- అవునంటున్న శాస్త్రవేత్తలు..
అమెరికాలోని మూడో అతిపెద్ద నగరం షికాగో భూమిలోకి కుంగిపోతున్నదా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ‘సబ్‌సర్ఫేస్ హీట్ ఐలాండ్స్’గా పిలిచే భూగర్భ పర్యావరణ మార్పులే అందుకు కారణమని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూమిలో మార్పులు కారణమవుతున్నాయని, భవనాలు, మౌలిక సదుపాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతూ దీర్ఘకాల మన్నికకు ముప్పుగా పరిణమిస్తున్నట్టు పేర్కొన్నారు. నగరాలు జమసమ్మర్థంతో కిక్కిరిసిపోవడం వల్ల భూగర్భ పర్యావరణం మార్పులకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇల్లినాయిస్‌లోని ఎవాన్‌స్టోన్ నగరంలో ఉన్న నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ సివిల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అలెస్సాండ్రో రొట్టా లోరియా తెలిపారు.
వాతావరణ హెచ్చుతగ్గుదల వల్ల మట్టి, రాళ్లు, ఇతర నిర్మాణ పదార్థాలు ప్రభావానికి గురవుతున్నట్టు ఆయన తెలిపారు. వారి అధ్యయనంలో భూమిపై కంటే భూగర్భంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. జనాభా పరంగా అతిపెద్ద నగరమైన న్యూయార్క్ నగరం కూడా భూమిలోకి కుంగుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. 1.68 ట్రిలియన్ టన్నులు నగరంలో భూమిలోకి కుంగి ఉండొచ్చని పేర్కొన్నారు.