అదృష్టం తలుపు తడుతుందనే నమ్మకంతో దక్షిణ మెక్సికోకు చెందిన శాన్ పెడ్రో హుమెలులా నగర మేయర్ విక్టర్ హుగో సొస ఏకంగా ఆడ మొసలిని పెండ్లి చేసుకున్నాడు. మొసలిని పెండ్లాడితే కలిసి వస్తుందనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు శతాబ్ధాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం..ప్రేమ లేకుండా వైవాహిక బంధంలో మనగలగలేమని విక్టర్ హుగో చెప్పుకొచ్చారు. చొంతల్, హువే తెగల మధ్య నెలకొన్న శాంతిని వేడుకలో జరుపుకునే క్రమంలో ఈ వివాహ తంతును 230 ఏండ్లుగా ఇక్కడి ప్రజలు ఆచరిస్తున్నారు. చోంతల్ రాజు వేషధారణలో మేయర్ రెండు సంస్కృతుల కలయికకు సంకేతంగా సరీసృపాన్ని వివాహం చేసుకున్నాడు.ఈ వివాహ వేడుక ఇక్కడి ప్రజలు భూమితో మమేకం కావడంతో పాటు విస్తారంగా వర్షం కురవడంతో పాటు మెరుగైన పంట దిగుబడులు అందివచ్చి సామరస్యం వెల్లివిరిసేలా అనుకూలిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. వివాహ వేడుకకు ముందు మొసలిని ప్రజల ఇండ్లకు తీసుకువెళ్లి ఆటపాటలతో హోరెత్తిస్తారు. టౌన్‌హాల్‌లో పెండ్లి వేడుక జరగగా, తమ బతుకులు బాగుపడాలని మత్స్యసంపద వెల్లివిరియాలని మత్స్యకారులు కోరుకున్నారు. మొసలితో కలిసి మేయర్ డ్యాన్స్ చేయగా సరీసృపం ముక్కుపుడకను మేయర్ ముద్దాడటంతో వివాహ తంతు ముగిసింది.