- 101 సంవత్సరంలో కూడా ఉద్యోగం చేస్తున్న వృద్ధురాలు..
- నేటి యువతకు మార్గగామిగా నిలుస్తున్న వైనం..
- టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్న బామ్మ..
- ఇష్టమైన పనులు చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..
- ఆందోళనను దూరం పెట్టండి నిత్య యవ్వనంగా ఉండండి..
- అద్భుతమైన సలహాలతో ఆకట్టుకుంటున్న జేన్ బార్న్స్..
కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటాడు ఒక మహాకవి.. కానీ కొంతమంది వృద్ధులు నేటి తతరం దూతలు అని నిరూపిస్తోంది అమెరికాకు చెందిన జేన్ బార్న్స్ అనే వృద్ధురాలు.. 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా.. నూతనోత్సాహంతో వుద్యోగం చేస్తూ నేటి యువతకు రోల్ మోడల్ గా నిలుస్తోంది..
యూఎస్‌లోని ఒహియో ప్రాంత పరిధి సిన్సినాటికి చెందిన జేన్ బర్న్స్ అనే వృద్ధురాలు ఇటీవలే వందేళ్లు పూర్తి చేసుకుంది. అయినా ఈమె ఈ వయసులోనూ క్రాప్ట్స్ స్టోర్‌లో పార్ట్‌టైమ్ ఫాబ్రిక్ కట్టర్‌గా పని చేస్తోంది. ఈమె భర్త 1997లో మరణించడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. భర్త మరణించిన కొన్ని నెలలకే ఆమె పనిలో చేరింది. 26 సంవత్సరాలుగా అక్కడే పని చేస్తోంది. ఈమె తన కెరీర్‌లో చాలా వరకు బుక్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ జాబ్‌కు రాజీనామా చేసింది. ప్రస్తుతం చేస్తున్న పని తనకు ఎంతో నచ్చిందని, ఎంతో మంది సహోద్యోగులు తనకు సన్నిహితులుగా మారారని తెలిపింది. జేన్ ఇటీవల టిక్‌టాక్‌లోనూ వీడియోలు చేస్తూ అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు డాన్సులు చేస్తూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. జూలై 26న ఈమె వందేళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. జేన్ బర్న్స్‌కు వందేళ్లు నిండిన సందర్భంగా ఇటీవలే సహోద్యోగులంతా కలిసి ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పనులు చేసే ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండడం వల్ల ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదని జేన్ బర్న్స్ తెలిపింది. అలాగే ఇష్టమైన పనులు చేస్తూ నిత్యం బిజీగా ఉండడం వల్ల.. అనారోగ్య సమస్యలు దరిచేరవని, తద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చని జేన్ చెబుతోంది. హార్వర్డ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలోనూ వృద్ధురాలు చెప్పిందే నిజమని తేలింది. సంతోషం ఇవ్వని ఉద్యోగాలు చేయడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇదిలావుండగా, కాటికి కాళ్లు చాపే ఈ వయసులో, ఇన్నేళ్లు బతకడమే గగనం అనుకుంటే.. వృద్ధురాలు ఆశ్చర్యకరంగా పని చేస్తుండడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ బామ్మ గ్రేట్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.