 14వేల ఎకరాలకు సాగునీరు అందించే సిద్దాపూర్ రిజర్వాయర్ ను రూ. 200 కోట్లతో నిర్మిస్తున్నామని వివరించారు.రూ. 150 కోట్లతో జాకోర-చందూరు ఎత్తిపోతల పథకం ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.చెక్‌డ్యాం ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. అకాల వర్షాలు,వడగండ్ల నుంచి పంటలను రక్షించుకోవడానికి ముందస్తు ప్రణాళికలను అమలుచేయాలని రైతులకు సూచించారు. వానాకాలం సాగు జూన్ నుంచి ఆగస్టు, యాసంగి సాగు నవంబర్ నుంచి మార్చి లో ఉండే విధంగా రైతులు తమ పంట కాలాలను మార్చుకోవాలని స్పీకర్‌ రైతులను కోరారు.కామారెడ్డి జిల్లాలో గత తొమ్మిదేండ్లలో సంక్షేమ రంగం కోసం రూ.ముప్పై వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

- Advertisement -

నూరు శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని కొనియాడారు.75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ,దళిత కుటుంబాలు బాగుపడటానికే దళితబంధు పథకాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు జాజుల సురేందర్, హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభా రాజు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ బి శ్రీనివాస రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు