- ప్రముఖంగా 5 డిమాండ్లు చేసిన రెజ్లర్లు
- బ్రిజ్ భూషణ్ అరెస్ట్ , డబ్యూఎఫ్ఐకి మహిళా అధ్యక్షురాలు సహా పలు డిమాండ్లు
న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గత కొన్ని నెలలుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో స్టార్ రెజ్లర్లు సమావేశం కాగా.. అది ఎటూ తేలకుండానే ముుగిసింది. మరోసారి చర్చలకు రావాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం అర్థరాత్రి ట్వీట్ చేయగా.. బుధవారం ఉదయం పలువురు రెజ్లర్లు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రెజ్లర్లు ప్రధానంగా 5 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయడంతో పాటు రెజ్లింగ్ సమాఖ్యకు మహిళా అధ్యక్షురాలిని నియమించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఐదు డిమాండ్లు
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ఆయన నివాసంలో రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్ కలిశారు. తన సొంత గ్రామంలో ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా మరో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ భేటీకి హాజరు కాలేదు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు రెజ్లర్లు ప్రధానంగా 5 డిమాండ్లు ఉంచారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలని.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని.. ప్రధానంగా రెజ్లర్లు డిమాండ్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్‌లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కానీ.. ఆయనకు సంబంధించిన వారు గానీ సభ్యులుగా ఉండకూడదని పేర్కొన్నారు. డబ్లూఎఫ్ఐపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పాలక మండలికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో భాగంగా ఏప్రిల్ 28 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్రిక్తతల కారణంగా తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కోరారు.
కేంద్రమంత్రి పిలుపు
రెజ్లర్ల చేస్తున్న ఆందోళనలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం అర్ధరాత్రి ఓ ట్వీట్ చేశారు. రెజ్లర్ల సమస్యల గురించి వారితో మాట్లాడి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దీని గురించి మాట్లాడేందుకు రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించినట్లు ట్వీట్‌లో తెలిపారు. దీంతో చర్చల కోసం అనురాగ్ ఠాకూర్ ఆహ్వానాన్ని అంగీకరించిన రెజ్లర్లు.. ఆయన ఇంటికి వెళ్లారు. ఇది ఇలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వంతో రెజ్లర్లు చర్చలు జరపడం వారం రోజుల్లో ఇది రెండోసారి. గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పలువురు రెజ్లర్లు భేటీ అయ్యారు. అయినా ఆ సమావేశం ఎటూ తేలకుండానే ముగిసిందని బజ్‌రంగ్ పునియా తెలిపారు.