Wednesday, May 22, 2024

మోడీని గద్దె దించడమే లక్ష్యం..

తప్పక చదవండి
  • నేడు పాట్నాలో భేటీ కానున్న ప్రతిపక్షాలు
  • బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం
  • ప్రతిపక్షాల ఐక్యత సమావేశానికి ముందు ముసలం
  • కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం విధించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
  • డిమాండ్‌కు అంగీకరించకపోతే భేటీకి హాజరుకామని హెచ్చరిక

న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న విపక్షాల సమావేశానికి నేడు అంకురార్పణ జరుగనుంది.. బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ అధ్యక్షతన.. నేడు పాట్నాలో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సహా వివిధ ప్రాంతీయ పార్టీలు హాజరు కానున్నాయి. 2024 ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారు. పాట్నాలోని నితీశ్ కుమార్ నివాసం నెక్ సంవాద్ కక్ష్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ భేటీకి దేశంలోని 15 పార్టీలకు సంబంధించిన అధినేతలు, ముఖ్యనేతలు పాల్గొంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే భేటీ కోసం వివిధ పార్టీలకు చెందిన నేతలు.. గురువారం సాయంత్రం వరకే పాట్నాకు చేరుకున్నాయని తెలుస్తోంది.. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ ప్రతిపక్షాల సమావేశం ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు సాగుతుందని ఆయా వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశంలో జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సహా తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా పలువురు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, బీఎస్పీ ఇప్పటికే ప్రకటించాయి.

- Advertisement -

అయితే ఈ విపక్షాల ఐక్యత సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విషయంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా దేశ ప్రజలకు తెలియజేయాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులను పక్కన పెట్టి.. బీజేపీపై ఉమ్మడి పోరాటం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు.. పార్టీలు సహకరించుకునేలా చర్చలు జరపనున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలం లేని చోట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఎలా ముందుకు సాగాలి అన్నదానిపై భేటీలో చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు గట్టి పోటీని ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కొన్ని చోట్ల త్యాగాలు చేయవలిసి వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఒప్పించే ప్రయత్నాలు కూడా ఈ భేటీలో జరగనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సమావేశానికి ఒక్కరోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. తమ డిమాండ్‌కు కాంగ్రెస్ అంగీకరించకపోతే విపక్షాల ఐక్యత సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిపోయింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై తీసుకువచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించాలని విజ్ఞప్తి చేసింది. కేజ్రీవాల్ విజ్ఞప్తితో ఆయా పార్టీలు ఆర్డినెన్స్‌ విషయంలో మద్దతు ప్రకటించాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ.. తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌ నుంచి అధికారం లాక్కున్న నేపథ్యంలో.. హస్తం పార్టీ కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించే విషయంలో తర్జన భర్జన పడుతోంది. ఇప్పుడు ఇదే కేజ్రీవాల్ ఆగ్రహానికి కారణమైంది. దీంతో చివరి వరకు వేచి చూసిన కేజ్రీవాల్.. తాజాగా అల్టిమేటం జారీ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు