Wednesday, October 9, 2024
spot_img

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు

తప్పక చదవండి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న మిస్టర్ కూల్‌.. 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో 220 మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫున ఆడగా.. రైజింగ్‌ పుణె సూపర్‌ జెంట్స్‌ తరఫున 30 గేమ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో 11 ఫైనల్స్‌ ఆడిన తొలి ఆడగాడు కూడా ధోనీనే కావడం విశేషం. ఇక ధోనీ తర్వాత టీం ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 243 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. దినేశ్‌ కార్తిక్ 242 మ్యాచ్‌లు, విరాట్‌ కోహ్లీ 237 మ్యాచ్‌లు, రవీంద్ర జడేజా 225 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ను ధోనీ సమం చేశాడు.

రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచింది. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పై విజ‌యం సాధించింది. తద్వారా ఐపీఎల్లో ఐదో టైటిల్‌ నెగ్గి.. ముంబై ఇండియన్స్‌ను సమం చేసింది. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ సోమవారానికి వాయిదా పడగా.. రిజర్వ్‌ డే నాడు కూడా మ్యాచ్‌ను వరుణుడు వదల్లేదు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలి ఓవర్‌ ఆడుతున్న సమయంలో వర్షం ముంచెత్తింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. అరగంట అనంతరం వరుణుడు తెరిపినిచ్చినా.. ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టింది. అర్ధర్రాతి 12.10 గంటల సమయంలో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171గా నిర్ణయించారు. దీంతో ఆరంభం నుంచే దంచికొట్టిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి.. ఐపీఎల్ టైటిల్‌ను అయిదోసారి ఎగురేసుకుపోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు