Saturday, July 27, 2024

ధరణి లీలలు చూడతరమా…..?

తప్పక చదవండి
  • సర్వే నెంబర్ లేని ప్రభుత్వ బిలా దాఖలా భూమికి సర్వేనెంబర్ 555గా నమోదు..
  • రెవెన్యూ రికార్డులలో లేని భూమి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకోగానే
    బడా బకాసురుల పేరిట పట్టాగా నమోదు..
  • కొండాకల్ లో బిలా దాఖలా భూ(అక్రమ) దందా…
  • కొండకల్ రెవిన్యూ పరిధిలో సుమారు 117 ఎకరాలకు పైగా
    బిలా దాఖలా ప్రభుత్వ భూమి
  • వందల కోట్ల ప్రభుత్వ భూమి భూ బకాసురుల పాలు..

రంగారెడ్డి జిల్లాలో కొండకల్, మోకీల గ్రామాల రెవెన్యూ మధ్యలో రికార్డుల్లో నమోదు కాని 117 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిలో అనేక యేండ్లుగా స్థానిక రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ రైతులకు ఎలాంటి పాస్ బుక్, పహణీలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు లేదు. 2004లో పరిగి కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో అనాటి జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేతులపై కొండకల్ రైతులకు లావాణీ పట్టా భూమిగా పాస్ పుస్తకాలు అందజేశారు.

సర్వే నెంబర్ లేని ప్రభుత్వ బిలా దాఖలా భూమికి సర్వేనెంబర్ 555 గా నమోదు చేసి, లావణి పట్టా భూమిగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలను అందజేసిన విషయం విధితమే. కానీ రెవెన్యూ అధికారులు రైతులకు లావాణీ పట్టా భూమిగా పాస్ పుస్తకాలు అయితే ఇచ్చారు కానీ.. రెవెన్యూ రికార్డులలో మాత్రం రైతుల వివరాలను నమోదు చేయలేదు.. పహాణీలో గాని, అసైన్డ్ రిజిస్టర్ లో గానీ రైతులకు ఇచ్చినట్టు భూమి వివరాలను నమోదు చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమి బిలాదాఖలా భూమిగానే రెవెన్యూ రికార్డులలో కొనసాగుతూ వచ్చింది. కాగా రెవెన్యూ రికార్డులలో బిలా దాఖల భూమిగా ఉండటం, సాగు చేసుకుంటున్న రైతుల వద్ద లావాణి పట్టా పాస్ పుస్తకాలు ఉండడంతో.. ఈ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ప్రభుత్వం ఈ భూమిని ఎప్పటికైనా, ఎలాగైనా తీసుకుంటుందని కొందరు ప్రచారం చేయడం మొదలెట్టారు. ఆలస్యమైతే ఆశాభంగం, త్వరపడితే నాలుగు నూకలైనా మిగులుతాయని మధ్యవర్తులు రైతులను భయపెట్టడం జరిగిందని వినికిడి. రైతుల భయాన్ని ఆసరాగా చేసుకున్న బడా వ్యక్తులు రైతులను సంప్రదించారు.

- Advertisement -

బ్రోకర్లు, బడా వ్యక్తులు కలిసి రైతులను నిండా ముంచే పనికి శ్రీకారం చుట్టారు. ఒక ఎకరా సుమారుగా రూ. 15 నుంచి రూ.20 కోట్లు పలికే భూమికి సుమారు రూ.1 కోటి 40 లక్షలు నుంచి రూ.2 కోట్ల 20 లక్షలు వరకు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే వందల కోట్ల ప్రభుత్వ భూమి పరుల పాలవుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డులలో లేని భూమి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే బడా బకాసురుల పేరిట పట్టా కావడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కొండకల్- మోకిల గ్రామాల సరిహద్దు లో గల కొండకల్ రెవిన్యూ పరిధిలో సుమారు 117ఎకరాలకు పైగా బిలా దాఖలా భూమి ఉంది. బిలా దాఖలా భూమి అనగా కొలతకు రాని, సర్వే నెంబర్ లేని ప్రభుత్వ భూమి. అయితే ఈ ప్రభుత్వ భూమిలో చాలా సంవత్సరాల నుంచి కొండకల్ కు చెందిన సుమారుగా 50 మంది రైతులు కబ్జాలో ఉంటూ సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తమ పేరున భూమి రెవెన్యూ రికార్డులలో నమోదు కానందున రైతులు ఎన్నో మార్లు అధికారులకు ఆర్జీలు పెట్టుకున్న ఫలితం లేదు.

రైతుల పేర్లు ధరణిలో ఎందుకుండవ్…?
జిల్లాలోని రెవెన్యూ అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. బిలా దాఖాలు భూమి పట్టా భూమిగా మారినప్పుడు రైతులకు పాసుబుక్ లు ఎందుకు ఇవ్వలేదు…? ఆన్లైన్ ధరణిలో అప్లోడ్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం బడా వ్యాపారులు, అధికారులను ప్రభావితం చేసే వ్యక్తులపై ఏవిధంగా ధరణితో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో కనిపించని రైతుల పేర్లు… క్రయ విక్రయాలు జరిగిన తర్వాత ఏవిధంగా చేస్తారనే ప్రశ్నలు మిస్టరీగా మారిపోయింది. రైతుల చేతులల్లో భూములున్నప్పుడు ఏలాంటి పట్టాలు, ఆన్ లైన్ అప్డేట్, పహాణీలు ఇవ్వరు. అదే భూమి బడా వ్యాపారుల చేతుల్లోకి వెళ్తే క్షణాల్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని తెలుస్తోంది. ఏలాంటి రికార్డుల్లో లేని 117 ఎకరాల భూమి నుంచి 21 ఎకరాల భూమి ఏ పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో అర్ధంకాని పరిస్థితి శంకర్ పల్లి మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో నెలకొంది. కాసులకు కక్కుర్తిపడి రెవెన్యూ అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తూ పనులు చక్కబెడుతున్నట్లు ప్రచారం సాగుతుంది.

రెవెన్యూ మ్యాప్ లో కనిపించని 555 సర్వే నెంబర్ :
ఇక్కడే ఉంది గురూ తిరకాసంతా… ఏదైనా భూమిని ఓ వ్యక్తి కొనుగోలు చేయాలంటే ఆ భూమిని అమ్మే వ్యక్తిపై ధరణిలో పట్టా భూమిగా నమోదై ఉండాలి. కానీ ఇక్కడ అంతా ఆ నిబంధనలు తూచ్…. బిలా దాఖలా భూమిని కొనుగోలు చేసే వ్యక్తులే నగరంలో స్లాట్ బుక్ చేస్తారు. భూమిని అమ్మాలనుకునే వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ రోజున ఎన్నడూ లేనిది రెవెన్యూ రికార్డు అయిన ధరణిలో పట్టా భూమిగా ప్రత్యక్షమవుతుంది. దీంతో ఏ బాదరాబందీ లేకుండా దర్జాగా భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నది. అంతకుముందు రెవెన్యూ రికార్డులలో నమోదు కానీ భూమి, రైతు అమ్మినట్లు అక్రమార్కులు కొన్నట్లు ధరణిలో ఎంఎస్ వినాయక డెవలపర్స్ పేరిట రిజిస్ట్రేషన్ అవుతున్నది. వినాయక డెవలపర్స్ పేరుతో పాటుగా మరికొందరి బినామీల పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అక్రమ భూదందాకు తెరలేచింది. అయితే ధరణిలోని రికార్డులలో గల గ్రామ రెవెన్యూ మ్యాప్ లో ప్రస్తుతం 555 సర్వే నెంబర్ కనిపించకపోవడం కొసమెరుపు.

రేడియల్ రోడ్డు ప్రక్కనే :
వందల కోట్ల విలువైన సర్వే నెంబర్ లేని ఈ ప్రభుత్వ భూమి తెల్లాపూర్ నుంచి ఈర్లపల్లి వరకు వచ్చే 100 ఫీట్ల రేడియల్ రోడ్డు పక్కనే ఉంది. అదే విధంగా కొండకల్ ఆర్-1 జోన్ పరిధిలో ఉండడంతో భూముల ధర కోట్లలో పలుకుతున్నది. దీంతో అక్రమార్కులు అనుకున్నదే తడువుగా తమ ప్లాన్ ను సన్న, చిన్న కారు రైతులపై అమలు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులలో నమోదు కాని బిలా దాఖల ప్రభుత్వ భూమిని సుమారు ఆరు నెలల కిందటే ఏడితో సర్వే చేయించి రైతుల వివరాలను గుట్టు చప్పుడు కాకుండా నమోదు చేశారని వినికిడి. వివరాలు రెవెన్యూ రికార్డులలో కనిపించకుండా, భూమిని అమ్మే వ్యక్తి కి సంబంధించిన వివరాలు మాత్రమే విక్రయించే రోజున కనిపించేటట్లుగా చేస్తున్నారు. ఏడి సర్వే రిపోర్టు వివరాలను రైతులతో పాటుగా ఇతరులు ఎవరికి ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

అన్నీ అంతు చిక్కని ప్రశ్నలే….?
అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బహిరంగ సభలో రైతులకు సర్వేనెంబర్ 555 పేరిట లావాణి పట్టా భూమిగా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారు. కాగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేయకపోవడంతో ఆ భూమి బిలా దాఖలా భూమి గానే ఉంది.

గమనిక :
అక్రమ భూదందాకు తెరలేవడంతో ఉన్నట్టుండి రైతుల పేరిట రిజిస్ట్రేషన్ రోజు రికార్డులలో ప్రత్యక్షం కావడం ఒక ఎత్తు అయితే. రైతుల వద్ద ఉన్న లావాణీ పట్టా భూమి పాస్ పుస్తకాల ప్రకారం…. భూమిని ఎవరు అమ్మ వద్దు.. కొనవద్దు.

ఎవరైనా భూమిని కొన్న అది చెల్లుబాటు కాదనే విషయం తెలిసిందే. దాన్ని ఒకవేళ కొనుగోలు చేసిన రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని తిరిగి రైతులకే ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజా ఉపయోగార్థం లావాని పట్టా భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందనే విషయం జగమెరిగిన విషయమే.
ప్రభుత్వ భూమి పట్టా భూమిగా ఎలా రికార్డుల్లోకి ఎక్కింది….?
లావాని పటా భూమి పట్టా భూమిగా ఎలా మార్పు చెందింది.
ఈ సర్వే నెంబర్ 555 లో బై నంబర్లతో కూడిన 35మంది పేరిట ధరణిలో పట్టా భూమిగా చూపించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ తథంగమంతా భూ పరిపాలన సంబంధ అధికారులు, రెవెన్యూ అధికారుల కనసన్నల్లోనే నడుస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి రైతులకు దక్కాలి…. కానీ ఇతరుల పాలు కాకుండా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు కోరుచున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు