- సంచలన కామెంట్లు చేసిన కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ నాయకులు చిదంబరం..
నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని ఆరోపించారు. ప్రజల ఖర్చు పెరిగేలా చేసి కేంద్రం లాభాలు వెనకేసుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచడంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని, దాంతో చివరికి వినియోగదారుడి జేబుకే చిల్లు పడుతోందని చిదంబరం చెప్పారు. ఇంధన ధరల పెంపు బయటికి కనిపించకుండా పన్నుల భారం మోపుతూ కేంద్రం ప్రజలను దోచుకుంటోందని, మాయోపాయంతో పెట్రో ధరల పెంపును దాస్తున్నదని ఆయన విమర్శించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ముడి చమురు ధరలు పెరిగాయని, ఆ సాకు చూపుతూ దేశంలో ఇంధన ధరలు పెంచారని చిదంబరం చెప్పారు. ఆ తర్వాత ముడి చమురు ధరలు దిగొచ్చినా ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయలేదని ఆయన మండిపడ్డారు.