- 28-26తో ఢిల్లీ పాంజర్స్ పైచేయి
- ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ 2023
జైపూర్ : ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) సీజన్లో వరు సగా రెండు విజయాలు నమోదు చేసి అదరగొట్టిన తెలుగు టాలన్స్.. తర్వాతి రెండు మ్యాచుల్లో తృటిలో విజయానికి దూరమైంది!. సోమవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఢిల్లీ పాంజర్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ రెండు గోల్స్ తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. 28-26తో పైచేయి సాధించిన ఢిల్లీ పాంజర్స్ సీజన్లో రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ ఆటగాడు దీపక్ 11 గోల్స్ నమోదు చేసి ఆ జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. తెలుగు టాలన్స్ గోల్‌కీపర్ రాహుల్ కండ్లుచెదిరే రీతిలో 20 గోల్ ప్రయత్నాలను విజయవంతంగా నిలువరించినా.. టాలన్స్ రెండు గోల్స్ వెనుకంజలోనే నిలిచింది. ఢిల్లీ పాంజర్స్‌తో మ్యాచ్‌ను తెలుగు టాలన్స్ దూకుడుగా ఆరంభించింది. తొలి నిమిషంలోనే గోల్ కొట్టిన టాలన్స్ 2-0తో మొదలెట్టింది. ఆట ఐదో నిమిషంలో గోల్ ఖాతా తెరిచిన ఢిల్లీ పాంజర్స్ నెమ్మదిగా పుంజుకుంది. 13-12తో ప్రథమార్థంలో ఓ గోల్ ఆధిక్యం సాధించిన తెలుగు టాలన్స్.. ద్వితీయార్థంలోనూ దూకుడు కొనసాగించింది. విశాల్, అనిల్, రఘు, నసీబ్‌లకు తోడు దేవిందర్ సింగ్ రాణించటంతో 19-14, 22-17తో పాంజర్స్‌పై టాలన్స్ చెప్పుకోదగిన ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆట మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా.. ఢిల్లీ పాంజర్స్ రేసులోకి దూసుకొచ్చింది. 25-25తో స్కోరు సమం చేసిన ఢిల్లీ పాంజర్స్.. 28-25తో ముందంజ వేసింది. ఆఖరు నిమిషంలో స్కోరు సమం చేసేందుకు తెలుగు టాలన్స్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 26-28తో రెండు గోల్స్ తేడాతో తెలుగు టాలన్స్ సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.