- బెంగుళూరులో నిర్మాతల విన్నూత్న ప్రక్రియ..
కరోనా తర్వాత జనాలు థియేటర్‌లకు రావడం చాలా వరకు తగ్గించేశారు. మౌత్ టాక్‌ను బట్టి సినిమాలకు వెళ్తున్నారు. కథ, కథనం ఆసక్తికరంగా ఉండి కాస్త ప్రేక్షకుడి ఎంటర్‌టైన్ చేస్తుందంటే మాత్రమే థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీసినా.. కంటెంట్ లేకపోతే ఆ సినిమావైపు జనాలు కన్నెత్తికూడా చూడటం లేదు. దానికి తోడు టిక్కెట్ రేట్లు కూడా జనాలను వెనకడుగు వేసేలా ఉన్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలను థియేటర్‌లకు రప్పించాలంటే ఎన్నో పాట్లు పడాలి. ముఖ్యంగా ప్రమోషన్‌లు ఏ స్థాయిలో జరిపితే ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్‌లో వస్తాయి. ఇక ప్రేక్షకులను థియేటర్‌లకు తీసుకురావడానికి మేకర్స్ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాగా తాజాగా ఓ సినిమా బృందం వినూత్నంగా ఆలోచించి ఒక్క రూపాయికే సినిమా చూసే ఆఫర్‌ను ప్రకటించింది. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? అది టాలీవుడ్ సినిమా కాదులేండి. ‘యదా యదా హి’ అనే కన్నడ మూవీ. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. కాగా సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ గురువారం ప్రీమియర్ షోకు ఒక్క రూపాయితో సినిమా చూసే ఆఫర్‌ను పెట్టింది. బెంగళూరులోని వీరేష్ సినిమాస్, హుబ్బళిలోని సుధా సినిమాస్ థియేటర్‌లలో రూ. 1కే సినిమా చూడొచ్చు అని తెలిపింది.
ఇలా ప్రీమియర్ షోకు రూపాయి పెట్టి సినిమా చూపించడమేనది సినిమాకు మంచి హైప్ తెచ్చిపెట్టే అంశమే. దిగ్‌నాత్ మంచలే, వశిష్ట సింహ, హరిప్రియ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అడివిశేష్ నటించిన ‘ఎవరు’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. రాజేష్ అగర్వాల్ నిర్మించిన శ్రీచరణ్ పాకాల, హర్షవర్ధన్ రాజ్ సయంక్తంగా స్వరాలు సమకూర్చాడు.