(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు..)
ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా సొంతం. కానీ, అటువంటి పరికరాల్లో చైనా టైంబాంబు పెట్టినంత పనిచేసింది. ఓ అజ్ఞాత మాల్‌వేర్‌ను అమెరికా పరికరాల్లోకి చొప్పించినట్లు సీనియర్ సైనికాధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ కాంగ్రెస్ అధికారి కూడా న్యూయార్క్‌టైమ్స్ వద్ద ధ్రువీకరించారు.
చిన్న కోడ్ తో..
చైనా హ్యాకర్లు ఒక చిన్న కంప్యూటర్ కోడ్‌ను అమెరికా రక్షణశాఖ పరికరాల్లోకి చొప్పించినట్లు అనుమానిస్తున్నారు. ఇది సైన్యానికి చెందిన నెట్‌వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సైనిక స్థావరాలకు నీటి సరఫరా వ్యవస్థల్లో ఇది ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో హ్యాకర్లు సంక్షోభ సమయంలో అమెరికా సైన్యానికి సరఫరాల్లో అంతరాయం కల్పించే ప్రమాదముంది. ఇప్పటికే తైవాన్ విషయంలో అమెరికా-చైనా మధ్య వివాదం తారాస్థాయికి చేరిన సమయంలో ఈ విషయం బయటకు వచ్చింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్ బేస్ ఉన్న గువాంలో తొలిసారి మైక్రోసాఫ్ట్ అనుమానాస్పద కోడింగ్‌ను గుర్తించింది. ఆ తర్వాత అమెరికాలోని మరో కీలక ప్రదేశంలోని కంప్యూటర్లలో కూడా ఇది ఉన్నట్లు గ్రహించింది. వోల్ట్ టైఫూన్ అనే చైనా హ్యాకింగ్ గ్రూప్‌పై అనుమానాలు ఉన్నాయి.
ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణను వ్యతిరేకించలేదు : పుతిన్
దీనిపై అమెరికా కాంగ్రెస్‌లోని ఓ అధికారి అమెరికా పత్రికతో మాట్లాడుతూ సైనిక పరికరాల్లో చైనా మాల్‌వేర్ టైంబాంబులాంటిదన్నారు. అది కీలక సమయాల్లో మిలటరీ బేస్‌లకు విద్యుత్తు, నీరు, కమ్యూనికేషన్లను కట్ చేయగలదు. ఫలితంగా సైనిక పని వేగం గణనీయంగా మందగిస్తుందని వివరించారు. కేవలం అమెరికాలోనే కాక.. విదేశాల్లోని ఉన్న అగ్రరాజ్య సైనిక బేస్‌ల్లో కూడా ఈ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా చైనా హ్యాకర్లు అమెరికాపై చేస్తున్న దాడుల విధానం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
హ్యాక్ అయింది
గత వారం చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈమెయిల్ హ్యాక్ అయింది. ఈ నెల మొదట్లో చైనా హ్యాకర్లు దాదాపు పాతిక సంస్థల మెయిల్స్‌ను హ్యాక్ చేసినట్లు మైక్రోసాఫ్ట్, శ్వేతసౌధం వెల్లడించింది. కొన్ని నెలల క్రితం ఈ మాల్వేర్‌పైనే అమెరికా సైనికాధికారులు సిచ్యూవేషన్ రూమ్‌లో సమావేశమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఆడమ్ హోడ్జ్ మాట్లాడుతూ ‘‘అమెరికా కీలక మౌలిక వసతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా బైడెన్ కార్యవర్గం పనిచేస్తోంది. నీటి పైపులైన్లు, రైలు, వైమానిక రంగానికి చెందిన కీలక వ్యవస్థలను కాపాడేందుకు అవసరమైన విధంగా సమన్వయం చేసుకొంటోంది’’ అని తెలిపారు.