Tuesday, May 28, 2024

బరితెగించిన ‘అక్రమం’..

తప్పక చదవండి
  • అంతస్తుల కొద్దీ బహుళఅంతస్తుల నిర్మాణాలు..
  • జీరో సెట్ బ్యాక్ లు.. సెల్లార్లతో నిర్మాణాలు..
  • కమర్షియల్ నిర్మాణాలకు అధికారులు, ప్రజా ప్రతినిధుల అండ..
  • ప్రేక్షక పాత్రకే పరిమితమైన న్యాక్ ఇంజినీర్లు..
  • సెటిల్మెంట్ తో సరే అంటున్న విజిలెన్స్ అధికారులు..
  • గడపదాటని జోనల్ కమీషనర్ పంకజ..
  • అక్రమ నిర్మాణాలను అరికట్టేదెవరు..?

కాప్రా సర్కిల్ లో అక్రమ నిర్మాణదారులు పేట్రేగిపోతున్నారు.. జీరో సెట్ బ్యాక్ లు, సెల్లార్లు, ఆపై పెంట్ హౌస్ లతో బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. విచ్చల విడిగా కమర్షియల్ నిర్మాణాలు జారుతున్నా స్పందించని అధికారులు, వారికి అండగా నిలుస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులతో కాప్రా సర్కిల్ భ్రష్టుపట్టి పోయిందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.. ప్రేక్షకపాత్రకే పరిమితమైన న్యాక్ ఇంజినీర్ల అయితే, సెటిల్మెంట్ కే మొగ్గు చూపుతున్నవిజిలెన్స్ అధికారుల తీరుతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. గడప దాటని జోనల్ కమిషనర్ పంకజ వైఖరితో అక్రమ నిర్మాణాలను అరికట్టేదెవరంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు..

హైదరాబాద్ : కాప్రా సర్కిల్ పరిధి ఆరు వార్డులలో వందలాది అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.. ఈ నిర్మాణాలకు అనుమతులతోపాటు సెట్ బ్యాక్ లు అసలే ఉండవు.. సెల్లార్లతో ఐదు నుండి ఆరు అంతస్తులు ఆపై పెంట్ హౌస్ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.. వీటికి అగ్నిమాపక అనుమతులుండవు.. అగ్ని ప్రమాదాలు జరిగితే అంతే సంగతులు.. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరిగినా వారికి సంబంధం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక్కడ జరిగే అక్రమ నిర్మాణాలు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న కాన్సెప్ట్’ తో అధికారులు, ప్రజా ప్రతినిధులు అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.. ఆరు వందల గజాలు ఉంటేనే సెల్లార్లకు అనుమతులు జారీ చేస్తారు.. కానీ రెండు వందల గజాల నుండి అయిదు వందల గజాలలో సాగుతున్న నిర్మాణాలకు సెల్లార్ అనుమతులు జారీ నిషేధం.. దీంతో అక్రమ నిర్మాణదారులు స్థానిక జీ.హెచ్.ఎం.సి., టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధుల అండదండలతోనే సెల్లార్లు తవ్వటం సాధ్యమవుతుందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు అడిగినంత సొమ్ము ముట్టజెప్పి అడ్డగోలుగా సెల్లార్లు తవ్వటంతోపాటు ఐదు నుండి ఆరు అంతస్తులు ఆపై పెంట్ హౌస్ నిర్మాణాలు సాగిస్తున్నారు.. అక్రమ నిర్మాణాలపై వివిధ దిన పత్రికల్లో కథనాలు వస్తే విజిలెన్స్ అధికారులు నేరుగా అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. నాచారం, మల్లాపూర్, హెచ్.బీ. కాలనీ, కాప్రా, ఏ.ఎస్. రావు నగర్, చర్లపల్లి డివిజన్ లలో వందలాది అక్రమ నిర్మాణాలు సాగుతున్నా ముడుపులు ముట్టజెప్పని నిర్మాణదారులనే టార్గెట్ చేసి కూల్చివేతలు జరుపుతున్నారన్న అపవాదు వినిపిస్తోంది..

- Advertisement -

భావనారుషి హోసింగ్ సొసైటీలో అంతులేని అక్రమ నిర్మాణాలకు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే ఓ నాయకుడి సతీమణి కనుసన్నలలోనే సాగుతున్నాయని బహిరంగ చర్చ జరుగుతోంది.. దీంతో కోట్ల రూపాయలు వెనుకేసున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. న్యాక్ బృందాలకు ప్రాతినిధ్యం వహించే జోనల్ కమిషనర్ పంకజ కార్యాలయం గడప దాటక పోవటంతో అక్రమ నిర్మాణదారులు చెలరేగిపోతున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.. అక్రమ నిర్మాణాలపై దినపత్రికల్లో కథనాలు వస్తే స్పందించాల్సిన అవసరం లేదంటూ జోనల్ కమిషనర్ అల్టిమేతం జారీ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.. అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్న అధికారులు, వారికి వత్తాసు పలుకుతున్న జోనల్ కమిషనర్ పై బహిరంగ విచారణ చేపడితే వాస్తవాలు బట్టబయలౌతాయని సర్కిల్ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ రొనాల్ట్ రాజ్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు